సీఆర్డీఏను బురిడీ కొట్టిస్తూ చినఎరుకపాడులో అనధికారిక రియల్ వెంచర్లు.

 *- సీఆర్డీఏను బురిడీ కొట్టిస్తూ చినఎరుకపాడులో అనధికారిక రియల్ వెంచర్లు* 


 *- భూయజమానితో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు* 

 *- రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే ప్లాట్ల అమ్మకాలు* 

 *- రెవెన్యూకు నాలా పన్నులూ చెల్లించడం లేదు* 

*- ప్లాట్లను విభజిస్తూ సర్వే రాళ్ళు కన్పించవు* 

 *- కాగితాలపైనే అగ్రిమెంట్లను కానిచ్చేస్తున్నారు* 

 *- రిజిస్ట్రేషన్ల ప్రక్రియకూ సిద్ధమైపోతున్నారు* 



గుడివాడ, ఏప్రిల్ 19 (ప్రజా అమరావతి): సీఆర్డీఏను బురిడీ కొట్టిస్తూ కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం చినఎరుకపాడులో కొంతమంది రియల్టర్లు అనధికారికంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు పాల్పడుతున్నారు. ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే తప్పనిసరిగా భూమిని కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారు. చినఎరుకపాడులో వేసిన అనధికారిక రియల్ వెంచర్లో మాత్రం వ్యవసాయ భూమిని కొని రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే భూస్వామితో చేసుకున్న అగ్రిమెంట్ ఆధారంగా ప్లాట్ల అమ్మకాలకు తెగబడుతున్నారు. రియల్ వెంచర్ వేయాలంటే ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం మార్కెట్ వాల్యూపై 5 శాతాన్ని రెవెన్యూశాఖకు తప్పనిసరిగా చెల్లించాలి. అయితే రెవెన్యూశాఖకు కూడా ఎటువంటి పన్నులు చెల్లించకుండా వ్యవసాయ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నప్పటికీ సంబంధిత వీఆర్వో దగ్గర నుండి ఆర్టీవో స్థాయి వరకు ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా వ్యవసాయ భూముల్లోనే గ్రావెల్ పర్చి అనధికారిక రియల్ వెంచర్లు వేస్తున్నారు. కనీసం ప్లాట్లుగా విభజించి సర్వే రాళ్ళను కూడా పాతడం లేదు. అనధికారిక లేఅవుట్ దగ్గర నుండి ప్లాట్లు, రోడ్లు, మౌలిక వసతులన్నీ కాగితాలపైనే చూపిస్తున్నారు. ప్లాట్ల కొనుగోలుదారులను మోసం చేస్తూ అదే కాగితాలపై అగ్రిమెంట్లను కూడా కానిచ్చేస్తున్నారు. చివరికి ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కూడా సిద్ధమైపోతున్నారు. ఎక్కడైనా అధికారికంగా లేఅవుట్ వేయాలంటే సీఆర్డీఏ అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలి. ముందుగా భూమి మార్కెట్ విలువపై 5శాతం పన్నును రెవెన్యూకు చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా లేఅవుట్ ప్యాట్రన్ ను ప్రారంభించాలి. పది శాతం ఓపెన్ స్పేస్, రెండు శాతం ఎమినిటీస్, మరో రెండు శాతం యుటిలిటీస్ సమకూర్చాలి. 40 అడుగుల రోడ్లను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. లేఅవుట్ డ్రాయింగ్ తో పాటు అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి సీఆర్డీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరో రెండేళ్ళలో రోడ్లు, మంచినీటి పైప్ లైన్లు, డ్రైన్లు, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలి. అప్పుడే ఫైనల్ లేఅవుట్ ప్యాట్రన్ ను జారీ చేస్తారు. అధికారికంగా లేఅవుట్ వేయలేని వారు అనధికారిక లేఅవుట్ లకు పాల్పడుతున్నారు. ప్లాట్లు తక్కువ ధరలకు వస్తున్నాయన్న ఆశతో అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి బ్యాంక్ రుణం, ఇంటి నిర్మాణ ప్లాన్, విద్యుత్ సౌకర్యం వంటివి వచ్చే అవకాశం లేదు. ఇవన్నీ కావాలంటే మార్కెట్ వాల్యూపై 14 శాతం పన్నును ఆయా ప్రభుత్వశాఖలకు చెల్లించాల్సిన పరిస్థితులున్నాయి. ఇది తెలియక ఎంతో మంది ప్లాట్లను కొనుగోలు చేసి ప్రభుత్వశాఖలకు అదనపు పన్నులను చెల్లించడం జరుగుతోంది. ఇలా అదనపు పన్నులు చెల్లించినా 40 అడుగుల రోడ్డు ఒక్కటీ కనిపించదు. ఇలాంటి అనధికారిక లేఅవుట్లలో చాలీచాలని రోడ్లే దిక్కవుతున్నాయని పలువురు ప్లాట్ల కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి వ్యవసాయ భూముల్లో వేస్తున్న అనధికారిక రియల్ వెంచర్లపై దృష్టి పెట్టాలని పలువురు ప్లాట్ల యజమానులు కోరుతున్నారు. అలాగే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినందుకు మార్కెట్ వాల్యూపై చెల్లించాల్సిన 5 శాతం పన్నులు ప్రభుత్వానికి సమకూరేలా రెవెన్యూ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి అనధికారిక లేఅవుట్లపై సీఆర్డీఏ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా దృష్టిసారించి ప్లాట్ల కొనుగోలుదారులు మోసపోకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Comments