భారతదేశ అభివృద్ధి , ప్రగతి అనేది ఆధునిక సాంకేతిక విధానాలతో సాధ్యం అవుతుంధి.
గుంటూరు, 16 మే 2025  (ప్రజా అమరావతి );"భారతదేశ అభివృద్ధి , ప్రగతి అనేది ఆధునిక సాంకేతిక విధానాలతో సాధ్యం అవుతుంద

ని , దేశంలో ఆంధ్రప్రదేశ్ తో సహా ఏడు రాష్ట్రాలు భూ సర్వే డిజిటలైజేషన్లో ముందడుగులో ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
శుక్రవారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్ లో కేంద్ర గ్రామీణాభివృధ్ది మంత్రిత్వ శాఖ, భూ వనరుల విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా  సర్వే , రీసర్వే పై జరుగుతున్న జాతీయ కార్యశాల ముగింపు కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ  , కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ సెక్రటరీ మనోజ్ జోషి, కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్ధి, రాష్ట్ర సర్వే సెటిల్మేంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి , ఇన్చార్జి జిల్లా కలెక్టర్                   ఏ భార్గవ తేజ తో కలసి పాల్గొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం అన్నారు. గుంటూరులో రెండు రోజులుగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్న అధికారులకు, ఉన్నతాధికారులకు  ధన్యవాదాలు.  శాఖ పరంగా, వృత్తిపరంగా విజయవంతమైన పనులు నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఇది ఒక నిర్ణీత సమయానికి, రాష్ట్రాలకు నిధులు సేకరించడానికి ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమం గ్రామీణ సముదాయాలు, మహిళలు మరియు గిరిజనుల పట్ల చాలా కీలకమైనది. మన గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్పినట్లుగా, మనం నిజంగా 2047 నాటికి వికసిత భారతంగా మారాలని కోరుకుంటే, ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు ఈ పని ఎన్నో సంవత్సరాల క్రితమే పూర్తిచేశాయని, మన పరిపాలనా సమస్యలను పరిగణనలోకి తీసుకుంటే కొంత ఆలస్యం జరుగుతున్నదీ నిజమే కానీ వచ్చే కొన్ని సంవత్సరాలలో మనం 100% పరిష్కారాన్ని సాధించగలమనే  ఆశ ఉందన్నారు. రీ సర్వే కార్యక్రమంలో గ్రౌండ్‌ ట్రూథింగ్ నూరు శాతం సాధించినందుకు కర్ణాటక, ఇప్పటివరకు పరిష్కరించని భూముల వ్యవహారాన్ని పరిష్కరిస్తున్న అస్సాంను, మరియు 40 సెంటీమీటర్ల అధిక-స్పష్టత గల శాటిలైట్ చిత్రాలతో ముందుకు వస్తున్న రాజస్థాన్‌ను కూడా అభినందించాలి. ఇవన్నీ కాకుండా, మన ఆంధ్రప్రదేశ్‌ గురించి నాకు చాలా గర్వంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, నా రాజకీయ గురువు,  నారా చంద్రబాబు నాయుడు  నేతృత్వంలో, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ , శాఖ ఉన్నతాధికారులు మొత్తం పరిపాలనా యంత్రాంగం ఎంతో అద్భుతమైన పనిని కేవలం 10 నెలల్లోనే పూర్తి చేసి, ప్రోత్సాహక నిధులలో సింహభాగాన్ని దక్కించుకున్నారన్నారు. అలాగే, పౌర సాధికారత, సమాజం యొక్క భాగస్వామ్యం కోసం పని చేస్తున్న బీహార్ మరియు ఒడిశాను, మరియు అత్యంత పారదర్శక భూ రికార్డు వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న హర్యాణాను, అలాగే మొదటి మరియు రెండవ తాత్కాలిక సర్వేలు పూర్తి చేసిన త్రిపుర రాష్ట్రాన్ని కూడా అభినందించాలి.  ప్రథమ దశలో 15 లక్షల చ.కిమీ. ప్రణాళికలో భాగంగా 3 లక్షల చ.కిమీ. భూభాగాన్ని కవర్ చేశామన్నారు. ఈ వర్క్ షాపు  మన దేశంలో సహకార పౌరసత్వ వ్యవస్థను ప్రదర్శిస్తుందని, అది మన దేశ బలమని నమ్ముతున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి కచ్చితమైన అందుబాటులో ఉండే భూ రికార్డులు లభిస్తాయని, విధాన పరంగా, సాంకేతికంగా, నిధుల పరంగా మరియు అన్ని ప్రామాణిక కార్యాచరణ పద్ధతుల విషయంలో భారత ప్రభుత్వం మద్దతుగా ఉంటుందన్నారు.
