నంద్యాల (ప్రజా అమరావతి );
నంద్యాల రైతాంగం పండించిన మొత్తంపొగాకును కొనుగోలు చేయాలి. పొగాకు క్వింటాకి 18 వేల రూపాయలతో కొనుగోలు చేయాలి. పొగాకు కొనుగోలు చేయకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రైవేటు కంపెనీలపైన వెంటనే చర్య తీసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా.
నంద్యాల జిల్లాలో ని ఆళ్లగడ్డ, రుద్రవరం, సిరివెళ్ల, మహానంది, పాణ్యం, కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల్లో ప్రైవేటు కంపెనీల ద్వారా ముందుగానే అగ్రిమెంట్ చేసుకుని పొగాకు పంట వేసిన రైతులతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా ఆలయన్స్ వన్, జేపఐ, ఎంఎల్ గ్రూప్, ఐటీసీ లాంటి కంపెనీలు జిల్లాల్లో రైతులతో క్వింటాకు 18,500, రైతులు పండించిన మొత్తం కొనుగోలు చేసే విధంగా ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకొని పొగాకు నాటారు. అయితే ఆలయన్స్ ఒన్ అనేటటువంటి కంపెనీ ఇప్పటివరకు జిల్లాలో రైతుల దగ్గర ఒక్క క్వింటా కూడా పొగాకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎకరాకు సుమారు లక్షా 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రస్తుతం పంట వచ్చినా కూడా ఇండ్లలో పెట్టుకోవడానికి అవకాశం లేక, బయట కళ్ళాల్లో ఉంచుకుందామంటే వర్షం వల్ల నష్టపోయే ప్రమాదం ఉండటం వల్ల, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుల వాళ్ళు ఇళ్ల చుట్టూ తిరుగుతుంటే రైతాంగం తీవ్ర మనోవేదనతో కృంగిపోతున్నా కంపెనీలో వాళ్ళు ఇప్పటివరకు పొగాకు కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమైన చర్య. అలాగే జీపీఐ అనే కంపెనీ వారు కేవలం ఒక్కో రైతు నుండి ఎకరాకు ఐదారు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన పొగాకు ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కువ రోజులు ఇళ్లలో నిల్వ ఉంచుకోవడం వల్ల పొగాకు రంగు మారి దెబ్బతిని అమ్ముకోవడానికి పనికి రాకుండా పోతుంది అనే భయంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జోక్యం చేసుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా జిల్లాలో కొనుగోలు చేస్తున్న ప్రైవేటు కంపెనీల యమానులను వెంటనే పిలిపించి రైతాంగం పండించిన మొత్తం పొగాకునంతటిని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, క్వింటాకి 18,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు వెంటనే స్పందించి జిల్లా వ్యవసాయ అధికారితో మాట్లాడి జిల్లాలో పొగాకు కొనుగోలు చేస్తున్న కంపెనీ యజమానులను పిలిపించాలని, వారితో సమావేశం జరిపి రైతాంగానికి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పొగాకు పండించినటువంటి రైతాంగానికి సరైన ధర ఇవ్వడం లేదని, ప్రైవేటు కంపెనీలు విచ్చలవిడిగా రైతాంగాన్ని దోపిడీ చేస్తున్నాయని, నాణ్యత పేరుతో రైతులు పండించిన మొత్తం పొగాకును కొనుగోలు చేయకుండా ఇతరుల ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేయిస్తూ కంపెనీలే వాటిని దళారుల నుండి కొనుగోలు చేస్తూ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయని అన్నారు. రైతులు నష్టపోతున్న జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ. రాజశేఖర్ గారు, జిల్లా సహాయ కార్యదర్శి టి. రామచంద్రుడు, ఉపాధ్యక్షుడు వి. సుబ్బరాయుడు గారు మాట్లాడారు . ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సురేష్ పొగాకు రైతులు బుజ్జయ్య, రఘురామిరెడ్డి, సుబ్బు, సుబ్బ నరసయ్య, నారాయణ, థామస్, ఎంసి నారాయణ, మా భాష, శివ నాగిరెడ్డి తదితర రైతు నాయకులు రైతులు పాల్గొన్నారు.
addComments
Post a Comment