డిజిటల్ లెండింగ్ ఫ్లాట్ ఫారమ్స్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:సిఎస్.జవహర్ రెడ్డి

 డిజిటల్ లెండింగ్ ఫ్లాట్ ఫారమ్స్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:సిఎస్.జవహర్ రెడ్డి


అమరావతి,3 జనవరి (ప్రజా అమరావతి):ఇటీవల కాలంలో నానాటికీ పెరుగుతున్న వివిధ డిజిటల్ లెండింగ్ ఫ్లాట్ ఫారమ్స్ చేసే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.మంగళవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో సిఎస్ అధ్యక్షతన 27వ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.ఈసమావేశంలో సిఎస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోజు రోజుకూ పెరుగుతున్న వివిధ డిజిటల్ లెండింగ్ యాప్ లు,ఆన్లైన్ లోన్ యాప్ ల మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.ఇటువంటి మోసాలను నియంత్రించేందుకు జాతీయ స్థాయిలో ఒక పరిష్కార మార్గాన్ని కూడా రూపొందించాల్సిన అవసరం ఉందని ఆదిశగా రిజర్వు బ్యాంకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిఎస్.జవహర్ రెడ్డి సూచించారు.ఇలాంటి మోసాలను నియంత్రించేందుకు సంబంధిత రెగ్యులేటింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఎస్ స్పష్టం చేశారు.అదే విధంగా డిజిటిల్ లెండింగ్ మోసాలను నియంత్రించేందుకు వాటిపై ప్రజల్లో విస్తృత అవగాహనను పెంపొందించేలా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయి వరకూ విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సిఎస్.డా.జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు.

అంతకు ముందు ఎస్ఎల్సిసి సమావేశానికి సంబంధించి గత సమావేశంలో సమీక్షించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికపై(ఎటిఆర్)చర్చించారు.వివిధ చిట్ ఫండ్ కంపెనీల మోసాలకు సంబంధించి నమోదైన వివిధ కేసులను ఒక నిర్ధిష్ట వ్యవధి ప్రకారం త్వరిత గతిన పరిష్కరించి బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.అదే విధంగా సమాజంలో రోజు రోజుకు వస్తున్న వివిధ నూతన వస్తువులపైన ప్రజల హక్కులకు సంబందించి,ఇన్వెస్టర్ అవేర్ నెస్ ఫైనాన్సియల్ లిట్రసీపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని సిఎస్ పేర్కొన్నారు.ఎస్ఎల్సిసి ఆశయాలు లక్ష్యాలను పూర్తిగా నెరవేర్చేలా సంబంధిత విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈసమావేశానికి తొలుత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఇన్చార్జి అంజనీ మిశ్రా స్వాగతం పలుకగా డిజియం రూటా మహాపాత్ర 27వ ఎస్ఎల్సిసి సమావేశపు అజెండా అంశాలను సమావేశంలో చర్చకు పెట్టారు.అజెండా అంశాల్లో అగ్రిగోల్డు,అక్షయ గోల్డు, అభయ గోల్డు,హీరా గ్రూఫ్,కఫిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు,మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించి ఆదర్శ్ ఎంఎస్సిఎస్,స్టార్ ఎంఎస్సిఎస్,సహారా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ,ప్రగతి ఎంఎస్సిఎస్,అవని ఎంఎస్సిఎస్,లోక్హిత్ భారతి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించి జరిగిన వివిధ మోసాలపై నమోదైన కేసులు వాటి ప్రగతిని సమావేశంలో చర్చించారు.అదే విధంగా వివిధ డిజిటల్ లెండింగ్ యాప్ లు,ఆన్లైన్ రుణ యాప్ ల మోసాలపైన ఈ సమావేశంలో చర్చించారు.అంతేగాక మార్కెట్ ఇంటలిజెన్స్ కింద వివిధ విదేశీ ఆర్ధిక సంస్థలకు సంబంధించిన ఆన్లైన్ మోసాలపై కూడా ఈసమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈసమావేశంలో ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్,ఆశాఖ కార్యదర్శి కెవివి.సత్యనారాయణ,హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్,న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర రావు,విజయవాడ ఎసిపి సిహెచ్.శివప్రసాదరావు,ఆర్బిఐ మేనేజర్ నారాయణ, అసిస్టెంట్ మేనేజర్ హరనాధ్ రెడ్డి,నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు చెందిన పి.శ్రీజ,ఆడిట్ రిజిష్ట్రార్ ఎన్విఆర్ ఆనందబాబు,రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వరప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.

   

Comments