మే 9 నుండి జగనన్నకు చెబుదాం.



*మే 9 నుండి జగనన్నకు చెబుదాం


*


పార్వతీపురం, మే 2 (ప్రజా అమరావతి): జగనన్నకు చెబుదాం కార్యక్రమంను మే 9వ తేదీన ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ముఖ్య మంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన చెప్పారు. ముఖ్య మంత్రి కార్యాలయం పరిధిలో 1902 నంబరు కాల్ సెంటర్ పనిచేస్తుందని ఆయన అన్నారు. ముఖ్య మంత్రి కార్యాలయం నుండి ఆడిట్ టీమ్ లను ఏర్పాటు చేశారని, ప్రతి ఆర్జీని కాల్ సెంటర్ నుండి అడుగుతారని ఆయన తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై మండల అధికారులు, పోలీసు అధికారులతో జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి కార్యాలయం నుండి జిల్లాల వారీగా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. జిల్లాకు ప్రత్యేక అధికారిగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రను నియమించారని,  మే 10న జిల్లాలో పర్యటిస్తారని ఆయన అన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన విజ్ఞాపనలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అందుకు అందరూ బాధ్యత వహించాలని ఆయన ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో సమస్యల పరిష్కార అథారిటీ (గ్రీవెన్స్ రిడ్రస్సల్ అథారిటీ) ప్రతి కార్యాలయంలో ఉండాలని అన్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో పక్కాగా అమలు జరగాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గురువారం ప్రత్యేక పర్యవేక్షణ చేసి నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. పత్రికలలో ప్రచురితమైన ప్రతికూల వార్తలను సైతం పక్కాగా పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. 24 గంటల వ్యవధిలో పరిష్కారానికి అవసరమైన చర్యలు సంబంధిత అధికారి చేపట్టాలని, లాగిన్ లో ఎప్పటి కప్పుడు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఆర్జీలు నిర్దేశిత సమయంలో పరిష్కారం కావాలని అన్నారు. ఆర్జీదారునితో మాట్లాడి లేదా కలుసుకుని పరిష్కారం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఆర్జీదారు నమ్మకంతో వస్తారని, పరిష్కారం పక్కాగా ఉండాలని ఆయన అన్నారు. శత శాతం పరిష్కారం ఉండాలని, సంతృప్త స్థాయి నూరు శాతం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆర్జీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తానని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఆర్జీలోని విషయం చదవకుండా త్రిప్పి పంపుతున్న సంఘటనలు కూడా తమ దృష్టికి వస్తున్నాయని అన్నారు. చిన్న అంశాలపై వచ్చే ఆర్జీలను కూడా సక్రమంగా పరిష్కరించడం లేదని, అవి మరల వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిజంగా అర్హత ఉంటే వారికి మంజూరు చేస్తామని ఆయన అన్నారు. భూ సంబంధిత కేసులో పరిష్కారానికి నిబంధనల మేరకు అవకాశం ఉందని, తహశీల్దార్, పోలీసు ఎస్.ఐ కలిసి పరిష్కరించవచ్చని ఆయన అన్నారు. అయితే అటువంటి పరిస్థితుల్లో సివిల్ కోర్టుకు వెళ్ళమని చెపుతున్నారని అది సరైన చర్య కాదని ఆయన చెప్పారు. న్యాయం చేయుటకు అవకాశం ఉందని, చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. 


*ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్*


జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి, ఎల్విన్ పేట ఎస్.డి.సి, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి ఒక అధికారి, జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఒక ఇన్స్పెక్టర్ తదితరులు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ లో ఆడిట్ విభాగంలో ఉంటారని, వారి నుండి ఫోన్ వస్తే వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాను ఆదర్శంగా నిలుపుటకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు. 


పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఒక ఆర్జీదారు పలుమార్లు ఒక సమస్య పరిష్కారానికి రాకూడదని, అందుకు పక్కాగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ వాణిజ్య, రవాణా అధికారి ఎల్. అశోక్ కుమార్, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments