ఎమ్మెల్యేలంతా ప్రజలతో మమేకమవ్వాలి.

అమరావతి (ప్రజా అమరావతి);


*ఎమ్మెల్యేలంతా ప్రజలతో మమేకమవ్వాలి* 


*2029లో మీ అందరినీ ఎమ్మెల్యేలుగా మళ్లీ గెలిపించుకోవాలనుకుంటున్నా*


*ఎమ్మెల్యే చైర్మన్ గా ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు* 


*నియోజకవర్గాల్లో టూరిజం అభివృద్ధికి డాక్యుమెంట్ సిద్ధం చేయాలి* 


*గత ఐదేళ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిన పెట్టాం...ఇక వేగం పెంచాల్సి ఉంది* 


*ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే*


*సమస్యలుంటే నా దృష్టికి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటా* 


*ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు*


*చంద్రబాబు ఆలోచనలను ముందుకు తీసుకెళ్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్* 


*సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ....*


ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులైంది. ఈ 150 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలను పునర్నిర్మిస్తూ ముందుకెళ్తున్నాం. 

నేను నాలుగో సారి సీఎం అయ్యా...కానీ ఎప్పుడూ ఇంతటి వ్యవస్థల విధ్వంసం చూడలేదు. 

వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయి. లోతుకు వెళ్లే కొద్దీ భయంకర విషయాలు బయటపడుతున్నాయి. వాటన్నింటినీ గాడిన పెట్టాం...ఇక వేగం పెంచాల్సిన అవసరం ఉంది. 

అధికారంలోకి రాగానే 7 శ్వేత పత్రాలు విడుదల చేశాం. ఐదేళ్ల విధ్వంసాలను వాస్తవ రూపంలో ప్రజలకు వివరించాలని శ్వేతపత్రాలు విడుదల చేశాం.  

ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలవాలని ఎన్నికల ముందు పిలుపునిచ్చాం. ప్రజలు మన పక్షాన నిలిచి గెలిపించారు...ఇప్పుడు వారి ఆకాంక్షలను నెరవేర్చాలి.  

సూపర్-6, ఇతర హామీలను ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చాం. కేంద్రం సహకరించకుండా ఉంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లం. 

మనం కలిసి పోటీ చేయడం, ఢిల్లీలో ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి చేయూత లభిస్తోంది. 

ఒక్కో అడుగు వేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. 

మనం చేసిన పనులు ప్రజలకు వివరిస్తూ ఒక్కొక్కటి అధిగమించడం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. 

7 శ్వేతపత్రాల్లోని అంశాలు ఎంతమందికి తెలిస్తే అంత మంచిది. 

150 రోజుల్లో అనేక హామీలు అమలు చేసి, పలు కార్యక్రమాలు చేపట్టాం. 

పెన్షన్ సామాజిక పెన్షన్లు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ పేషెంట్లకు రూ.10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలకు పెన్షన్ పెంచాం.

64 లక్షల మందికి ఏ రాష్ట్రంలో ఇవ్వని స్థాయిలో పెన్షన్లు అందిస్తున్నాం. 

అన్న క్యాంటీన్లతో పాటు దీపావళి నుండి దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తున్నాం.

చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని కూడా జోడెద్దుల బండి మాదిరి ముందుకు తీసుకెళ్తాం. 

అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది..సంపద పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని అమలు చేయవచ్చు. 

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నాం. 2047 నాటికి 43 వేల డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నాం. 

ఇప్పటికే శాండ్, యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, లిక్కర్ పాలసీలు ప్రవేవపెట్టాం. దీనిపైనా అసెంబ్లీలో చర్చలు జరగాల్సి ఉంది. క్లీన్ ఎనర్జీ, డ్రోన్, ఎలక్ట్రానిక్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు కూడా తెచ్చాం. 

రాబోయే ఐదేళ్లు మీరు టూరిజంపై శ్రద్ధ పెడడితే ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతాయి. 

రాష్ట్రంలో టూరిస్టులు ఒక్కరోజు మాత్రమే ఉంటున్నారని టాటా సంస్థ ప్రతినిదులు కూడా చెప్పారు.

మన రాష్ట్రంలో మంచి ప్రదేశాలు ఉన్నా హోటల్స్, ఇతర వసతులు లేవని అంటున్నారు. టూరిజానికి కావలసింది కనీసం రూములు, హాస్పిటల్స్, ఈవెంట్స్, ట్రావెల్ సదుపాయాలు. 

గండికోట టాప్ 10 స్థానాల్లో ఒకటి. రాష్ట్రంలో మంచి రిజర్వాయర్లు, హిల్స్, టైగర్ జోన్ వంటి ప్రాంతాలున్నా మార్కెటింగ్ చేయలేకపోయాం. టెంపుల్స్ లో తిరుమల, కాణిపాకం, లేపాక్షి, శ్రీశైలం, కనకదుర్గమ్మ దేవాలయం, అన్నవరం వంటివి ఉన్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకుని టూరిజంను అభివృద్ధి చేయాలి. 

ఎస్సీ వర్గీకరణపైనా ఇప్పటికే ఎమ్మెల్యేలతో మాట్లాడాం. జిల్లా వారీగా ఏబీసీ కేటగిరీలు పెట్టి జిల్లా, జోన్, స్టేట్ వారీగా కమిటీలు వేసి అమలు చేస్తాం. 

2028 లేదా 2027 నాటికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నాం. కేంద్రం కూడా రూ.12,500 కోట్లు నిధులు ఇచ్చింది. దీంతో ఫేజ్ 1 ప్రాజెక్టు పూర్తవుతుంది. ఫేజ్ 2 లో ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ సమస్యలు పరిష్కారం అవుతాయి. 

మలివిడత నదుల అనుసంధానికి కూడా ఆలోచన  చేస్తున్నాం. గోదావరి నుండి కృష్ణా, కృష్ణా నుండి పెన్నాకు నీళ్లు తీసుకెళ్లాలి. గోదావరి నీళ్లు సీమకు వెళ్తే గేమ్ ఛేంజర్ అవుతుంది. 

ఈ యేడాది పోలవరం నుండి అనకాపల్లికి, ఆ తర్వాత విశాఖకు నీళ్లు తీసుకెళ్తాం. అనంతరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధారకు అనుసంధానం చేస్తాం. 

అమరావతికి కేంద్రం ఏడీజీ, ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్ల ఆర్ధిక సాయం అందించేందుకు  ముందుకొచ్చింది. మూడేళ్లలో అనుకున్న ప్లాన్ ప్రకారం రాజధానిని పూర్తి చేస్తాం. 

గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలను రీ ఆర్గనైజేషన్ చేయాల్సి ఉంది. అకౌంటబిలిటీ సెట్ చేసి అన్ని సచివాలయాలను ఇంటిగ్రేట్ చేసి మరింతగా సేవలందించేలా చేస్తాం. 

ఆధార్ కార్డు ప్రతి భారతీయుడికి ఐడెంటిటీ. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా అందులో డేటా ఉండేలా కేంద్రం రూపకల్పన చేసింది. 

అపార్ ద్వారా విద్యార్ధుల డీటెయిల్స్ ట్రాకింగ్ ఉంటుంది. 

ఇటీవల 10 పాలసీలు తెచ్చాం...ఈ 10 పాలసీలను మేజర్ గా పెట్టుకుని విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. జీరో పావర్టీలో అందరూ అనుసంధానం కావాలి. 

పీ4 ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రయత్నిస్తాం. 

మనం తెచ్చిన పాలసీలన్నీ ఉద్యోగ కల్పనకు ఉపయోగపడుతాయి. ఉద్యోగాలు ఎక్కువ కల్పించే సంస్థలకు 10 శాతం అదనంగా ప్రోత్సాహకాలు కల్పిస్తామని చెప్పాం. ఒక కుటుంబం...ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదం తీసుకొచ్చాం. 

రతన్ టాటా పేరుతో ఇన్నోవేషన్ హబ్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తాం. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురంలో కూడా హబ్ లు ఉంటాయి. 

టాటా సంస్థ 10 వేల ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, సత్యం వంటి దాదాపు 10 పెద్ద కంపెనీలు రాష్ట్రానికి తీసుకొస్తాం. 

రాబోయే రోజుల్లో వర్చువల్ వర్కింగ్ ఉంటుంది. ఇప్పటికే చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తాం. 

ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు ఉంటుంది. ఎమ్మెల్యేలే దానికి ఛైర్మన్లుగా ఉంటారు...అక్కడ పరిశ్రమలు పెట్టించే బాధ్యత ఎమ్మెల్యేలు కూడా తీసుకోవాలి. 

