నాణ్యత, హైజీనిక్ ఆహార పదార్థాల ద్వారా మంచి ఆరోగ్యం.


విజయవాడ (ప్రజా అమరావతి);



*నాణ్యత, హైజీనిక్ ఆహార పదార్థాల ద్వారా మంచి ఆరోగ్యం*


*ఆహార పదార్థాల పరిశుభ్రతకు, కల్తీ ఉత్పత్తుల కట్టడికి పటిష్ఠ చర్యలు*

*దేశవ్యాప్తంగా 1.50 కోట్ల మంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్*

*ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయాలపై రెగ్యులర్ ఆడిట్‌లు*

*పోర్టిఫైడ్ బియ్యంపై నెలకొన్న అపోహలు, భయాలను తొలగించాలి*


- *శ్రీ. జి. కమల వర్ధనరావు, సీఈవో, ఎఫ్ఎస్ఎస్ఏఐ*


                  దేశవ్యాప్తంగా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ స్టోరేజ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఫుడ్ సెల్లింగ్ విధానాల ద్వారా 1.50 కోట్ల మంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఫుడ్ సెక్టార్ లో భాగస్వాములై ఉన్నారని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సీఈవో శ్రీ. జి. కమల వర్ధనరావు అన్నారు. ఫుడ్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్ మెంట్ సిబ్బంది, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో శుక్రవారం విజయవాడలోని ఒక హోటల్ లో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించగా జి.కమల వర్ధనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ ఆపరేటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సలహాలు, సూచనలు కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థిరమైన ప్రమాణాలను అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్ తరాలకు మెరుగైన ఆహార పదార్థాలను అందించడంలో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ - ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అలాగే రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్‌ సప్లిమెంట్స్‌ ఉండేలా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆహారానికి సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేయడంతో పాటు ఆహార పదార్థాలకు సైన్స్ ఆధారిత ప్రమాణాలను నిర్దేశించడానికి, లభ్యతను నిర్ధారించడం ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రధాన లక్ష్యమన్నారు.   

               సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో, విక్రయించాలో సూచిస్తూ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు తెలియజేస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మరింత అలర్ట్ గా వ్యవహరిస్తోందని తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఈ మేరకు హోటల్ వ్యాపారులు, వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ చేసిన సిఫార్సులను పాటించాలన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను నిర్ధారించే విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని, ఇందులో భాగంగా ఫుడ్ ప్రోడక్ట్స్ తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయంతో పాటు దిగుమతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పోర్టిఫైడ్ బియ్యంలో మైక్రో న్యూట్రిషన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి-12 వంటి మరికొన్ని పోషకాలు ఉంటాయన్నారు. ఆహార ఉత్పత్తిలో రాష్ట్రం, చిరు ధాన్యాల ఉత్పత్తిలో దేశం అగ్రభాగంలో ఉన్నాయని పేర్కొన్నారు.

                      రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీ. జె. నివాస్ మాట్లాడుతూ.. మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లతో పాటు మంచి ఆహార పదార్థాలు కూడా చాలా ముఖ్యమని తెలియజేశారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, దుకాణాలపై కేసులు కూడా పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందని స్పష్టం చేశారు.    

                  ఈ కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇంఛార్జ్ డైరెక్టర్ శ్రీ. ఎన్.పూర్ణ చంద్రరావు, ఫుడ్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్ మెంట్ సిబ్బంది, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు, రైస్ మిల్లర్ అసోసియేషన్, ఏపీ హోటల్స్ అసోసియేషన్, ఆయిల్ & మర్చంట్ ఫెడరేషన్, కన్స్యూమర్స్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments