ఇబ్రహీంపట్నం (ప్రజా అమరావతి);
జీలుగ,పిల్లి పెసర, మరియు అన్ని రకాల పంటలు విత్తనాలను 90శాతం సబ్సిడీతో అందించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని, అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అమలు చేసి రైతుల ఖాతాలో నగదును జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రై సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడి యల్లమందారావు, కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు నిమ్మగడ్డ వాసు, రైతు సంఘం నాయకులు మల్నీడీ రవి తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మేరకు ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం డిప్యూటీ తహశీల్దార్ మహేష్ కు వినతిపత్రం సమర్పించారు. 5204 బీపీటి, ఎంటీయూ 1318, ఎంటీయు 1262,యంటీయు 1061 వెరైటీ వరి వంగడాలను 90 శాతం సబ్సిడీతో రైతులకు, కౌలురైతులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలోనే కౌలుగుర్తింపు కార్డులు జారీకి ఆదేశాలు ఇచ్చే వారిని, ఇప్పటికే 70 రోజులైనా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి గైడ్ లెన్స్, ఆదేశాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వెంటనే గ్రామ సభలు నిర్వహించి భూయజమాని ప్రమేయం లేకుండానే కౌలు రైతులను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం ఏ పంటకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కలేదని ఖరీఫ్ లో పంటలు పండించాలంటే పెట్టుబడి అవసరం ఉందని, తక్షణమే అన్నదాత సుఖీభవ పథకాన్ని వాయిదాలు వేయకుండా అందించాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దాన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి మభ్యపెట్టుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. గద్దెనెక్కిన వెంటనే కౌలు రైతులు రక్షణ సంక్షేమానికి నూతన కౌలు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి ఏడాది అయిన ఎప్పటి వరకు చట్టం గురించి ప్రస్తావించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఆర్డినెన్స్ రూపంలోనైనా కౌలు చట్టాన్ని వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ప్రధాన కాల్వలు, పంట కాల్వలు మరమ్మత్తులకు ప్రభుత్వ తక్షణమే నిధులు కేటాయించి పనులు చేపట్టాలని, ఖరీఫ్ సీజన్ లో పంటలు వేయటానికి అన్ని రకాల చర్యలు తీసుకొని రైతాంగానికి తోడ్పాటును అందించాలని కోరారు. సాయిల్ టెస్ట్ చేసి లోపాన్ని గుర్తిస్తే సరిపోదని దానికి అవసరమైన సూక్ష్మ పోషకాలను రాయితీతో రైతులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఏడాది ఖరీఫ్ లో సాగు చేసే వరి పంటకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు అదనంగా క్వింటాకు మరో రూ.500 బోనస్ ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి రైతులకు, కౌలురైతులకు రూ.2 లక్షల వరకు ఎటువంటి హామీ లేని పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
addComments
Post a Comment