వినూత్నం.. ఆవిర్భావ దినోత్సవం.



*వినూత్నం.. ఆవిర్భావ దినోత్సవం* 



పార్వతీపురం, ఏప్రిల్ 4 (ప్రజా అమరావతి): పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి మంగళ వారానికి ఏడాది పూర్తి అయింది. ఆవిర్భావ దినోత్సవం చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. వినూత్నంగా చేస్తే బాగుంటుందని ఆలోచించింది. అవును.. ఆవిర్భావ దినోత్సవం రోజున శ్రమదానం నిర్వహించి ఒక సందేశాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నేతృత్వంలో శ్రీకారం చుట్టింది జిల్లా యంత్రాంగం. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో పాటు పోలీస్ సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ డా. ఓ.దిలీప్ కిరణ్, జిల్లా అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జూనియర్ కళాశాల, టౌన్ పోలీస్ స్టేషన్, రెవిన్యూ డివిజనల్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ బంగళా వరకు గల రహదారిలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించడం, ప్రహారీ గోడలకు సున్నం వేసి సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పోలీస్ సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ డా. ఓ.దిలీప్ కిరణ్ లు స్వయంగా గోడలకు సున్నం వేసి, చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేసి, కాలువల్లో పేరుకు పోయిన పూడికలను తొలగించి స్ఫూర్తిని, ప్రేరణను కల్పించారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆవిర్భావ దినోత్సవం వివిధ రకాలుగా చేయవచ్చని, ఒక మంచి సందేశం అందించాలని శ్రమదానం చేశామన్నారు. ప్రతీ అంశంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలి అనేది కర్తవ్యం అన్నారు. అదే కర్తవ్యం, సంకల్పంతో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. గత ఏడాది కాలంలో జిల్లా మొట్ట మొదటి పరిపాలనా బృందంలో గల అధికారులు, సిబ్బంది చక్కగా పనిచేశారని కొనియాడారు. చక్కటి ప్రణాళికలతో, మంచి ప్రయత్నంతో లక్ష్యాలు సాధించామని అన్నారు. ఇదే స్ఫూర్తి, పట్టుదల, అంకితభావంతో రానున్న రోజుల్లో పనిచేసి జిల్లాను అభివృద్ది పథంలో నడిపేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సుందర పట్టణంగా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. జిల్లాలో ప్రతి ఎకరాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందినపుడు, ప్రతి ఎకరాలో పంట వేసి అధిక దిగుబడులు సాధించినప్పుడు, ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారినపుడు, ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడు, ప్రతి ఒక్కరూ అవగాహనతో ఆరోగ్య సేవలకు చేరువైనపుడు, ఇలా అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ది సాధించినప్పుడు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుందామని సూచించారు. జిల్లా అభివృద్ధికి అందరూ సిద్ధం అనే సందేశంతో శ్రమదానంకు ఉపక్రమించామని వివరించారు. జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు, ప్రతినిధులు తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. 


 పోలీస్ సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లా ఆవిర్భావ దినోత్సవం వినూత్నంగా నిర్వహించుటకు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ ను అభినందించారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు సంతృప్తికర సేవలు అందించాలని ఆయన కోరారు. 


శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని స్ఫూర్తిదాయక పనులు చేసిన వైద్య ఆరోగ్య శాఖ బృందానికి, పశు సంవర్థక - టి.పి.ఎం.యు బృందం, పోలీసు బృందం, ఐసిడిఎస్ బృందానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేశన్ బహుమతులను అందజేశారు. 


ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత, డి.ఎస్.పి బలివాడ నాగేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు, ఆర్.బి.ఎస్.కె ప్రాజెక్టు అధికారి డా. ధవళ భాస్కరరావు, జిల్లా పశు సంవర్థక అధికారి డా. ఏ. ఈశ్వర రావు, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణా జి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, మునిసిపల్ కమీషనర్ ఎం.రామ అప్పల నాయుడు, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments