భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు
ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు
డా.అంబేద్కర్ రాజ్యాంగమే దేశాన్ని నేటికీ ఐక్యంగా వుంచుతోంది
ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి
డా.అంబేద్కర్ గొప్ప మేథావి : జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి
మహిళలు, బడుగు బలహీనవర్గాలకు హక్కులు అంబేద్కర్ చలవే : జిల్లా ఎస్.పి. దీపిక
విజయనగరం, ఏప్రిల్ 14 (ప్రజా అమరావతి):
ఎన్నో జాతులు, మతాలు, కులాలతో కూడిన మన దేశం నేటికీ ఐక్యంగా వున్నదంటే అందుకు కారణం భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ అందించిన రాజ్యాంగమేనని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రాజ్యాంగం రూపంలో దేశానికి ఆయన వేసిన పటిష్టమైన పునాది దేశాన్ని నిలబెడుతోందన్నారు. దేశ ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడిగా నిలుస్తారని పేర్కొన్నారు. భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి.ఎస్., జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీమతి దీపిక, నగర మేయర్ వి.విజయలక్ష్మి తదితరులతో కలసి డా.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ తనకున్న మేథోశక్తితో, పరిజ్ఞానంతో దళిత, గిరిజన వర్గాల వారిని సమాజంలోని ఇతర వర్గాలతో సమానస్థాయికి తీసుకురావాలని పరితపించి ఎంతగానో కృషిచేసిన మహనీయుడు డా.అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో సమానత్వ భావన నేడు ఏర్పడిందంటే అందుకు దోహదం చేసింది అంబేద్కర్ రాజ్యంగమేనని చెప్పారు. ఆయన ఆలోచన విధానాన్ని అందించిన స్ఫూర్తితోనే మన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్‌లో ఎస్.సి, ఎస్.టి. వర్గాలను ఉపముఖ్యమంత్రులుగా చేశారని పేర్కొన్నారు. దళిత కుటుంబంలో పుట్టకపోయినప్పటికీ తాను రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి నగరంలోని ఎస్.సి. వర్గాలతో, 32 దళిత వాడలతో తనకు ప్రత్యేక అనుబంధం వుందన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి.ఎస్ మాట్లాడుతూ డా.బి.ఆర్.అంబేద్కర్ మేథో పరిజ్ఞానం కేవలం ఏదో ఒక అంశానికే పరిమితం కాదని ఆర్ధిక, రాజకీయ, సామాజిక, న్యాయ శాస్త్రాలన్నింటిలో పరిజ్ఞానం గల మహనీయుడు డా.అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి జీవితకాలంలో ఎంతమేరకు కృషిచేయగలరనే దానికి డా.అంబేద్కర్ జీవితమే ఉదాహరణ అని చెప్పారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్ధులు మంచి విద్యావంతులుగా రూపొంది ఉన్నత శిఖరాలకు చేరుకొనే ప్రయత్నం చేయాలన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొనే రాష్ట్ర ప్రభుత్వం బడుగు వర్గాల పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్య, కాన్సెప్ట్ స్కూల్స్ ఏర్పాటు వంటి ఉత్తమ విద్యా సౌకర్యాలను కల్పిస్తోందని, వీటిని వినియోగించుకొని విద్యార్ధులు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. సమసమాజాన్ని స్థాపించడంలో, డా.అంబేద్కర్ ఆశయ సాధనలో అంతా కలసి పనిచేయాల్సి వుందన్నారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీమతి దీపిక మాట్లాడుతూ దేశంలో అందరికీ సమానహక్కులు కల్పించాలనే గొప్ప భావన ఆ రోజుల్లోనే వచ్చిందటే ఆయన ఎంత దార్శనికుడో అర్ధమవుతుందని పేర్కొన్నారు. దేశంలోని మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేక హక్కులు కల్పించడం ద్వారా వారు ఇతరులతో సమాన అవకాశాలు పొందే పరిస్థితిని ఏర్పరిచారని తెలిపారు.
నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.అంబేడ్కర్ అని పేర్కొన్నారు. బాలాజీ జంక్షన్‌కు డా.అంబేద్కర్ జంక్షన్‌గా నామకరణం చేశామన్నారు.
విద్య ద్వారానే బడుగు బలహీనవర్గాల వారు అభివృద్ధి చెందగలరనే విషయాన్ని అంబేద్కర్ చెప్పారని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చెప్పారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్ధులు ఉన్నత స్తానాలకు చేరుకొనే కృషిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.సి. వర్గాలకు చెందిన నాయకులు పీరుబండి జైహింద్ కుమార్, ఆదాడ మోహనరావు తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్‌లు కోలగట్ల శ్రావణి, రేవతి, డి.సి.ఎం.ఎస్. ఛైర్ పర్సన్ అవనాపు భావన, డిసిసిబి ఛైర్మన్ వేచలపు చినరామునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, సాంఘిక సంక్షేమ డి.డి. రత్నం, అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయ అధికారిణి చంద్రావతి, ఎస్.సి. నాయకుడు గోకా రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన పలువురు విద్యార్ధులు డా.అంబేద్కర్ జీవితంపై పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. నెల్లిమర్ల, వేపాడ, చీపురుపల్లి, బాడంగి, వియ్యంపేట, కొప్పెర్ల గురుకులాలకు చెందిన బాలబాలికలు పలు గీతాలు పాడి, సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు.
addComments
Post a Comment