వాహనాలన్నిటికీ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉండేలా చర్యలు తీసుకోండి

 వాహనాలన్నిటికీ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉండేలా చర్యలు తీసుకోండి


హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లతోనే కొత్త వాహనాల డెలివరీ ఇవ్వాలి

ప్రభుత్వ వాహనాలపై అధికారుల హోదాతో కూడిన బోర్డులు తొలగించాలి

అన్ని రవాణా,హైర్డ్ వాహనాలు,బస్సుల వెనుక రేడియం టేపు ఉండాలి

ప్రమాదాలకు ఆస్కారం ఉన్న అన్నిముఖ్య కూడళ్ళలో సిసి కెమెరాలుండాలి

        ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి 

అమరావతి,12 జనవరి (ప్రజా అమరావతి):రాష్ట్రంలోని అన్ని రకాల వాహనాలకు హెసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి రవాణాశాఖ అధికారులను ఆదేశించారు.గురువారం అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన రోడ్డు సేప్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని రకాల వాహనాలకు తప్పని సరిగా హైసెక్యురిటీ నంబరు ప్లేట్లు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.నూతన వాహనాలు కొనుగోలు చేసే వారికి ఆయా వాహనాల డీలర్లు ఈవిధంగా హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లుతో వాటిని అందించేలా చూడాలని అన్నారు.అదే విధంగా పాత వాహనదారులు కూడా ఒక నిర్ధిష్ట వ్యవధిలోగా హైసెక్యురిటీ నంబరు ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలని రవాణా శాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.దీనిపై ప్రజల్లో అవగాహనకు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సిఎస్ స్పష్టం చేశారు.వివిధ ప్రభుత్వ వాహనాలపై అధికారుల హోదాతో కూడిన నేమ్ బోర్డులు ఉంటున్నాయని ఆవిధంగా ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దమని కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే ఉండాలని దీనిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని రవాణా,పోలీస్ శాఖలను సిఎస్ ఆదేశించారు.

ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని రవాణా,అద్దె వాహనాలు, బస్సులు,ట్రాక్టర్లు,ట్రక్కులు వంటి వాహనాల వెనుక భాగంలో విధిగా రేడియం టేపు అతికించి ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రవాణా,పోలీస్ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు.ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్న అన్ని ముఖ్య కూడళ్ళలో తప్పని సరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించాలని రవాణా,పోలీస్ శాఖలను ఆదేశించారు.

వీడియో లింక్ ద్వారా ఈసమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణ బాబు మాట్లాడుతూ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా రవాణా,పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.హైసెక్యూరిటీ నంబరు ప్లేటు ఏర్పాటు చేశాకే వాహనం డెలివరీ చేసేలా చూడాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఈసమావేశంలో టిఆర్అండ్బి కార్యదర్శి ప్రద్యుమ్నపవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలను వివరించారు.హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఏర్పాటు చేశాకే వాహనాల డెలివరి ఇచ్చేలా చేసేందుకు త్వరలో డీలర్లతో చర్చించడం జరుగుతుందని చెప్పారు. విశాఖపట్నంలో ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు.15 ఏళ్ళు దాటిన పాత వాహనాలు స్క్రాపింగ్ చేసేందుకు వీలుగా స్క్రాపింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అందుకు వారికి ప్రభుత్వం నుండి కొన్ని రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉందని సిఎస్ దృష్టికి తెచ్చారు.

అనంతరం అజెండా అంశాలైన ప్రస్తుతం విశాఖపట్నం,ఎన్టిఆర్ జిల్లా,నెల్లూరు జిల్లాల్లోని ఆటోమేషన్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ సివిల్ పనుల ప్రతిపాదనలకు కమిటీ ఆమోదించింది. అలాగే శ్రీకాకుళం,విజయనగరం,అనకాపల్లి,ఏలూరు,శ్రీసత్యసాయి జిల్లాల్లో కూడా ఈవిధమైన ట్రాక్లు అభివృద్ధికి సంబంధించిన సివిల్ పనులకు కమీటీ ఆమోదించింది.అదే విధంగా రవాణా, పోలీస్ శాఖల సిబ్బందికి స్పీడ్ లేజర్ గన్స్ మరియు బ్రీత్ ఎనలైజర్స్ కు ఎఎంసికి కమిటీ ఆమోదం తెలిపింది.

ఈసమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్త,అదనపు డిజిపి రోడ్డు సేప్టీ కృపానంద త్రిపాఠి ఉజేల,రావాణా శాఖ అదనపు కమిషనర్ ఎస్ఏవి ప్రసాదరావు పాల్గొన్నారు.

        

Comments