లాజిస్టిక్ కాస్ట్ కటింగ్ లో భాగంగా పోర్టులు నిర్మాణం, జాతీయ రహదారులు నిర్మాణం వేగంగా చేపడతాం.

పంచాయతీల్లో చేపట్టిన పనులు కూడా జనవరిలోపు పూర్తిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. 

మనం అధికారంలోకి రాగానే పంచాయితీలకు రూ.900 కోట్లు మంజూరు చేశాం. మరో రూ.1000 కోట్లు కూడా రానున్నాయి. 

రూ.860 కోట్లతో రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నల్లరేగడి వల్ల రోడ్లు త్వరగా పాడవుతున్నాయి. 

అందువల్ల పీపీపీ విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టి మహర్ధశ తీసుకొస్తాం. అక్కడ సక్సెస్ అయితే కృష్ణా, గుంటూరులో  అమలు చేస్తాం. సామాన్యులకు ఎటువంటి భారం లేకుండా రోడ్ల నిర్వహణ చేపడతాం. 

ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కేంద్రం ఇచ్చిన జల్ జీవన్ మిషన్ నిధులను కూడా గత ప్రభుత్వం మళ్లించింది. ఆ నిధులు మనం మంజూరు చేసి పనులు ప్రారంభించాల్సి ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల నుండి నీటిని తీసుకొచ్చి అందిస్తాం. 

ప్రతి ఎకరాకు కూడా నీరందిస్తాం.  రైతుల ఆదాయం పెంచడానికి శ్రద్ధ పెడతున్నాం. ప్రతి రైతు కుంటుంబం నుండి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి. డ్రోన్స్ ద్వారా పిచికారీ చేస్తే సమయం, ఖర్చు తగ్గుతుంది. భూసార పరీక్షలు కూడా విధిగా నిర్వహిస్తాం. 

జనాభా నిర్వహణ కూడా చేయాల్సి ఉంది. రష్యాలో కూడా జనాభా పెరుగుదలపైనే దృష్టి పెట్టారు. అక్కడ ఒక శాఖ కూడా ఏర్పాటు చేశారు. 1.7 నుండి 2.7కు పాపులేషన్ మేనేజ్మెంట్ ఉండాలి. 

ఎనర్జీలో పెనుమార్పులు వస్తున్నాయి. గతంలో వాహనాలు పెట్రోల్, డీజల్ తో నడిచాయి. కానీ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. 

గ్రీన్ ఎనర్జీ నుండి గ్రీన్ హైడ్రోజన్ కు వెళ్తున్నాం. అందుకే గ్రీన్ బడ్జెట్ అని మాట్లాడుతున్నాం. గ్రీన్ ఎనర్జీతో తయారవ్యేవి టెంపరేచర్ ను తగ్గిస్తాయి. 

లాజిస్టిక్స్, ఫ్యూయల్, ఎనర్జీ కాస్ట్ తగ్గిస్తే అన్ని విధాలా ముందుకెళ్తాం. డ్రోన్స్, సీసీ, సెల్, ఐఓటీలతో రియల్ టైం డేటా వస్తుంది. 

ప్రతి ఒక్కరూ పేదలతో మమేకమవ్వాలి. వారి కనీస అవసరాలు తీర్చాలి. 

మీ నియోజకవర్గాల్లో టూరిజం ప్రాంతాలను గుర్తించాలి. 

టూరిజంపై ఎంత ఫోకస్ చేస్తే అంత ఉపాధి కల్పన జరుగుతుంది. టూరిజంలో రూపాయి ఖర్చు చేస్తే ఆరు రూపాయల ఆదాయం వస్తుంది. 

టూరిజం రంగంలో ఎక్కువ కష్ట పడాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రజలకు వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం టూరిజంపై ఖర్చు చేస్తున్నారు. మనం ఎంత అభివృద్ధి చేస్తే అంత ఆదాయాన్ని రాబట్టవచ్చు. 

ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి. సమస్యలుంటే నాకు రిపోర్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాను. 

దీపం 2 పథకంలో సమస్యలు వస్తే తక్షణమే పరిష్కరిస్తాం. 

నేను, పవన్ కళ్యాణ్ చెప్పేది ఆచరించాల్సింది ఎమ్మెల్యేలే. 2029 లోనూ మీరంతా మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచి రావాలని కోరుకుంటున్నా.


Comments