ఏపీ ఈఏపీసెట్(EAPCET) ఎంట్రన్స్ పరీక్షల సమర్థ నిర్వహణకు సర్వం సిద్ధం.


విజయవాడ (ప్రజా అమరావతి);

ఏపీ ఈఏపీసెట్(EAPCET) ఎంట్రన్స్ పరీక్షల సమర్థ నిర్వహణకు సర్వం సిద్ధం


నేటి నుండి (16.05.2024) 23 వరకు ఈఏపీసెట్-2024 ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ

నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

49 రీజనల్ సెంటర్స్ లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

హైదరాబాద్ లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

నంద్యాలలో 2 పరీక్ష కేంద్రాలు మార్పు

పరీక్ష హాల్ లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు నిషిద్ధం

ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 మంది దరఖాస్తు

దరఖాస్తు చేసుకున్న వారిలో బాలురు 1,80,104, బాలికలు 1,81,536 మంది

ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13 నుండి నిర్వహించాల్సిన ఎంట్రన్స్ పరీక్షలు ఈ నెల 16 నుండి 23 వరకు నిర్వహణ

ఉదయం 9- 12, మధ్యాహ్నం 2.30 - 5.30  వరకు రెండు సెషన్స్ లో పరీక్షల నిర్వహణ 

- ప్రొఫెసర్ కె. హేమచంద్రా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ 

             ఏపీ ఈఏపీసెట్-2024  ఎంట్రన్స్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రా రెడ్డి అన్నారు. బుధవారం మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఏపీ ఈఏపీసెట్-2024  కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె. హేమచంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 49 రిజనల్ సెంటర్ల పరిధిలో ఎంపిక చేసిన 142 సెంటర్లలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024(ఈఏపీసెట్) పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 (బాలురు 1,80,104-బాలికలు1,81,536)మంది అభ్యర్థులు  ఏపీ ఈఏపీసెట్-2024  కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 22,901 మంది ఎంట్రన్స్ పరీక్షకు అధికంగా దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. విద్యార్థుల సౌలభ్యం కోసం తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ లో కూడా రెండు సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13నుండి నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలు ఈ నెల 16 నుండి 23 వరకు రోజుకు రెండు సెషన్స్ లో  ఎంట్రన్స్ పరీక్షలు ఆన్ లైన్  బేస్డ్ (కంప్యూటర్ ద్వారా) పద్దతిలో నిర్వహిస్తున్నామన్నారు. బైపీసీ విద్యార్థులకు ఈ నెల 16,17 తేదీల్లో 4 సెషన్స్ లో, ఎంపీసీ విద్యార్థులకు ఈ నెల 18 నుండి 23 వరకు 9 సెషన్స్ లో నిర్వహిస్తున్నామని వివరించారు. రోజుకు రెండు సెషన్స్ లో నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఉదయం 9 నుండి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గతేడాది మధ్యాహ్నం సెషన్ 3 నుండి 6 గంటల వరకు ఉండేదని ఈ ఏడాది అరగంట ముందుగా అనగా మధ్యాహ్నం 2.30 గంటల నుండి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంట్రన్స్ పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి హాల్ టికెట్ వెనుక భాగంలో సెంటర్ రూట్ మ్యాప్ ను ముద్రించడం కూడా జరిగిందన్నారు. 

  నిమిషం ఆలస్యమైనా అనుమతించం : 

       ఏపీ ఈఏపీసెట్ -2024 ఎంట్రన్స్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని, విద్యార్థులు ఈ విషయం గమనించాలని కోరారు. కావున పరీక్షా కేంద్రం వద్దకు అభ్యర్థులు కనీసం గంట ముందు చేరుకోవాలని సూచించారు. పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్, బ్లూ టూత్, కాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.  పరీక్షా కేంద్రాల వద్ద ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఇప్పటికే మాట్లాడటం జరిగిందని, అలాగే ఆర్టీసీ అధికారులతో చర్చించి సెంటర్ల వద్దకు బస్సులు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అంతే కాకుండా ప్రతి కేంద్రం వద్ద ప్రాథమిక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలని అన్ని జిల్లాల డిఎంహెచ్వోలకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం జరగకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడామన్నారు. ఒకవేళ విద్యుత్ అంతరాయం జరిగితే జనరేటర్ లు అందుబాటులో ఉంచామన్నారు.  

నంద్యాల లో రెండు సెంటర్ల మార్పు : నంద్యాల పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసకున్న విద్యార్థులు తమకు కేటాయించిన సెంటర్ల మార్పును గమనించాలని కె. హేమచంద్రారెడ్డి కోరారు. ఎన్నికల ఈవీఎంల స్ట్రాంగ్ రూంలుగా ఆర్జీఎంఐటీ, శాంతారామ్ ఇంజనీరింగ్ కాలేజీలను నంద్యాల కలెక్టర్ గుర్తించటం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా సెంటర్ అభ్యర్థుల కోసం  శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజీ, శ్రీ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, ఎస్ వి ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ (3 సెంటర్లను) కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంబంధిత సెంటర్ అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించాలని, తమ వంతుగా ఆయా సెంటర్ల మార్పు పై ఈమెయిల్, ఫోన్,  ఎస్ ఎం ఎస్ ల ద్వారా సమాచారం అందించామన్నారు. నంద్యాల లో సెంటర్లు ఎంచుకున్న అభ్యర్థులు మరోసారి తమ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ (08842359599, 08842342499) ఏర్పాటు చేశామని హేమచంద్రా రెడ్డి చెప్పారు. 

                   కార్యక్రమంలో జెన్టీయుకే వైస్ ఛాన్సలర్ ప్రొ. జివిఆర్ ప్రసాద రాజు, ఏపీఎస్‌సిహెచ్ఈ వైస్ ఛైర్మన్ కె. రామ మోహన రావు, ఏపీఎస్‌సిహెచ్ఈ వైస్ ఛైర్ పర్సన్ పి. ఉమామహేశ్వరీదేవి, ఏపీఎస్‌సిహెచ్ఈ సెక్రటరీ వై. నజీర్ అహ్మద్, ఏపీఎస్‌సిహెచ్ఈ ప్రత్యేక అధికారి ఎం. సుధీర్ రెడ్డి, ఏపీఎస్‌సిహెచ్ఈ అసిస్టెంట్ ప్రత్యేక అధికారి జి. మాధవి, ఏపీఎస్‌సిహెచ్ఈ అకడమిక్ అధికారి ఎస్. చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments