జాతీయ రహదారుల విస్తరణకు వేగవంతంగా భూసేకరణ పూర్తి చేయండి:సిఎస్ విజయానంద్
అమరావతి,21 జనవరి (ప్రజా అమరావతి):రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల నిర్మాణం,విస్తరణ వాటిపై బైపాస్ రహదారుల నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణను వేగవతంగా పూర్తి చేయాలని జిల్లా కలక్టర్లు,సంయుక్త కలక్టర్లతో పాటు సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు.జాతీయ రహదారుల నిర్మాణం,విస్తరణ, బైపాస్ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ,అటవీ అనుమతుల మంజూరు తదితర పెండింగ్ అంశాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి రెవెన్యూ,అటవీ, టిఆర్అండ్బి,జాతీయ రహదారుల సంస్థ,మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్సుపోర్టు అండ్ హైవేస్ శాఖల అధికారులతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లు,జెసిలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జాతీయ రహదార్లు వంటి ప్రాధాన్య రహదార్ల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి సంబంధిత నిర్మాణ ఏజెన్సీలకు సకాలంలో అందించే విధంగా కలక్టర్లు,జెసిలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం జాతీయ రహదారులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ,అటవీ అనుమతుల మంజూరుపై జిల్లాల వారీగా కలక్టర్లు,జెసిలతో సిఎస్ విజయానంద్ సమీక్షించారు.భూసేకరణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రైతులకు నష్ట పరిహారాన్ని అందించి సకాలంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఆయా నిర్మాణ సంస్థలకు అందించాలని స్పష్టం చేశారు.ఈవిషయంలో వివిధ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు వీలుగా రెవెన్యూ,ఆటవీ,టిఆర్అండ్బి,జాతీయ రహదార్ల సంస్థ,మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్సుపోర్టు అండ్ హైవేస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చెప్పారు.
ఈసమావేశంలో సిసిఎల్ఏ జి.జయలక్ష్మి,టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే,అదనపు పిసిసిఎఫ్ రాహుల్ పాండే,ఎన్ హెచ్ ఎఐ రీజనల్ అధికారి ఆర్కె సింగ్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్సుపోర్టు అండ్ హైవేస్ రీజనల్ అధికారి రాకేశ్ కుమార్ పాల్గొన్నారు.అదే విధంగా వివిధ జిల్లాల కలెక్టర్లు,జెసిలు వర్చువల్ గా ఈవీడియో సమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment