ఎస్‌డీజీల స్థానికీకరణ: భారతదేశ స్థానిక పరిపాలనకు నాయకత్వం వహిస్తున్న మహిళలు.



ఈ నెల 3న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే సీపీడీ57 ఉప కార్యక్రమం “ఎస్‌డీజీల స్థానికీకరణ: భారతదేశ స్థానిక పరిపాలనకు నాయకత్వం వహిస్తున్న మహిళలు”లో పాల్గొంటున్న పంచాయతీ రాజ్ సంస్థల మహిళా ప్రజాప్రతినిధులు 


హైదరాబాద్ (ప్రజా అమరావతి);


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే సీపీడీ57 ఉప కార్యక్రమానికి భారతదేశ స్థానిక సంస్థలకు ఎన్నికైన ముగ్గురు మహిళా ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి శ్రీమతి కునుకు హేమకుమారి కూడా పాల్గొంటున్నారు. 2024 ఏప్రిల్ 29 నుంచి మే 3వ తేదీ వరకు, 'కమిషన్‌ ఆన్‌ పాపులేషన్‌ & డెలవప్‌మెంట్‌' (సీపీడీ57) 57వ సెషన్‌ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరుగుతోంది. 'యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్' (యూఎన్‌ఎఫ్‌పీఏ) సహకారంతో, ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత మిషన్, భారత పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఉమ్మడిగా “ఎస్‌డీజీల స్థానికీకరణ: భారతదేశ స్థానిక పరిపాలనకు నాయకత్వం వహిస్తున్న మహిళలు” పేరిట ఒక ఉప కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 3వ తేదీన ఆ కార్యక్రమం జరుగుతుంది. త్రిపురలోని సెపాహిజాల జిల్లా పరిషత్‌ సభాధిపతి శ్రీమతి సుప్రియా దాస్ దత్తా; ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ శ్రీమతి కునుకు హేమకుమారి; రాజస్థాన్‌లోని లంబి అహీర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి నీరు యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. భారతదేశంలోని స్థానిక సంస్థలకు ఎన్నికైన మహిళా ప్రతినిధులందరి తరపున ఈ ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.


క్షేత్రస్థాయి పరిపాలన, రాజకీయ నాయకత్వంలో భారతీయ మహిళలు పోషిస్తున్న కీలక పాత్రను “ఎస్‌డీజీల స్థానికీకరణ: భారతదేశ స్థానిక పరిపాలనకు నాయకత్వం వహిస్తున్న మహిళలు” కార్యక్రమం ప్రపంచానికి చాటుతుంది. గ్రామీణ స్థాయిలో సుస్థిరాభివృద్ధి కోసం మహిళలు చేస్తున్న గణనీయమైన కృషిని వివరిస్తుంది. ఈ కార్యక్రమం, ఈ నెల 3వ తేదీన (శుక్రవారం) రాత్రి 10:45 గంటలకు పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మహిళా సాధికారతలో భారతదేశ స్ఫూర్తిదాయక కృషిని ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. (https://webtv.un.org/en/asset/k1e/k1e5k5ukq7)


ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి రుచిరా కాంబోజ్ ఈ కార్యక్రమంలో ప్రారంభ ప్రసంగం చేస్తారు. లింగ సమానత్వాన్ని పెంచడంలో భారత పంచాయతీ రాజ్ సంస్థల (పీఆర్‌ఐలు) కీలక పాత్రను వివరిస్తారు. ఆ తర్వాత, మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ మాట్లాడతారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతను పెంచేందుకు పంచాయితీ రాజ్ సంస్థల ద్వారా అమలు చేస్తున్న వ్యూహాలను వివరిస్తారు. ముఖ్యంగా, పేదరికం తగ్గింపు, సమ్మిళిత అభివృద్ధి గురించి మాట్లాడతారు. మహిళా నాయకత్వంలో స్థానిక పరిపాలన అనుభవాల ఆధారంగా తన అభిప్రాయాలను కూడా శ్రీ వివేక్ భరద్వాజ్ పంచుకుంటారు.


