స‌మష్టి కృషి వ‌ల్లే రీ-స‌ర్వేలో మంచి ఫ‌లితాలు సాధించాం

 


*స‌మష్టి కృషి వ‌ల్లే రీ-స‌ర్వేలో మంచి ఫ‌లితాలు సాధించాం



*


*స‌ర్వే, రెవెన్యూ సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ప్ర‌శంస‌లు

*సాంకేతిక అంశాల‌పై, ప‌రిక‌రాల వినియోగంపై వీఆర్వోలు, స‌ర్వేయ‌ర్ల‌కు శిక్ష‌ణ‌


విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌ర్ 05 (ప్రజా అమరావతి) ః జిల్లా అధికారులు, సర్వే, రెవెన్యూ సిబ్బంది స‌మ‌ష్టి కృషి వ‌ల్లే జిల్లాలో చేప‌ట్టిన స‌మ‌గ్ర భూ స‌ర్వేలో ఉత్త‌మ ఫ‌లితాలు సాధించగ‌లిగామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. ఎంతో సంక్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌లో అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించి అనుకున్న దానికంటే ఎక్కువ గ్రామాల్లో స‌ర్వే చేసి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌టం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. సుమారు 180 గ్రామాల్లో పూర్తి చేసిన స‌ర్వే వ‌ల్ల 11 వేల మంది రైతుల వివ‌రాల‌ను వెబ్‌ల్యాండ్ లో పొందుప‌ర‌చ‌గ‌లిగామ‌ని గుర్తు చేశారు. రీ-స‌ర్వే ప్ర‌క్రియ‌లో అనుస‌రించాల్సిన విధానాలు, డ్రోన్ల వినియోగం, సాంకేతిక అంశాలపై జిల్లాలోని స‌ర్వేయ‌ర్లు, ప‌లువురు వీఆర్వోల‌కు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి స‌మ‌గ్ర భూ స‌ర్వే ఆవ‌శ్య‌క‌త‌ను, ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు. ఇదొక సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని, దీనిలో అంద‌రూ బాధ్య‌త‌గా భాగ‌స్వామ్యం కావాల‌ని సూచించారు. వందేళ్ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి రీ-స‌ర్వే ఒక చక్క‌ని వేదిక అని అభిప్రాయప‌డ్డారు.


*రైతులంద‌రికీ స‌మాచారం తెలియ‌జేయండి*


రీ-స‌ర్వే నిర్వ‌హించే ముందు ఆయా గ్రామాల్లోని రైతులంద‌రీకి ముందుస్తు స‌మాచారం తెలియ‌ప‌ర‌చాల‌ని సిబ్బందిని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గ్రామ ప‌రిధిలో ఉండే పెద్ద‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల స‌హాయం తీసుకొని ప్ర‌క్రియను స‌జావుగా నిర్వ‌హించాల‌ని సూచించారు. స‌ర్వే, రెవెన్యూ సిబ్బంది ఓపిక, స‌హ‌నం పాటించాల‌ని ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం లేకుండా ప్ర‌జ‌ల‌ను ఒప్పించి ప్ర‌క్రియ‌ను ముగించాల‌ని చెప్పారు. నిర్ణీత కాలంలో పూర్తి చేయ‌టంతో పాటు త‌ప్పులు లేకుండా రీ-స‌ర్వేను పూర్తి చేయాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని పేర్కొన్నారు. శిక్ష‌ణ‌లో భాగంగా వీఆర్వోలు, స‌ర్వేయ‌ర్ల నుంచి క్షేత్ర‌స్థాయిలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ఆమె అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో చేప‌ట్టిన రీ-స‌ర్వే ప్ర‌క్రియ‌లో భాగ‌స్వామ్య‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి అభినంద‌న‌లు తెలిపారు.


కార్యక్ర‌మంలో కె.ఆర్‌.ఆర్‌.సి. విభాగం ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్ సూర్య‌నారాయ‌ణ‌, చీపురుప‌ల్లి ఆర్డీవో అప్పారావు, స‌ర్వే విభాగం స‌హాయ సంచాల‌కులు త్రివిక్ర‌మ‌రావులు ప‌లు అంశాల‌పై స‌ర్వేయ‌ర్ల‌కు, వీఆర్వోలకు, ఇత‌ర సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పించారు.



Comments