ఘనంగా జగనన్న క్రీడా సంబరాల ప్రైజ్ మనీ పంపిణీ...విజయవాడ (ప్రజా అమరావతి);*ఘనంగా జగనన్న క్రీడా సంబరాల ప్రైజ్ మనీ పంపిణీ...


*

మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడం కోసం, గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యం గుర్తించి వారిని జాతీయ స్థాయిలో ఆడించడమే లక్ష్యంగా జగనన్న క్రీడా సంబరాలతో పాటు వివిధ రకాల టోర్నమెంట్లు నిర్వహించామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ప్రైజ్ మనీ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమానాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజాతో కలిసి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ లు ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్ – హెల్త్ ఫర్ ఆల్’ కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు. 


ఈ సందర్భంగా మంత్రి ఆర్.కె. రోజా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలలపాటు జరిగిన జగనన్న క్రీడా సంబరాలలో కబడ్డీ, వాలీబాల్‌, బ్మాడ్మింటన్‌, క్రికెట్‌ పోటీలను తొలుత నియోజకవర్గ, జిల్లా, జోన్‌ స్థాయిలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు.  గత చరిత్రలో ఎన్నడూ, ఎప్పుడూ లేనివిధంగా జగనన్న పుట్టిన రోజు బుధవారం విజేతలకు రూ.50 లక్షల విలువైన బహుమతులు అందజేయడం ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. శాప్ ఆధ్వర్యంలో క్రీడా రంగానికి తగిన ప్రాధాన్యత కల్పించి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ పోటీలతో క్రీడాకారుల డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉండటంతో ప్రభుత్వ పరంగా ఏ సాయం చేయగలమో ఆలోచన చేస్తామన్నారు.  గెలుపు ఓటములు సహజమని కానీ క్రీడా స్ఫూర్తి ముఖ్యమని ఆయన అన్నారు. గెలుపే లక్ష్యంగా సాధన చేయాలని ఆయన సూచించారు. క్రీడాకారులు ప్రతిభ చూపించాలని తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 50వ జన్మదినం సందర్భంగా మంగళవారం సాంస్కృతిక శాఖ మంత్రిగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల ద్వారా కళాకారుల నుంచి, బుధవారం క్రీడా శాఖల మంత్రిగా  జగనన్న క్రీడా సంబరాల పేరుతో ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి మంత్రి రోజా అన్నారు. 


శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ... ఏ క్రీడకు సంబంధించి ఆ క్రీడలో ఒకరు స్పూర్తి అని, రాజకీయాల్లో తమకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  స్పూర్తి అని తెలిపారు. సీఎం జగన్ నిరంతర శ్రామికుడు, పోరాట యోధుడు అని కొనియాడారు. ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేశారని.. పాదయాత్ర చేశారని, రైతులు, విద్యార్థుల కోసం పోరాడరని గుర్తుచేశారు. నమ్ముకున్న ప్రతి ఒక్కరినీ నాయకుడిని చేసి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. క్రీడల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి శాప్ ఎప్పుడూ అండదండలు అందిస్తుందని తెలిపారు. విద్యార్ధులకు, క్రీడాకారుల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బాధ్యత తీసుకున్నారని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలన్నీ ఒక ఎత్తయితే.. జగనన్న క్రీడా సంబరాలు, జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు మరో ఎత్తు అని కొనియాడుతూ శాప్ తరపున ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.


ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విజయవాడ సాంస్కృతిక, క్రడీల రాజధాని అన్నారు. విజయవాడ నుంచి, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆడిన క్రీడాకారులు ఎంతోమంది ఒలింపిక్స్ కు కూడా వెళ్లి ఆడారని తెలిపారు. రాష్ట్రంలో 4 జోన్లలో ఈ సంబరాలు నిర్వహించి, ముగింపు సభ విజయవాడలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు. రాష్ట్రంలో క్రీడల పురోభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలు క్రీడల అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జి.వాణి మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు, శాప్ డైరెక్టర్లు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు. 

 

*జగనన్న క్రీడా సంబరాలు – 2022 విజేతలు వీరే...* 

కబడ్డీ పురుషుల విభాగంలో మొదటి ప్రైజ్ బాపట్ల జిల్లా పర్చూరు నియోజవర్గం గెలుపొందగా, రెండవ ప్రైజ్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కైవసం చేసుకుంది.   కబడ్డీ మహిళల విభాగంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం సాధించగా, రెండో ప్రైజ్ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం గెలుచుకుంది.

వాలీబాల్ పురుషుల విభాగంలో మొదటి ప్రైజ్ పెందుర్తి (విశాఖపట్నం) గెలుపొందగా, రెండవ ప్రైజ్ కొవ్వూరు (తూర్పు గోదావరి) కైవసం చేసుకుంది. వాలీబాల్ మహిళల విభాగంలో కర్నూలు (కర్నూలు జిల్లా) సాధించగా, రెండో ప్రైజ్ గాజువాక (విశాఖపట్నం జిల్లా) గెలుచుకుంది.

క్రికెట్ పురుషుల విభాగంలో మొదటి ప్రైజ్ గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ నియోజవర్గం గెలుపొందగా, రెండవ ప్రైజ్ విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం కైవసం చేసుకుంది. 

బ్యాడ్మింటన్ పురుషులు సింగిల్స్ విభాగంలో మొదటి ప్రైజ్ పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలుకు చెందిన గుణశేఖర్ గెలుపొందాడు. రెండవ ప్రైజ్ గుంటూరుకు చెందిన చంద్ర గోపీనాథ్ కైవసం చేసుకున్నాడు.  

బ్యాడ్మింటన్ పురుషులు డబుల్స్ విభాగంలో మొదటి ప్రైజ్ కిరణ్ మౌళి (ఏలూరు), జయన్ జేమ్స్ (కోనసీమ) సాధించగా, రెండవ ప్రైజ్ చంద్ర గోపినాథ్ (గుంటూరు), కార్తికేయ (గుంటూరు) గెలుపొందారు. .  

బ్యాడ్మింటన్ మహిళలు సింగిల్స్ విభాగంలో మొదటి ప్రైజ్ సీహెచ్. ఎస్. ఆర్. ప్రణవి (గిద్దలూరు, ప్రకాశం జిల్లా) గెలుపొందగా, రెండవ ప్రైజ్ కె. ప్రీతి (ఎస్. కోట, విజయనగరం జిల్లా) కైవసం చేసుకుంది. 

బ్యాడ్మింటన్ మహిళలు డబుల్స్ విభాగంలో మొదటి ప్రైజ్ డి. దీపిక (గుంటూరు), డి. స్రవంతి (గుంటూరు) సాధించగా, రెండవ ప్రైజ్ కె. ప్రీతి (విజయనగరం), డి. సుధా కళ్యాణి (విజయనగరం) గెలుపొందారు.


Comments