పశుపోషకులకు 50 శాతం రాయితీపై పశుదాణా పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం ...


 పశుపోషకులకు 50 శాతం రాయితీపై పశుదాణా పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం ... 

మొదటిసారిగా 20  శాతం ప్రోటీన్ కలిగిన దాణా పంపిణీ 

నాణ్యతే ప్రధాన ఉద్దేశ్యంగా పొడి దాణాకు బదులుగా బలపాల దాణా పంపిణీ   

 అమరావతి (ప్రజా అమరావతి);

       ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పశుపోషకులను ఆర్ధికంగా ఆదుకోవడానికి మరియు వారికి అననుకూల వాతావరణ పరిస్థుతలలో ఆర్ధిక భరోసాను కల్పించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వేసవిలో పశుగ్రాసల కొరతను అధిగమించి, నిలకడగా పశూత్పత్తుల పొందడానికి మరియు పశువుల అమ్మకాలను నిరోదించడానికి 50 శాతం రాయితీపై పశుపోషకులకు సమీకృత దాణాను అందించాలని నిర్ణయించడం జరిగినది.

ఇందులో బాగంగా రాష్ట్రంలోని పశుపోషకులకు రైతు సేవా కేంద్రాలు / పశువైద్యశాలల  ద్వారా 50 శాతం రాయితీతో 20 శాతం ప్రోటీన్ కలిగిన నాణ్యమైన దాణాను పంపిణీ చేయడానికి పశుసంవర్ధక శాఖ, ఆంధ్రప్రదేశ్ వారు చర్యలు చేపట్టడం జరిగినది. రాష్ట్రంలో  మొదటి సారిగా పొడి దాణా కాకుండా బలపాల పశువుల దాణాను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. బలపాల దాణా నాణ్యమైనదే కాకుండా పశువులు అర్రోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ దాణా వలన ప్రభుత్వం మీద అదనపు భారం పడుతున్నా రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం అదనపు నిధులను ఈ కార్యక్రమానికి కేటాయించింది.

దారిద్య్రరేఖకు దిగువున ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన పశుపోషకుల కుటుంబాలకు, ఒక కుటుంబానికి గరిష్టంగా రెండు పెద్ద పశువులకు మరియు పడ్డ దూడకు 90 రోజులకు గాను విడతల వారిగా 450 కిలోల పశుదాణాను రాయితీపై అందించడం జరుగుతుంది. ఇప్పటికే దీనికి కాలసిన దాణా సరఫరా కొరకు అధీకృత  సంస్థలకు అనుమతులు మంజూరుచేయడం జరిగినది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీకృత సంస్థల నుండి ఈ దాణా కిలో ₹22.21/- కొనుగోలు చేసి 50 శాతం రాయితీపై అనగా ₹11.10/- లకు పశుపోషకులకు పంపిణీ చేయడం జరుగుతోంది. అనగా 50 కిలోల పరిమాణం గల పశు దాణా సంచిని రూ.1100/- లకు కొనుగోలు చేసి రూ.555/- లకు మాత్రమే పశుపోషకులకు రైతు సేవా కేంద్రాల ద్వారా గాని లేదా పశువైద్యశాలలో గాని అందించడం జరుగుతోంది.

ఈ వేసవి కాలానికి మన ప్రభుత్వం మన రాష్ట్రంలో గల సుమారు 21 లక్షల పశుపోషకులకు రూ. 69.00 కోట్ల వ్యయంతో 31067 మెట్రిక్ టన్నుల పశు దాణాను పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలుచేయడానికి పశుపోషకులకు ఆన్ లైన్ విధానంలో కూడా చెల్లింపులు  చేయడానికి వీలుకల్పించింది.

  కనుక రాష్ట్రంలోని అర్హత కలిగిన పశుపోషకులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, వేసవిలో కూడా మేలైన పశుయాజమాన్యం జరిపి సుస్థిర ఆదాయం పొందవలసినదిగా పశుసంవర్ధకశాఖ సంచాలకులు, డా. టి. దామోదర నాయుడు   ఒక ప్రకటనలో పశుపోషకులను కోరారు.

                                   

Comments