ఎంపికైన ముగ్గురు మహిళా ప్రతినిధులతో (ఈడబ్ల్యూఆర్‌లు) ప్యానెల్ చర్చ ఉంటుంది. స్థానిక పరిపాలనలో తమ అనుభవాలు, అభిప్రాయాలను ఈడబ్ల్యూఆర్‌లు వెల్లడిస్తారు. త్రిపుర పంచాయితీల్లో సమ్మిళిత అభివృద్ధిని ఆరంభించడంలో మహిళల నాయకత్వ పాత్రను శ్రీమతి సుప్రియా దాస్ దత్తా వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్ సామాజికాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో పంచాయితీల పాత్రను శ్రీమతి కునుకు హేమకుమారి వెల్లడిస్తారు. రాజస్థాన్ మహిళలు, బాలికలతో స్నేహపూర్వక పంచాయితీలను ప్రోత్సహించడంలో తమ అనుభవాన్ని శ్రీమతి నీరు యాదవ్ పంచుకుంటారు.


యూఎన్‌ఎఫ్‌పీఏ ఆసియా పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ మిస్టర్ పియో స్మిత్, యూఎన్‌ఎఫ్‌పీఏ భారతదేశ ప్రతినిధి శ్రీ ఆండ్రియా ఎం వోజ్నార్, ఎంవోపీఆర్‌ సంయుక్త కార్యదర్శి శ్రీ అలోక్ ప్రేమ్ నగర్ కూడా సీపీడీ57 ఉప 

కార్యక్రమంలో పాల్గొని, తమ అభిప్రాయాలను పంచుకుంటారు. 


సీపీడీ57 ఉప కార్యక్రమానికి ఎన్నికైన ముగ్గురు మహిళా ప్రతినిధులు గ్రామీణ స్థాయిలో సానుకూల మార్పును తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. స్థానిక పరిపాలనలో నిమగ్నమైన మహిళా ప్రజాప్రతినిధుల విషయంలో భారతదేశం ముందంజలో ఉంది, 14 లక్షల మంది మహిళలు పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికయ్యారు. ఎన్నికైన మొత్తం ప్రతినిధుల్లో వీరిది 46% వాటా. లింగ సమానత్వం, పేదరిక నిర్మూలన, అట్టడుగు స్థాయిలో సమగ్ర అభివృద్ధి కోసం భారతదేశం అనుసరిస్తున్న విధానాలను, ఈడబ్ల్యూఆర్‌లు పోషిస్తున్న కీలక పాత్రను సీపీడీ57 ఉప కార్యక్రమం హైలైట్‌ చేస్తుంది.


స్థానిక పరిపాలనలో మహిళ నాయకత్వం, తీసుకున్న చొరవ, ఎస్‌డీజీల స్థానికీకరణ ద్వారా ఈడబ్ల్యూఆర్‌లు తీసుకొచ్చిన సానుకూలమైన & ప్రభావవంతమైన మార్పు గురించిన విజయగాథలు ఈ కార్యక్రమంలో వినిపిస్తాయి. ఎస్‌డీజీలతో సమన్వయం చేసుకుంటూ స్థానిక అభివృద్ధిని నడిపించే పరివర్తన పాత్రధారులుగా ఈడబ్ల్యూఆర్‌లను శక్తివంతం చేయడంలో భారతదేశం పరివర్తన విధానం విస్తరించిన తీరును ఈ కర్యక్రమం వివరిస్తుంది.


జీ20 అధ్యక్ష బాధ్యతల సమయంలో, మహిళా సాధికారతపై కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా 'లింగ సమానత్వం & మహిళల నేతృత్వంలోని అభివృద్ధి'పై తన నిబద్ధతను భారతదేశం మరోమారు నిరూపించుకుంది. గ్రామీణ భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరించడంలో, లక్ష్యాలను సాధించడంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ చురుకైన నాయకత్వ పాత్రను పోషించింది. పంచాయితీ రాజ్ సంస్థల ద్వారా ఎస్‌డీజీలను స్థానికీకరించడానికి పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది, 17 ఎస్‌డీజీలను తొమ్మిది అంశాలుగా ఏకీకృతం చేసింది. ముఖ్యంగా, మహిళల ప్రయోజనాలను రక్షించడం & ప్రోత్సహించడం, భద్రత, అభివృద్ధి, క్షేత్రస్థాయిలో హక్కులు అమలయ్యేలా చూడడం వంటి కీలక లక్ష్యాలతో "థీమ్ 9: మహిళా స్నేహపూర్వక పంచాయితీ" రూపుదిద్దుకుంది.


