పదో తరగతిలో పునః ప్రవేశం పొంది అత్యుత్తమ ప్రతిభ చూపిన 1071 మంది విద్యార్థులు.




విజయవాడ (ప్రజా అమరావతి);


*పదో తరగతిలో పునః ప్రవేశం పొంది అత్యుత్తమ ప్రతిభ చూపిన 1071 మంది విద్యార్థులు*


*2023లో పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ తో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులు*


*గతంలో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో వైఫల్యం చెందిన విద్యార్థులకు మళ్లీ పదో తరగతి చదివే అవకాశం*


*ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిన మార్కుల పెరుగుదల* 


*విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేలా పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలు*


: *పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్*


2023 పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో వైఫల్యం చెందిన  1071 మంది విద్యార్థులు పదో తరగతిలో పునః  ప్రవేశం పొంది  ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ (G.O.Ms.No.50  SE(Gen) Dept. dated 10.06.2023) ను వినియోగించుకొని ఆయా విద్యార్థులు ఈ ఏడాది 22 ఏప్రిల్ న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మెరుగైన మార్కులు సాధించడం విశేషమని పేర్కొన్నారు.  గతంలో విద్యలో వెనుకబాటుతనం, వైఫల్యాలను ఎదుర్కొన్న సదరు విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన  పునః ప్రవేశ నోటిఫికేషన్ చక్కని తోడ్పాటు అందించిందన్నారు.  ఆయా విద్యార్థులు పదో తరగతిలో పునః ప్రవేశం పొందడం ద్వారా ఉన్నత స్థాయి తరగతుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడమే గాక మరింత పట్టుదలగా చదివి మార్కుల్లో గణనీయమైన పెరుగుదల చూపించారన్నారు.  ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులకు సంబంధించి 2023లో పదో తరగతిలో పొందిన మార్కులను, ప్రస్తుతం పొందిన మార్కులకు తేడా చూపిస్తూ వారి ప్రగతిని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు.


ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ఒక విద్యార్థిని (గోప్యతా కారణాల రీత్యా పేరు వెల్లడించడం లేదు) (రోల్ నెంబర్ 2415101830) 505 మార్కులు (84 శాతం) సాధించింది.  ఇదే విద్యార్థిని 2023లో కేవలం 266 మార్కులు (44 శాతం) మాత్రమే సాధించిందన్నారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన పునః ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్,  కొత్త మార్గదర్శకాలు, అవకాశాలను వినియోగించుకొని సదరు విద్యార్థి  సక్రమంగా పాఠశాలలో అన్ని తరగతులకు హాజరై, అన్ని సబ్జెక్టులను బాగా చదివి  మంచి మార్కులు సాధించడం విశేషమన్నారు.


అదే విధంగా మరో విద్యార్థిని (గోప్యతా కారణాల రీత్యా పేరు వెల్లడించడం లేదు) (రోల్ నెంబర్ 2401200003) ప్రస్తుతం 274 మార్కులు(46 శాతం) మాత్రమే సాధించింది.  ఇదే విద్యార్థిని 2023 పదో తరగతి ఫలితాల్లో కేవలం 220 మార్కులు (36%) మాత్రమే సాధించింది.  గతంలో ఒక సబ్జెక్ట్ విషయంలో సవాళ్లు ఎదుర్కొన్న సదరు విద్యార్థి ఆ ఒక్క సబ్జెక్ట్ పరీక్ష రాసి, సంబంధిత సబ్జెక్ట్ పై మరింత పట్టు సాధించి గతంలో కన్నా మెరుగైన ప్రతిభ చూపించిందని వెల్లడించారు.


పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ (G.O.Ms.No.50  SE(Gen) Dept. dated 10.06.2023) తో పదో తరగతిలో పునః ప్రవేశం పొంది అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్ లో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. చదువులో వెనుకబడిన, మార్కుల్లో వైఫల్యం చెందిన విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ తీసుకువచ్చిన ఈ సంస్కరణను వారి భవిష్యత్ కు మంచి మార్గంగా ప్రవీణ్ ప్రకాష్ అభివర్ణించారు.



Comments