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ  మాట్లాడుతూ పట్టణాల్లో రెవెన్యూ రికార్డులు పక్కాగా అమలు చేయడం , భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ జియోస్పాటిల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యబిటేషన్స్ (నక్షా) కార్యక్రమంను కేంద్రం తీసుకువచ్చిందన్నారు. వికసిత్ భారత్ 2047 ద్వారా దేశాన్ని ప్రధాని మోడీ,స్వర్ణాంధ్ర 2047 ద్వారా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా అభివృద్ధి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. పట్టణాల్లో పారదర్శకమైన , సమర్థవంతమైన పాలన అందించేందుకు నక్షా కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. నక్షా పైలట్ ప్రోగ్రామ్ ద్వారా దేశంలో 152 మున్సిపాల్టీలను సెలక్టు చేయగా అందులో రాష్ట్రంలో కుప్పం మున్సిపాల్టీ, ఒంగోలు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, మంగళగిరి - తాడేపల్లి , ఏలూరు, తిరుపతి నగరపాలక సంస్థలు మొత్తం  10 పట్టణాలను కేంద్రం ఎంపిక చేసిందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని 10 మున్సిపాలిటీల్లో 524 చ.కిమీ.విస్తీర్ణంలో ఉన్న 9.5 లక్షల ఆస్తులను సర్వే చేసి డిజిటలైజేషన్ చేయనున్నామన్నారు. కేంద్రం సహకారంతో నిర్దేశిత గడువులోగా 10 మున్సిపాలిటీల్లో సర్వే పూర్తి చేసి రికార్డులను డిజిటలైజేషన్ చేస్తామన్నారు. ఇప్పటికే 8 మున్సిపాలిటీల్లో ఏరియల్ సర్వే పూర్తయిందని,  ఏలూరు, మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లలో ఏరియల్ సర్వే కొనసాగుతుందన్నారు. కుప్పం, ఒంగోలు, అనంతపురం, మున్సిపాలిటీల్లో క్షేత్రస్థాయిలో 6000 ప్రభుత్వ ఆస్తుల రీసర్వే కూడా పూర్తయిందన్నారు. క్షేత్రస్థాయి సర్వేకు అవసరమైన 166 రోవర్లలో 158 రోవర్లు సిద్ధంగా ఉన్నాయని, సర్వే కోసం క్షేత్ర స్థాయిలో అవసరమైన 643 వెరిఫికేషన్ బృందాలను సిద్ధం చేశామన్నారు. నక్షా  కార్యక్రమం పూర్తయితే పట్టణాలకు సరైన ప్రణాళిక , పన్నుల విధింపుతో పాటు ఆస్తుల వివాదాల కు చెక్ పెట్టవచ్చన్నారు. కేంద్రం తో కలిసి భూముల సర్వేకు అధిక ప్రాధాన్యత ఇచ్చి విజయవంతంగా నక్షా కార్యక్రమం నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామన్నరు.
కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ సెక్రటరీ మనోజ్ జోషి మాట్లాడుతూ నాణ్యమైన భూ రికార్డులు నిర్వహించే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ దాదాపు రూ.1000 కోట్ల వరకు ప్రోత్సాహక నిధులను అందిస్తుందన్నారు. ఆర్వోఆర్ లో 80 శాతంకు పైగా వ్యక్తిగత ఖాతాలు ఉంటే దానిని నాణ్యమైన భూ రికార్డులుగా గుర్తించటం జరుగుతుందన్నారు. అంధ్రప్రదేశ్ లో 90 శాతం పైగా డిజిటలైజ్డ్ చేసిన భూ ఖాతాలలో వ్యక్తిగత ఖాతాలు ఉండటంతో అత్యధికంగా ప్రోత్సాహక నిధులు అందుకోవటం జరిగిందన్నారు. ఆర్వోఆర్ లో జాయింట్ ఖాతాలు ఉండటం  వలన మ్యూటేషన్ ఇబ్బందులు ఉంటాయని, స్థలాలు అమ్ముకున్న వ్యక్తిగత ఖాతాలుగా మార్పు చేయటం కుదరటం లేదన్నారు. దేశంలో అంధ్రప్రదేశ్, గుజరాత్ , రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో భూముల రీ సర్వే సక్రమంగా జరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో వివిధ కారణాలతో అశించిన స్థాయిలో రీ సర్వే కార్యక్రమాలు జరగటం లేదన్నారు.  జాతీయ వర్క్ షాపు వలన రాష్ట్రాల్లో జరుగుతున్న భూముల రీ సర్వే పై కేంద్ర ప్రభుత్వ భూవనరుల శాఖకు అవగాహన వచ్చిందన్నారు. అదే విధంగా రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రీ సర్వే  చేస్తున్న విధానం తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు.  మానవ వనరులను ప్రణాళిక ప్రకారం వినియోగించుకొని రీ సర్వేను నిర్దేశించిన లక్ష్యాల అధిగమించేలా కృషి చేయాలన్నారు. 
రెండవ రోజు వర్క్ షాపులో కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్ధి  కేంద్ర భూ వనరుల శాఖ సర్వే, రీ సర్వే , నక్షా కార్యక్రమాలకు దేశంలో వివిధ రాష్ట్రాలకు అందిస్తున్న నిధులు, ప్రోత్సాహకాలపై బీహార్, లడక్, ఒడిస్సా, హర్యాన, త్రిపురా రాష్ట్రాలలో జరుగుతున్న భూముల రీసర్వే సంబందిత రాష్ట్రాల సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు భూముల రీ సర్వేకు సంబంధించి  తెలిపిన అనేక సందేహాలకు కేంద్ర భూ వనరుల శాఖ అధికారులు నివృత్తి చేశారు.
కార్యక్రమంలో కేంద్ర భూ వనరుల శాఖ డైరక్టర్ శ్యామ్ కుమార్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన సర్వే ల్యాండ్ రికార్డ్సు ఉన్నతాధికారులు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాసులు, సర్వే ల్యాండ్ రికార్డ్సు, రెవెన్యూ శాఖల  అధికారులు పాల్గొన్నారు. 
Comments