*సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం*
*మెగా డిఎస్పి ద్వారా ఉద్యోగ అవకాశాలు*
*ప్రజల మధ్య ప్రభుత్వం 100 రోజుల పండుగ*
*వందరోజుల పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారు*
*రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*
సంబేపల్లి, సెప్టెంబర్ 21. (ప్రజా అమరావతి):
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం సంబేపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం - ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.... ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజలందరికీ న్యాయం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నేడు వందరోజుల పండుగను ప్రజల మధ్య జరుపుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ప్రజలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖ సంతోషాలతో జీవనం గడుపుతున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాకుండా సాధ్యం కానివి కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లలో భాగంగా పేద ప్రజలందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో చెప్పిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మేలు కలుగజేస్తుందన్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వివిధ కేటగిరీలకు చెందిన పెన్షన్లు వారి ఇంటి వద్దనే ప్రతినెల ఒకటో తేదీన 100% పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.
ఉదయం 5-30 గంటలకంతా పెన్షన్ పంపిణీ దారులు క్షేత్రస్థాయిలో ఉండి 6 గంటలకు పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు ఇవ్వడంతో అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. గతంలో వాలంటీర్లకు నెలకు 5000 జీతం ఇచ్చి వారిని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుని వారికి అన్యాయం చేయడం జరిగిందన్నారు.
గతంలో ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయని నేడు రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,437 టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను నివారించేందుకు చర్యలు చేపడుతుందన్నారు.
ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలు ఎవరు ఆకలితో పస్తులు ఉండకూడదనే ముఖ్య ఉద్దేశంతో తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. దీంతో ప్రతి పేదవాడు నేడు మూడు పూటలా భోజనం చేసి సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు.
అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలి కేకలు అనేటివి ఉండవన్నారు.
అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే ఉదయం ఇడ్లీ/పూరి/ఉప్మా/పొంగల్, చట్నీ, సాంబార్, లంచ్- డిన్నర్‌లో అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి ఇవ్వడం జరుగుతుందన్నారు.
గత 100 సంవత్సరాలలో ఎప్పుడు రాని వరదలు వచ్చి విజయవాడలో ప్రజలు నీటమున ఇవ్వడం జరిగిందని దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 12 రోజులపాటు బస్సులోనే ఉండి వరద బాధితులకు భోజనం, నీళ్లు మాత్రలు వంటి అన్ని వసతులు ఏర్పాటు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారన్నారు.
రాష్ట్రంలో ఉన్న కోట్లాదిమంది రైతులు ఉరి వేసుకునే విధంగా తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దుచేసి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు.
డ్వాక్రా మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి ఐదు నుంచి పది లక్షల వరకు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం డ్యాం నిర్మాణానికి కేంద్రం నుంచి 12,500 కోట్ల రూపాయల నిధులతో పూర్తి చేసేందుకు విశేష కృషి చేస్తున్నారన్నారు.
పోలవరం డ్యాం పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు పుష్కలంగా నీరు అందే అవకాశం ఉందన్నారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్మిస్తే, గత ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ అమరావతి నిర్మాణాన్ని తుంగలోకి తొక్కేసిందన్నారు.
నేడు ముఖ్యమంత్రి వర్యులు 15 వేల కోట్ల రూపాయలతో అమరావతిని అద్భుతంగా నిర్మించేందుకు ముందుకు వెళుతున్నారు.
గతంలో ప్రజలు నాసిరక మద్యం తాగి అనారోగ్యానికి గురి అయ్యే వారని నేడు మన ముఖ్యమంత్రి అక్టోబర్ 1వ తేదీ నుంచి నాణ్యమైన మద్యం విధానాన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు.
రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్రం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా రాయచోటి నియోజకవర్గం కూడా తమ వంతు బాధ్యతగా రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు ఇందుకు ప్రజలందరూ సహకరించి ముందుకు రావాలన్నారు.
అనంతరం మంత్రివర్యులు ఇది మంచి ప్రభుత్వం అనే కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రంగస్వామి, డిపిఓ ధనలక్ష్మి, హౌసింగ్ పీడీ శివయ్య, డిఆర్డిఏ పిడి సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment