చదువులకు మరింత ఊతమిస్తూ...


అమరావతి (ప్రజా అమరావతి);


*చదువులకు మరింత ఊతమిస్తూ...* *వైఎస్సార్‌ కళ్యాణమస్తు– వైఎస్సార్‌ షాదీ తోఫా.*


*అక్టోబరు–డిసెంబరు 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ.78.53 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


దేవుడి దయతో ఈరోజు మరో మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 10,132 మంది జంటలకు మంచి చేసే కార్యక్రమం. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా కార్యక్రమంలో... పిల్లలను చదవించే విషయంలో ఒక అడుగు ముందుకు వేసి, ఆ చదువులను ప్రోత్సహిస్తూ వధూవరులు ఇద్దరూ పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన పెట్టాం.

దీనివల్ల ఈ స్కీంలో అర్హత రావాలంటే, ఆ మేరకు కనీస విద్యార్హత ఉండాలి కాబట్టి పిల్లలను చదివించడానికి ఈ కార్యక్రమం ప్రోత్సాహం ఇచ్చేదిగా ఉంటుంది. 


రెండో నిబంధన ప్రకారం.... కచ్చితంగా వధువుకు 18సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు వయస్సు ఉండాలి. దీనివల్ల  15,16 సంవత్సరాలకే పదోతరగతి పూర్తయిన, 18 సంవత్సరాల కంటే ముందు పెళ్లి జరిగితే ఈ స్కీంకు అర్హత రాదు. మరోవైపు ఇంటర్‌మీడియట్‌ చదువుకు ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద సాయం చేస్తుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తారు. ఇంటర్‌ పూర్తయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యాదీవెన కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే మాదిరిగా పిల్లల బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చులకోసం వసతి దీవెన కార్యక్రమం కింద డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి కోర్సులు చదివే వారికి ఆ విద్యాసంవత్సరంలో ప్రతి ఏప్రిల్‌లో ఒక్కోక్కరికి రూ.20వేల వరకు ఇస్తున్నాం. ఈ రెండు స్కీంలు ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ.. ప్రతి అమ్మాయి, అబ్బాయి గ్రాడ్యుయేట్స్‌ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతున్నాం.


కుటుంబంలో తల్లి చదువుకుని ఉంటే ఆ తర్వాత తరంలో వచ్చే పిల్లలు ఆటోమేటిక్‌గా చదువుల బాటపడతారు. భవిష్యత్‌లో కుటుంబాల తలరాతలు మారాలన్నా, మంచి జీతాలతో ఉద్యోగాలు రావాలన్నా.. మంచి చదువులు మన చేతుల్లో ఉంటే, మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ.. గత ప్రభుత్వ హయాంలో వలె ఈ పథకాన్ని ఏదో నామ్‌కే వాస్త్‌ ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా... ప్రతి క్వార్టర్‌ పూర్తయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్‌ చేసి తర్వాత ఇస్తున్నాం.


సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో సర్టిఫికేట్‌ తీసుకోవాల్సిన అవసరం లేకుండా.. నేరుగా మన  గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేటట్టు మార్పు చేశాం. ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ... ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించేలా సచివాలయం వరకూ తీసుకునిపోయాం.


గతంలో ఎస్సీలకు రూ.40వేలకే పరిమితమైన పథకాన్ని రూ.1లక్ష వరకు తీసుకునిపోయాం.అదే కులాంతర వివాహం అయితే రూ.1.20 లక్షల వరకూ పెంచాం. 

ఎస్టీలకు గతంలో రూ.50 మాత్రమే ఉంటే దాన్ని కూడా రూ.1లక్ష వరకు పెంచడంతోపాటు, కులాంత వివాహానికి రూ.1.20లక్షలకు పెంచాం. గతంలో బీసీలకు కేవలలం రూ.35వేలు మాత్రమే ఇస్తున్న పరిస్థితుల నుంచి రూ.50వేలకు, కులాంతర వివాహం అయితే రూ.75 వేలకు తీసుకునిపోయాం.


దివ్యాంగులకు అయితే ఏకంగా రూ.1.50 లక్షల వరకు  తీసుకునిపోయాం. వాళ్ల కుటుంబాలలో తల్లిదండ్రులు ఏ ఒక్కరూ అప్పులుపాలయ్యే పరిస్థితి రాకూడదని సబ్‌స్టాన్సియల్‌ అమౌంట్‌ పెంచి ఇస్తున్నాం.  చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులలను అడుగులు వేయిస్తాయన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.


గతంలో అరకొరగా ఇస్తున్న పరిస్థితులు ఉండేవి. దాదాపు 17,709 మంది పిల్లలకు ఇచ్చే అరకొర కూడా దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే.. ఈ రోజు ఏ ఒక్కరు మిస్‌ కాకూడదని అని ఆ క్వార్టర్‌ అయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఐదో విడత కార్యక్రమం. అక్టోబరు, నవంబరు, డిసెంబరు క్వార్టర్‌కి సంబంధించినది ఈ రోజు దాదాపు రూ.78 కోట్లు ఇస్తున్నాం.


ఇంతవరకు 56,194 జంటలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ రూ.427 కోట్లు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ మరో ముందడుగు వేస్తున్నంతకు చాలా సంతోషం. దీనివల్ల అందరికీ మంచి జరగాలని, ముఖ్యంగా ఈ క్వార్టర్‌లో ఏకమైన పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని, వాళ్లందరికీ ఆల్‌ ది బెస్ట్‌ తెలియజేస్తున్నాను. 


రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ఇంకా మంచి జరగాలని, మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.

Comments