సాలూరులో పర్యటించిన మహిళా కమిషన్ సభ్యులు



*సాలూరులో పర్యటించిన మహిళా కమిషన్  సభ్యులు*



పార్వతీపురం, నవంబరు 16 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు గెడ్డం ఉమ సాలూరు మండలంలో బుధ వారం విస్తృతంగా పర్యటించారు. సాలూరు మండలంలో ఎం.జె.పి.ఎ.పి.బి.సి.డబ్ల్యు  రెసిడెన్సియల్ స్కూల్ (బాలికలు) ను ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలో మౌళిక వసతులు, సమస్యలపై విచారణ నిర్వహించారు.  పిల్లలతో ముఖాముఖి మాట్లాడుతూ వ్యక్తిగతంగా, పాఠశాలపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. బాలల హక్కులు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్ల, ముఖ్యంగా బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, అక్రమ రవాణా మొదలగు విషయాలపట్ల బాలికలకు అవగాహన కల్పించారు. చిన్నారులు చదువు పట్ల శ్రద్ద చూపించాలని హితవు పలికారు. లైంగిక వేదింపులు గురించి మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లను వివరించారు. పాఠశాల సిబ్బందితో సమీక్ష నిర్వహించి సందర్శన సమయంలో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దుటకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ కి ఆదేశించారు. కురుకుట్టి గ్రామంలో రెసిడెన్సియల్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో ఇటీవల లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినులను కలసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. సాలూరు అర్బన్ ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన గర్భిణీలకు సామూహిక సీమంతాలు, చిన్నారుల అన్నప్రాసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రీ స్కూల్ కార్యక్రమాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సాలూరు పట్టణంలో గల వై.టి.సిలో నిర్వహిస్తున్న గర్భిణీల వసతి గృహంను సందర్శించి అక్కడ పరిస్థితులను, సమస్యలను స్థానిక సిబ్బందిని, లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు.



ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి.వరహాలు, ఉప విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా బాలల రక్షణ అధికారి కె. వి. రమణ, సాలూరు అర్బన్, రూరల్ సీడీపీఓ లు సత్యవతి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

Comments