గ్రీన్ ఎన‌ర్జీవైపు అడుగేద్దాంగ్రీన్ ఎన‌ర్జీవైపు అడుగేద్దాం

జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు పిలుపు


విజ‌య‌న‌గ‌రం, జూన్ 09  (ప్రజా అమరావతి) ః

                 ప్ర‌తీఒక్క‌రూ ప‌ర్యావ‌ర‌ణ హిత గ్రీన్ ఎన‌ర్జీవైపు అడుగులు వేయాల‌ని జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు అంద‌రిచేతా ప్ర‌తిజ్ఞ చేయించారు. గో ఎల‌క్ట్రిక్‌..... గో గ్రీన్ నినాదంతో జిల్లా ప‌రిష‌త్ ఆవ‌ర‌ణ‌లో నెడ్‌క్యాప్‌ ఏర్పాటు చేసిన విద్యుత్‌ వాహ‌నాల ప్ర‌ద‌ర్శ‌న‌, అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న శుక్ర‌వారం ప్రారంభించారు. ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాలు, ఆటోల‌ను, కార్ల‌ను ఆయ‌న ఆస‌క్తిగా ప‌రిశీలించారు. వాహ‌నాల‌ను స్వ‌యంగా న‌డిపి చూశారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న గురించి, ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను వినియోగించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను, నెడ్‌క్యాప్ జిల్లా నిర్వాహ‌కులు ఎం.వి.కె.రాజు వివ‌రించారు.


                ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తీఒక్క‌రూ తప్ప‌నిస‌రిగా విద్యుత్‌ వాహ‌నాల‌ను వినియోగించాల్సిన అవ‌సరం ఉంద‌న్నారు. పెట్రోలు, డీజిల్ లాంటి సాంప్ర‌దాయ ఇంథ‌నాల‌వ‌ల్ల కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంద‌ని, ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయ‌ని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కూడా దేశంలో గ్రీన్ ఎన‌ర్జీ వాడ‌కాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని చెప్పారు. దీనిలో భాగంగానే ఇటీవ‌ల రాష్ట్రంలో కూడా గ్రీన్ ఎన‌ర్జీ వినియోగాన్ని పెంచే చ‌ర్య‌ల‌ను మ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్రారంభించార‌ని, ఈ అంశంలో కూడా మ‌న రాష్ట్రం ఎంతో ముందుంద‌ని తెలిపారు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెర‌గాలంటే, ఛార్జింగ్ స్టేష‌న్ల సంఖ్య పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీనికోసం జిల్లా ప‌రిషత్ ఆవ‌ర‌ణ‌లో ఒక ఛార్జింగ్ స్టేష‌న్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.


               నెడ్‌క్యాప్ జిల్లా నిర్వాహ‌కులు ఎం.వి.కె.రాజు మాట్లాడుతూ, కాలుష్య ర‌హిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌ని అన్నారు. మ‌న రాష్ట్రంలో సుమారు కోటి,30 ల‌క్ష‌ల వాహ‌నాలు ఉన్నాయ‌ని, వీటిలో అత్య‌ధికంగా ద్విచ‌క్ర‌వాహ‌న‌లేన‌ని చెప్పారు. వీటి వినియోగం వ‌ల్ల ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గుపులుసు వాయువు వాతావ‌ర‌ణంలో క‌లిసి, ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటోంద‌ని అన్నారు. విద్యుత్ వాడ‌కాల వినియోగం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ జ‌ర‌గ‌డ‌మే కాకుండా,  ర‌వాణా ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని, త‌ద్వారా విదేశీ మార‌క‌ద్ర‌వ్యం కూడా ఎంతో ఆదా అవుతుంద‌ని చెప్పారు.


              ఈ కార్య‌క్ర‌మంలో నెడ్‌క్యాప్ డైరెక్ట‌ర్ ప‌ద్మావ‌తి, జెడ్‌పిటిసి గార త‌వుడు, జెడ్‌పి సిఇఓ ఎం.అశోక్‌కుమార్‌, డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్‌, జెడ్‌పి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments