ల‌బ్ధిదారుల‌కు గౌర‌వం క‌ల్పిస్తూ ప‌థ‌కాలు అందిస్తున్నారు

 

కాకినాడ‌, జ‌న‌వ‌రి 04 (praja amaravati);


*ల‌బ్ధిదారుల‌కు గౌర‌వం క‌ల్పిస్తూ ప‌థ‌కాలు అందిస్తున్నారు*


- అర్హ‌త ఉంటే చాలు అన్ని ప‌థ‌కాలూ ఇంటికే చేరుతున్నాయి

- కాకినాడ ఎంపీ వంగా గీత‌


ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాన‌వ‌తా దృక్ప‌థంతో ప‌రిపాల‌న సాగిస్తున్నారని.. ల‌బ్ధిదారుల‌కు గౌర‌వం క‌ల్పిస్తూ ప‌థ‌కాలు అందిస్తున్నార‌ని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. బుధ‌వారం కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేష‌న్ స‌మావేశ మందిరంలో వైఎస్సార్ పెన్ష‌న్ కానుక కింద నెల‌నెలా అందించే మొత్తాన్ని రూ. 2,500 నుంచి రూ. 2,750కు పెంచి, పంపిణీచేసే జిల్లాస్థాయి కార్య‌క్ర‌మం జ‌రిగింది. జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, కాకినాడ అర్బ‌న్ శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళాదీప్తి, కాకినాడ మాజీ మేయ‌ర్ సుంక‌ర శివ ప్ర‌సన్న‌, కాకినాడ క‌మిష‌న‌ర్ కె.ర‌మేష్‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్ సీహెచ్ నాగ‌న‌ర‌సింహ‌రావు, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి త‌దిత‌రులు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ వంగా గీత మాట్లాడుతూ మంచి మ‌న‌సున్న మ‌నిషి ముఖ్య‌మంత్రి అయితే ప‌రిపాల‌న ఎలా అందుతుందో తెలిపేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి  ప‌రిపాల‌నా విధానం అన్ని రాష్ట్రాల‌నూ ఆక‌ర్షిస్తోంద‌ని.. పింఛ‌నుదారుల‌కు ఆత్మ‌గౌర‌వం క‌ల్పిస్తూ పెన్ష‌న్ల‌ను అందిస్తున్నార‌న్నారు. అడ‌క్కుండానే అన్నీ ఇచ్చే వ్య‌క్తి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అని.. అర్హ‌త ఉంటే చాలు ప‌థ‌కాల‌ను అందించేందుకు దేశంలో ఎక్క‌డాలేని విధంగా గ్రామ‌, వార్డు వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని తెలిపారు. దేశంలో ఇప్ప‌టికే 6-8 రాష్ట్రాలు వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఉన్న పెన్ష‌న్ల‌ను తీసేస్తున్నారంటూ కొంద‌రు అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని.. ఉన్న పెన్ష‌న్ల‌కు తోడు కొత్త‌గా 12,448 పెన్ష‌న్‌ల‌ను మంజూరు చేసిన‌ట్లు ఎంపీ వంగా గీత వెల్ల‌డించారు.

***

*అత్యంత పార‌ద‌ర్శ‌కంగా పెన్ష‌న్ల పంపిణీ: క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా*

కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ పేద‌ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మాల్లో వైఎస్సార్ పెన్ష‌న్ కానుక ముఖ్య‌మైంద‌ని, జిల్లాలో 2023, జ‌న‌వ‌రి నుంచి 2,76,414 మంది లబ్ధిదారుల‌కు నెల‌కు రూ. 76.02 కోట్లు అందించ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. వృద్ధాప్య‌, వితంతు, చేనేత‌, మ‌త్స్య‌, క‌ల్లు గీత కార్మికులు, క‌ళాకారులు త‌దిత‌ర 16 ర‌కాల పెన్ష‌న్ల‌ను ప్ర‌భుత్వం అందిస్తోంద‌న్నారు. అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ కుల‌, మ‌త, రాజ‌కీయ‌ల‌తో సంబంధం లేకుండా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ల ద్వారా పెన్ష‌న్లు అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. వృద్ధులు, వితంతువులు త‌దిత‌రులు పెన్ష‌న్ మొత్తంతో స్వ‌తంత్రంగా, ఆత్మ‌గౌర‌వంతో జీవిస్తున్నార‌ని పేర్కొన్నారు. నూత‌న సంవ‌త్స‌రం మొద‌ట్లో ఇంత మంచి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తుండ‌టం చాలా ఆనందం క‌లిగిస్తోంద‌న్నారు. స‌మాజం అభివృద్ధి చెందాలంటే అస‌మాన‌త‌లు తొల‌గి.. స‌మాన‌త నెల‌కొనాల‌ని.. ఆ దిశ‌గా వెళ్లేందుకు వైఎస్సార్ పెన్ష‌న్ కానుక వీలుక‌ల్పిస్తోంద‌న్నారు. అర్హ‌త ఉన్న ఏ ఒక్క‌రికీ పెన్ష‌న్ తొల‌గించ‌డం జ‌ర‌గ‌లేద‌ని.. పెన్ష‌న్లు తొల‌గిస్తున్నారంటూ వ‌స్తున్న వ‌దంతుల‌ను న‌మ్మవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త‌గా ఇప్పుడు 12,448 పెన్ష‌న్లు మంజూరు చేసిన‌ట్లు వివ‌రించారు. వైఎస్సార్ పెన్ష‌న్ కానుక ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకొని కొత్త సంవ‌త్స‌రంలో అంద‌రూ ఆరోగ్యంతో ఆనందంగా జీవించాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

***

*అవినీతి రహితంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు: శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి*

రాష్ట్రంలో అవినీతి ర‌హితంగా, సిఫార్సుల అవ‌స‌రం లేకుండా అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని కాకినాడ అర్బ‌న్ శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌రరెడ్డి తెలిపారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓ అన్న‌గా, త‌మ్ముడిగా, ఇంటికి పెద్ద కొడుకుగా జ‌గ‌న‌న్న అమ్మఒడి, సున్నావ‌డ్డీ, రుణ మాఫీ, ఆరోగ్య‌శ్రీ త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌తి పేద‌వాని ఆరోగ్యానికి భ‌రోసా క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. ఎవ‌రూ ఎక్క‌డికీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండానే ప్ర‌జ‌ల‌కు పెన్ష‌న్ వంటి ప‌థ‌కాలు అందుతున్నాయ‌న్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన స‌మ‌యానికి కాకినాడ ప‌ట్ట‌ణంలో 15,500 వ‌ర‌కు పెన్ష‌న్లు ఉండేవ‌ని.. ఇప్పుడు ఆ సంఖ్య 26,500కు పెరిగింద‌ని చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వివ‌రించారు. కార్య‌క్ర‌మం  సంద‌ర్భంగా వైఎస్సార్ పెన్ష‌న్ కానుకకు సంబంధించిన మెగా చెక్‌ను ల‌బ్ధిదారుల‌కు అందజేశారు. అదే విధంగా కొత్తగా పెన్ష‌న్ మంజూరైన వారికి పెన్ష‌న్ పుస్త‌కాలను ఎంపీ వంగా గీత‌, క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ పెన్ష‌న్ కానుక ల‌బ్ధిదారులు, మాజీ కార్పొరేట‌ర్లు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.


Comments