పాఠశాల భవనాలు త్వరగా పూర్తి చేయాలి.



*పాఠశాల భవనాలు త్వరగా పూర్తి చేయాలి*



పార్వతీపురం, జూలై 24 (ప్రజా అమరావతి): పాఠశాల భవనాలు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఆదేశించారు. సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్య కార్యదర్శి పాచిపెంట మండలం గుతువునాయుడుపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలు, పాచిపెంటలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు కల్పిస్తున్న అదనపు వసతులను., సాలూరు మండలం మామిడిపల్లిలో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల భవనాలు, మక్కువ మండలం అనసభద్రలో నిర్మాణంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలు పరిశీలించారు. నిర్మాణాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆగష్టు నెలలో ఒకటి, అక్టోబరు నెలలో ఒకటి, మిగిలినవి మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. మామిడిపల్లిలో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల భవనాల నిర్మాణం దీర్ఘకాలంగా కొనసాగడం పట్ల వివరణ అడిగారు. నిధులు కేటాయింపులో చర్యలు తీసుకుంటామని ముఖ్య కార్యదర్శి చెప్పారు. విద్యార్థులకు వసతి సౌకర్యాలు అవసరం అని ఆయన అన్నారు. ప్రతీ భవనం ఉత్తమంగా ఉండాలని, ఆధునిక వ్యవస్థకు అనుగుణంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల బోధన, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులకు ఉన్నత ఉపాధి,విద్యావకాశాలు స్పష్టంగా తెలియజేసి మార్గదర్శకత్వం ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందని  వాటి ఫలితాలు విద్యార్థులు పొందాలని ఆయన పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, కార్యనిర్వాహక ఇంజినీర్ జె. శాంతీశ్వర రావు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

Comments