27నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర.

 *27నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర


*


*తాత్కాలిక విరామం ప్రకటించిన పొదలాడ నుంచే తిరిగి ప్రారంభం*


*పి.గన్నవరంలో గెయిల్‌, ఓఎన్‌జీసీ బాధితులతో ముఖాముఖి*


*ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ  శ్రేణులు*


అమరావతి. ( ప్రజా అమరావతి): టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌  యువగళం పాదయాత్ర సోమవారం ఉదయం 10.19 గంటలకు పునఃప్రారంభం కానుంది. పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన పొదలాడ నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం తాటిపాక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పి.గన్నవరంలో గెయిల్‌, ఓఎన్‌జీసీ బాధితులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మామిడికుదురులో స్థానికులతో భేటీ అవుతారు. సోమవారం దాదాపు 16 కిలోమీటర్ల మేర లోకేశ్‌ పాదయాత్ర సాగనుంది. పాదయాత్ర కోసం ఇప్పటికే టీడీపీ  శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును సెప్టెంబరు 9న సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో లోకేశ్‌ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిలు లభించడంతో పాదయాత్ర కొనసాగించాలని లోకేశ్‌ నిర్ణయించారు. సెప్టెంబరు 9న కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేశ్‌ పాదయాత్రకు విరామం ప్రకటించారు. అక్కడి నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్ర ముగిస్తారు. లోకేశ్‌ పాదయాత్ర ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో మొదలైంది.


కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400 రోజుల్లో 4 వేల కి.మీ.లు పాదయాత్ర చేయాలన్నది లోకేశ్‌ మొదట అనుకున్న లక్ష్యం. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, దిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు, జగన్‌ ప్రభుత్వ అరాచకాలు, కక్షసాధింపుపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకుల్ని కలిసి వివరించడం వంటి వ్యవహారాల్లో ఇన్నాళ్లూ ఆయన తీరిక లేకుండా ఉన్నారు. దీంతో రెండున్నర నెలలపాటు పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఎన్నికలు మరింత దగ్గరపడుతుండటంతో... ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయాలన్న లక్ష్యాన్ని కుదించుకుని, విశాఖపట్నంలో ముగించనున్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖలోనే ముగించారు. ఆ సెంటిమెంటు కూడా కలిసి వచ్చేలా లోకేశ్‌ విశాఖలో పాదయాత్ర ముగించే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనికి తగ్గట్టుగా రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నారు.


వైసీపీ నేతల భూదాహమే యువ వైద్యుడిని బలితీసుకుంది : వైసీపీ నేతల భూదాహమే యువ వైద్యుడిని బలి తీసుకుందని టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు తమ్ముడు కల్యాణ్ భూదందాలు, దౌర్జన్యాలు భరించలేక కాకినాడకు చెందిన యువ వైద్యుడు నున్న శ్రీకిరణ్‌ ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. శ్రీకిరణ్‌కి చెందిన 5 ఎకరాలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా, ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తనవద్దే ఉంచుకుని కల్యాణ్ వేధిస్తుండటం వల్లే యువ డాక్టర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆక్షేపించారు. ఇది ముమ్మాటికీ వైసీపీ  భూ బకాసురులు చేసిన హత్యేనని లోకేశ్‌ ఆరోపించారు. డాక్టర్ మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రాణాలు తీసుకోవ‌డం స‌మ‌స్యకి ప‌రిష్కారం కాదని, బాధితులంతా ఏక‌మై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దందాలు, క‌బ్జాల‌ను ఎదురించాలన్నారు.

Comments