ఆరోగ్యకర ఓటరు జాబితా తయారు కావాలి



*ఆరోగ్యకర ఓటరు జాబితా తయారు కావాలి*



*పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సి.ఇ.ఓ 


పార్వతీపురం, నవంబరు 25 (ప్రజా అమరావతి): ఆరోగ్యకర ఓటరు జాబితా తయారు కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సి.ఇ.ఓ) ముఖేష్ కుమార్ మీనా అన్నారు. శుక్ర వారం జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఓటరు నమోదు అధికారులు, సహాయ ఓటరు నమోదు అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సి.ఇ.ఓ మాట్లాడుతూ ఓటరు జాబితా పక్కాగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వాస్తవ ఓటరు ఎవరూ జాబితాలో తప్పిపోరాదని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలు వారీగా మృతి చెందిన, వలసలు వెళ్ళిన, రెండు సార్లు నమోదు అయిన ఓటర్ల వివరాలు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. అటువంటి ఓటర్ల వివరాలు తొలగించాలని ఆయన చెప్పారు. వెయ్యి మంది జనాభాలో సరాసరిన రాష్ట్ర స్థాయిలో 724 మంది ఓటర్లు ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు ఓటరు జాబితా పరిశీలించాలని ఆయన అన్నారు. సమగ్రమైన, స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించుటకు కృషి చేయాలని కోరారు. యువ ఓటర్లను నమోదు చేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ (పి.వి.టి.జి) ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన పేర్కొన్నారు. లింగ వైవిధ్యం (హిజ్రా) గల వారు, దివ్యాంగులు, నిరాశ్రయులు తదితర విభాగాల్లో 18 సంవత్సరాలు దాటిన అభ్యర్థులను ఓటర్లను గుర్తించి, నమోదు చేయాలని సి.ఇ.ఓ సూచించారు. జిల్లాలో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమంపై సి.ఇ.ఓ సంతృప్తి వ్యక్తం చేశారు. 


జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ  ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటరు నమోదు కార్యక్రమం జిల్లాలో చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో మృతి చెందిన, వలసలు వెళ్ళిన, రెండు సార్లు నమోదు అయిన ఓటర్ల వివరాలపై క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 3,76,072 మంది పురుష ఓటర్లు, 3,97,619 మంది మహిళా ఓటర్లు వెరసి 7,68,044 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఇందులో పాలకొండ నియోజక వర్గంలో 1,95,965, కురుపాం నియోజక వర్గంలో 1,89,276, పార్వతీపురం నియోజక వర్గంలో 1,86,134, సాలూరు నియోజక వర్గంలో 1,96,669 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. యువ ఓటర్లను నమోదు చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 1,024 పోలింగ్ కేంద్రాలు 708 ప్రదేశాల్లో ఉన్నాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో 928 గ్రామీణ, 96 పట్టణ కేంద్రాలు ఉన్నాయని ఆయన వివరించారు. శాసన మండలి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై మాట్లాడుతూ జిల్లాలో 17,052 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు అయ్యారని తెలిపారు. 24 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 


పార్వతీపురం పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాన్ని సి.ఇ.ఓ తనిఖీ చేసి బూత్ స్థాయి అధికారులు చేపడుతున్న కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా సంతకాల బోర్డుపై ప్రధాన ఎన్నికల అధికారి సంతకం చేశారు.


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు డా.బి.నవ్య, సి. విష్ణు చరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, తహశీల్దార్లు, ఎన్నికల ఉపతహశీల్దార్లు పాల్గొన్నారు.

Comments