క్షేత్ర స్థాయి నాయకత్వాన్ని స్వీకరించేలా మహిళలను శక్తిమంతంగా తీర్చిదిద్దడానికి నాణ్యమైన శిక్షణను అందించడంతోపాటు వివిధ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎంపికైన మహిళ ప్రజాప్రతినిధులు, పీఆర్‌ఐలకు ఐఐఎం అహ్మదాబాద్ వంటి ప్రముఖ విద్యాసంస్థలో శిక్షణ కార్యక్రమం జరిగింది. "లీడర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం" పేరిట జరిగిన శిక్షణ, ఈ తరహా కార్యక్రమాల్లో మొట్టమొదటిది. ఈ కార్యక్రమం మొదటి బృందంలో శిక్షణ పొందిన శ్రీమతి సుప్రియా దాస్ దత్తా వంటి ఈడబ్ల్యూఆర్‌లు లింగ సమానత్వం, పేదరిక నిర్మూలన, క్షేత్రస్థాయిలో సమ్మిళిత అభివృద్ధిని సాధించడంలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారో సీపీడీ57 ఉప కార్యక్రమం యావత్‌ ప్రపంచానికి చూపిస్తుంది.


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సీపీడీ57 ఉప కార్యక్రమానికి హాజరైన ముగ్గురు ఈడబ్ల్యూఆర్‌ల సంక్షిప్త వివరాలు


త్రిపురలోని సెపాహిజాల జిల్లా పరిషత్‌ సభాధిపతి శ్రీమతి సుప్రియా దాస్ దత్తా, పరిపాలన నిర్ణయాల్లో మహిళల ప్రమేయాన్ని ప్రోత్సహించారు. గ్రామాభివృద్ధి సమస్యలు, అభిప్రాయాలను జిల్లా అధికారుల ఎదుట వినిపించేందుకు మహిళల కోసం చర్చా వేదికలను ప్రారంభించారు. మహిళలకు అనుకూలమైన పని వాతావరణంలో భాగంగా పిల్లల సంరక్షణ సౌకర్యాల గురించి చురుగ్గా ప్రచారం చేశారు. లింగ సమానత్వాన్ని సాధించాలంటే తరతరాలుగా వస్తున్న సామాజిక ఆంక్షలను నిర్మూలించాలని ఆమె దృఢంగా నమ్ముతారు. శ్రీమతి సుప్రియా దాస్ దత్తా ఫార్మసీలో డిప్లొమా చేశారు.


ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ శ్రీమతి కునుకు హేమకుమారి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి గ్రామీణ స్థాయిలో అవగాహన పెంచేందుకు కంకణం కట్టుకున్నారు. అత్యంత బలహీన & అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాల ఫలాలను సమర్థవంతంగా అందించడంపై ఆమె దృష్టి పెట్టారు. తన గ్రామంలో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలను నిర్వహించి, మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. ఆమె కృషి ఫలితంగా ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సేవలు అవసరమైన మహిళలు & బాలికల మధ్య అనుసంధానం సాధ్యమైంది. శ్రీమతి కునుకు హేమకుమారి టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. గతంలో, ఒక ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్, ఇ-కమ్యూనికేషన్‌ పాఠాలను బోధించారు.


రాజస్థాన్‌లోని జుంఝును జిల్లా లంబి అహీర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి నీరు యాదవ్ లింగ అసమానతలు నిర్మూలించడానికి, మహిళలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఈ దిశగా వివిధ కార్యక్రమాలకు ఆమె నేతృత్వం వహించారు. బాలికల విద్యకు ప్రాధాన్యతనిచ్చారు, పాఠశాల డ్రాపౌట్ రేటును తగ్గించడానికి ప్రయత్నాలు చేశారు. బాలికల విద్య విషయంలో శ్రీమతి నీరు యాదవ్ అందించిన విశిష్ట సేవలను రాజస్థాన్ ప్రభుత్వం గుర్తించింది. క్రీడల్లో,  ముఖ్యంగా హాకీలో బాలికల ప్రాతినిధ్యం పెంచేందుకు, లింగ వివక్షను తగ్గించేందుకు కృషి చేశారు. దీనికి ప్రతిగా "హాకీవాలీ సర్పంచ్" అనే బిరుదును సంపాదించారు. తన పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే ప్రచారాలను కూడా శ్రీమతి నీరు యాదవ్ నడిపించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున మొక్కల పెంపకం కార్యక్రమాలు చేపట్టారు. వివాహాల సమయంలో, కన్యాదానంలో భాగంగా మొక్కలను బహుమతిగా ఇచ్చే వినూత్న సంప్రదాయాన్ని, "మై ట్రీ-మై ఫ్రెండ్" ప్రచారాన్ని ప్రారంభించారు. శ్రీమతి నీరు యాదవ్ గణితం, విద్యలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం ఆమె పీహెచ్‌డీ చేస్తున్నారు.

Comments