రాష్ట్ర స్థాయి 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ - 2023 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి..


విజయవాడ, (ప్రజా అమరావతి);

రాష్ట్ర స్థాయి 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ - 2023 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి..


- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మెంబెర్ సెక్రటరీ డా. వై. అపర్ణ. 

రాష్ట్ర స్థాయి 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ - 2023 ఈ నెల 29, 30వ తేదీలలో కె.ఎల్. యూనివర్సిటీలో నిర్వహిస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (అప్ కాస్ట్) మెంబెర్ సెక్రటరీ డా. వై. అపర్ణ తెలిపారు. 

విజయవాడ భవానీపురం లోని అప్ కాస్ట్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో  రాష్ట్ర స్థాయి 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లను  వివరించారు.  ఈ సందర్భంగా అపర్ణ మాట్లాడుతూ పిల్లలు హేతుబద్దంగా ఉండటానికి పరిశోధనలు అర్ధం చేసుకోవడానికి పరిసరాలలోని స్థానిక సమస్యలను పరిష్కరించడానికి, పరిష్కారాలను వెతకడానికి శాస్త్రీయ పద్దతులను వర్తింప చేయడానికి బాలల సైన్స్ కాంగ్రెస్ ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.  గుంటూరు జిల్లా వడ్డేశ్వరం లోని కె.ఎల్. డీమ్డ్ టూ బి యూనివర్సిటీలో ఈ నెల 29, 30వ తేదీలలో నిర్వహించే 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో రాష్ట్ర నలుమూలల నుండి బాల శాస్త్ర వేత్తలు, గైడ్స్, ఎస్కార్ట్ టీచర్ లు, జిల్లా కో ఆర్డినేటర్లు, జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ లతో సహా మొత్తం 500 మంది పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. 

విచారణ - ఆధారిత అబ్యాస కార్యక్రమాలు ప్రతీ సంవత్సరం ఒక నిర్దిష్ట ఫోకల్ థీమ్ పై నిర్వహించబడుతుందని దీనిలో భాగంగా     " లోకల్ ఫర్ గ్లోబల్ " అనే ప్రాథమిక సూత్రం పై నిర్ణయించబడుతుందన్నారు.  కోవిడ్ మహమ్మారి అనంతరం వచ్చిన పరిస్థితుల్లో మానవ శ్రేయస్సు, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో దాని నిబద్ధతను పరిగణలోనికి తీసుకుంటారన్నారు. 

విద్యార్థులకు అవగాహన కొరకు 5 ఉప అంశాలుగా విభజించామన్నారు.  (1) మీ పర్యావరణ వ్యవస్థను గురించి తెలుసుకోవడం (2) ఆరోగ్యం - పోషణ మరియు సంక్షేమం పెంపొందించడం (3) పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యం కోసం సామజిక మరియు సాంస్కృతిక పద్ధతులు (4) స్వీయ - విశ్వాసం కోసం పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానం (5) పర్యావరణ వ్యవస్థ మరియు ఆరోగ్యం కోసం సాంకేతిక ఆవిష్కరణ.  

జిల్లా స్థాయిలో బాల శాస్త్రవేత్తలచే 4000 వేల ప్రాజెక్ట్ లను తయారు చేసి ప్రదర్శించారని తుదిగా  26 జిల్లాల నుండి 182 ప్రాజెక్ట్ లను ఈ రాష్ట్ర స్థాయి ఈవెంట్ లో ప్రదర్శన కోసం ఎంపిక చేయబడ్డాయని తెలిపారు.  మన రాష్ట్ర కోటా ప్రకారం 17 ప్రాజెక్ట్ లను జాతీయ స్థాయిలో పాల్గొనే ఈవెంట్ కు ఎంపిక చేయబడతామని ప్రతీ జిల్లా నుండి ఒక ప్రాజెక్ట్ ను ఎంపిక చేసి కెవిఆర్ సైంటిఫిక్ సొసైటీ వారి ఎవాల్యూయేషన్ కోసం పంపడం జరుగుతుందన్నారు.   

గత సంవత్సరం 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ విన్నర్ గా ఎంపికైన ఎస్. లావణ్యను గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నదని, అలాగే మంచి ప్రతిభతో A + గ్రేడ్ సాధించిన జి. దర్శితను కూడా అభినందిస్తున్నామన్నారు.  

రాష్ట్ర స్థాయి 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ - 2023లో రాష్ట్ర ఇంధన, పర్యావరణ, అడవులు, శాస్త్ర సాంకేతిక, గనులు భూగర్భ వనరుల శాఖా మాత్యులు శ్రీ పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొననున్నారని రాష్ట్ర విద్యా శాఖామాత్యులు శ్రీ బొత్స సత్యనారాయణ, రెవెన్యూ శాఖామాత్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు, మంగళగిరి శాసనసభ్యులు శ్రీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర పర్యావరణ, అడవులు శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, విద్యాశాఖా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, విద్యా శాఖా కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మెంబెర్ సెక్రటరీ డా. వై. అపర్ణ తెలిపారు.  


Comments