మాజీ ఎమ్మెల్యే రావిపై దుష్ప్రచారం “మళ్ళీ మొదలు

 *- మాజీ ఎమ్మెల్యే రావిపై దుష్ప్రచారం “మళ్ళీ మొదలు


”* 

 *- చంద్రబాబును రాంగ్ ట్రాక్ పట్టించేందుకు కుట్రలు* 

 *- సీటు తమకే ఇచ్చేశారంటూ ప్రజల్ని నమ్మించే యత్నం* 

 *- పధకం ప్రకారం టీడీపీ భవిష్యత్తుతోనూ ఆటలు*

 *- 2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్న రావి* 

 *- చంద్రబాబు దృష్టిలో కొడాలి నానికి ధీటైన అభ్యర్థిగా రావి* 



గుడివాడ, జనవరి 3 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై ఎప్పటిలాగే దుష్ప్రచారాన్ని మళ్ళీ మొదలు పెట్టేశారు. ఇందు కోసం కొంత మంది ఇప్పటి నుండే సామ దాన దండోపాయాలను వినియోగించుకుంటున్నారు. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును రాంగ్ ట్రాక్ పట్టించే కుట్రలకు కూడా వెనకాడడం లేదు. రూ. కోట్లు ఇచ్చి సీటు తెచ్చుకున్నామంటూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుతోనూ ఆటలాడుకుంటున్నారు. ఇంకో అడుగు ముందుకేసి టీడీపీ సీటు ఇచ్చేశారంటూ ఏకంగా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే రావిని లక్ష్యంగా చేసుకుని అయన ఇమేజ్ ను డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా గుడివాడ నియోజకవర్గంలో పని చేసుకుపోయేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తూ మాజీ ఎమ్మెల్యే రావిని తిరుగులేని నాయకుడిగా చెప్పుకోవచ్చు. ఇంకా రావి కుటుంబానికి నియోజకవర్గ ప్రజల్లో ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ తర్వాత రావి కుటుంబమే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ నియోజకవర్గంగా ఉన్న గుడివాడను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావిస్తుంటారు. అలాంటి నియోజకవర్గంలో టీడీపీ తన పూర్వ వైభవాన్ని కోల్పోవడానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రావిపై ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. అలాగే పార్టీ అధిష్టానం కూడా ఎన్నికలకు ముందు ఉన్నట్టుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతుండడం అనేక విమర్శలకు తావిస్తోంది. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే రావి తన పెద్ద మనస్సుతో కష్టాల్లో ఉన్న పార్టీని ఎప్పటికప్పుడు భుజాన వేసుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకువచ్చే పనిలో రావి నిమగ్నమవుతుండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. 2019 ఎన్నికల తర్వాత గుడివాడ నియోజకవర్గ పరిస్థితులను పరిశీలిస్తే గత మూడున్నరేళ్ళుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అధిష్టానం కూడా రావి చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ వస్తోంది. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన బాదుడే బాదుడు, "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమాలకు ప్రజల నుండి ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందనే వచ్చింది. చంద్రబాబు స్వయంగా రావి పనితీరును అభినందించడం విశేషం. మాజీ ఎమ్మెల్యే రావి విషయానికొస్తే 2024 ఎన్నికలే లక్ష్యంగా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించాలనే కసితో పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా తానే పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే రావి ప్రకటించుకున్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటున్న రావి అభ్యర్ధనకు ప్రజలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇటీవల కాలంలో రావి తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుండడం తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది. కృష్ణాజిల్లాలో మొదటగా రావి నాయకత్వంలో గుడివాడలో నిర్వహించిన మినీ మహానాడు పెద్దఎత్తున విజయవంతమైంది. ఆ తర్వాత సెమీక్రిస్మస్, క్రిస్మస్, రావి పుట్టినరోజు, నూతన సంవత్సర వేడుకలు ఇలా భారీగా నిర్వహించిన కార్యక్రమాలు రావికి మంచి పేరునైతే తెచ్చిపెట్టాయి. మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలకు ముందు రోజు వైసీపీ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టిన రావి చంద్రబాబు దృష్టిలో కొడాలి నానిని ఎదుర్కొనే ధీటైన అభ్యర్ధిగా నిలిచిపోయారు. పరిస్థితులన్నీ రావికి అనుకూలంగా మారుతుండడంతో ఆయనకు సీటు రాకుండా చేసేందుకు మాఫియా తరహా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గత 2019 ఎన్నికల్లో కొత్త అభ్యర్ధిని రంగంలోకి దించిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గుడివాడలో తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్ధి రావి అనే అభిప్రాయంతో ఆ పార్టీ అధిష్ఠానం ఉంది. ఈ అభిప్రాయం నుండి అధిష్టానం దృష్టిని మళ్ళించేందుకు రావిపై పనిగట్టుకుని కొంతమంది దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారు. రావి మాత్రం చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్ లో గుడివాడ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను చేసుకుపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారి మద్దతును కూడగడుతున్నారు. మొత్తం మీద గుడివాడ తెలుగుదేశం పార్టీ సీటు రావికి ఖరారవుతున్న నేపథ్యంలోనే ఆయనపై దుష్ప్రచారమైతే జరుగుతోంది. అధిష్ఠానం మాత్రం ఈ దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా ఎంతో భిన్నంగా వ్యవహరిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Comments