బిఎల్ఓలు ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించాలి

 


బిఎల్ఓలు ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించాలి


అర్హ‌త ఉన్న‌వారంద‌రికీ ఓటుహ‌క్కు త‌ప్ప‌నిస‌రి

ఓటుకు ఆధార్‌ను అనుసంధానం చేయాలి

జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి


విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 07 (ప్రజా అమరావతి) ః

                    బిఎల్ఓలు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌తీ ఇంటికీ వెళ్లి స‌ర్వే చేయాల‌ని, అర్హ‌త ఉన్న‌వారంద‌రికీ ఓటుహ‌క్కు క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఒక్క ఇంటిని కూడా ఒద‌ల‌డానికి వీల్లేద‌ని, శ‌త‌శాతం స‌ర్వే జ‌ర‌గాల‌ని స్ప‌ష్టం చేశారు. విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని 219 మంది బూత్ లెవెల్ అధికారుల‌కు, ప్ర‌త్యేక ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో బుధవారం అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.


                   ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ఓట‌ర్ల జాబితాల స‌వ‌ర‌ణ‌కు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంద‌ని, యుద్ద‌ప్రాతిప‌ధిక‌న స‌ర్వే నిర్వ‌హించాల‌ని సూచించారు. 17 ఏళ్లు నిండిన వారివ‌ద్ద నుంచి కూడా ఓటు కోసం ద‌ర‌ఖాస్తు స్వీక‌రించాల‌ని, వారికి 18 ఏళ్లు నిండిన వెంట‌నే ఓటుహ‌క్కు క‌ల్పించ‌బ‌డుతుంద‌ని చెప్పారు. మ‌ర‌ణించిన వారు, వ‌ల‌స వెళ్లి పోయిన‌వారి పేర్ల‌ను తొల‌గించి, ఖ‌చ్చిత‌మైన ఓట‌ర్ల జాబితాల‌ను త‌యారు చేయాల‌న్నారు. ఓట‌ర్ల న‌మోదులో బిఎల్ఓల‌దే కీల‌క పాత్ర అని, పౌరుల‌కు ఎంతో అత్యున్న‌త‌మైన ఓటుహ‌క్కును క‌ల్పించే అధికారం వారికే ఉంద‌ని అన్నారు. స‌ర్వే చేసిన‌ప్పుడు ఆధార్ కార్డు తీసుకొని, ఓటుకు ఆధార్‌ను అనుసంధానం చేయాల‌ని సూచించారు. బిఎల్ఓలు విధి నిర్వ‌హ‌ణ‌లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, నిర్ల‌క్ష్యాన్ని విడిచిపెట్టాల‌ని అన్నారు. ముఖ్యంగా విద్యాసంస్థ‌లు, హాస్ట‌ళ్లు, వ‌ర్కింగ్ ఉమెన్ హాస్ట‌ళ్లుపై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టి, ఆయా సంస్థ‌ల్లో ఉన్న ప్ర‌తీఒక్క‌రి ఓటుహ‌క్కు క‌ల్పించాల‌ని చెప్పారు. ఓట‌ర్ రేషియో, జెండ‌ర్ రేషియోపై దృష్టి పెట్టాల‌న్నారు. ఎక్క‌డ ఉన్న‌వారికి అక్క‌డే ఓటుహ‌క్కు క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.


                  ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్.శ్రీ‌రాముల‌నాయుడు, స‌హాయ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు, తాశిల్దార్ బంగార్రాజు, ఇత‌ర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


Comments