విజయవాడ (ప్రజాఅమరావతి); జాన్,19: అనంతపురం జిల్లా నీటి సమస్య పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ వృధా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా కేటాయింపులు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ----------------------------- హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అనంతపురం జిల్లా ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా సమగ్రమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో శుక్రవారం నాడు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలతో కలిసి జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పలు కారణాల వల్ల అందుబాటులోని నీటి వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని అన్నారు. ఈ పరిస్థితులను అధిగమించి, నీటి కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై ఒక సమగ్రమైన కార్యాచరణ ను రూపొందించి అమలు చేయాలని అన్నారు. ఈ కార్యాచరణ రూపకల్పనలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించాలని స్పష్టం చేశారు. ఈ నివేదికను పది రోజుల్లో రూపొందించాలని, వచ్చే నెల మొదటి వారంలో దీని అమలుపై రాష్ట్ర స్థాయిలో మరో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని నీటి వనరులు, వాటి ద్వారా జరుగుతున్న నీటి వినియోగం తదితర అంశాలపై మంత్రి అనిల్ కుమార్ వివరిచారు. అనంతపురం జిల్లాలో పెండింగ్ లో ఉన్న, ఇప్పటికే కొనసాగుతున్న పనులపై కూడా సమావేశంలో సమీక్షించారు. ప్రధానంగా హంద్రీనీవా ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులు పూర్తి కాకపోవడంతో, గతంలో గణనీయంగా నీరు వృధా అయ్యిందని, దీనిని సరిదిద్ధడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా నివేదిక రూపొందించాలలని ఆయన ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. పై నుంచి వస్తున్ననీటిని, అన్ని ప్రాంతాల అవసరాలకు అందేలా చూస్తూ కార్యాచరణను తయారు చేయాలన్నారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సి. నారాయణ రెడ్డి, చీఫ్ ఇంజనీరు ఎం. నారాయణ స్వామి ఎస్ఇ లు .వెంకటరమణ, ఎన్.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Comments