ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పేర్కొన్నారు.

 నెల్లూరు డిసెంబర్ 27 (ప్రజా అమరావతి):-

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పేర్కొన్నారు.మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని వారి క్యాంపు కార్యాలయం నుండి నవరత్నాలు -ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మంది లబ్ధిదారులకు 590.91 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.


వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా లోని నెల్లూరు నగరం కలెక్టరేట్ తిక్కన ప్రాంగణం నుండి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు తో కలసి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా లబ్ధిదారులకు వారు 16. 73 కోట్ల రూపాయల విలువచేసే నవరత్న పథకాల మెగా బ్యాంక్ చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. అలాగే పింఛన్ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు తదితర  నవరత్న పథకాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు


అంతేకాకుండా 17 మంది రైతులకు సంబంధించి 5,59,188 రూపాయల వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా  మెగా చెక్కును వారు రైతులకు అందజేశారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి కుల మత వర్గ పార్టీలకతీతంగా అందరికీ అందజేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు


ఇంకనూ అర్హత కలిగి నవరత్న పథకాలు పొందని మిగిలిన అర్హులకు వివిధ పథకాల కింద ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిని అందించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.


జిల్లాలో ప్రతిష్టాత్మక పథకాలైన పింఛన్లు 12332 మందికి, బియ్యం కార్డులు 3183 మందికి, ఆరోగ్యశ్రీ కార్డులు 1231 మందికి కొత్తగా మంజూరు చేయడం జరిగిందన్నారు.


ఇతర నవరత్నాల పథకాల కింద 11,353 మందికి 16.73 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.


అలాగే వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 17 మంది రైతులకు 5,59,188 రూపాయల మెగా చెక్కును అందజేయడం జరిగిందన్నారు.


జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ అర్హులై ఉండి పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ కొత్తగా జిల్లాలో 12,332 పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.


ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఈ నాలుగు ప్రాధాన్యత పథకాలు  ప్రతి ఒక్క లబ్ధిదారునికి గ్రామస్థాయిలో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సంతృప్త స్థాయిలో ఎప్పటికప్పుడు మంజూరు అవుతూ వస్తున్నాయన్నారు.


నవరత్నాలు పథకాలన్నీ కూడా లబ్ధిదారులకు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు అందుబాటులో ఉంటూ పథకాలన్నిటికీ సంబంధించి అక్కడే దరఖాస్తు తీసుకుని పరిశీలించి మంజూరు చేయడం మరల సామాజిక తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.


గ్రామస్థాయిలోనే ఏదైనా సాంకేతిక కారణాల చేత కొన్ని అభ్యర్థనలు స్పందన కార్యక్రమానికి రావడం జరుగుతుందన్నారు.


ద్వై వార్షిక మంజూరు ద్వారా గడచిన ఆరు నెలల్లో అర్హత ఉండి పొందని వారికి ఎంతో ఊరట ఇస్తుందన్నారు.


అన్ని రకాల కార్యాలయాలకు వెళ్లకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకే చోటనే ఈ పథకాలన్ని అందుబాటులోకి వచ్చాయన్నారు.


వాలంటీర్లు పింఛన్దారుల ఇంటికే నేరుగా వెళ్లి వారికి పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ వ్యవస్థ వలన ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు.


ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే సచివాలయాల్లోనే ఆ విషయం ప్రస్తావిస్తే  నిర్ణీత గడువులో గానే పరిష్కరిస్తారన్నారు.


జిల్లా వ్యాప్తంగా స్పందన అర్జీలు  గడువు మించకుండా సకాలంలో పరిష్కరిస్తున్నామన్నారు.


జిల్లాలో అత్యధికంగా జనాభా ఉండడంతో అత్యధిక మంజూరులు జిల్లాకు రావడం గర్వకారణం అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.


జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పేదలందరికీ ప్రభుత్వ పథకాలు మంజూరయ్యేందుకు కృషి చేశారన్నారు.


ఇటీవల మాండోస్ తుఫాను వలన దెబ్బతిన్న రైతులు విత్తనాలు, యూరియా కావాలని కోరుతున్నారని జిల్లా వ్యాప్తంగా కావలసినంత మేరకు నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతు భరోసా కేంద్రాల ద్వారా వాటిని పంపిణీ చేస్తున్నామన్నారు.


ప్రతిచోట 80 శాతం సబ్సిడీతో విత్తనాలను రైతులకు అందజేస్తున్నమన్నారు.


ఇన్పుట్ సబ్సిడీ అంచనాలు తయారీ పూర్తయిందని ప్రస్తుతం సామాజిక తనిఖీ కోసం రైతు భరోసా కేంద్రాలలో వివరాలు ప్రదర్శించామని ఈనెల 29వ తేదీ వరకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరిస్తామన్నారు.


రైతులు ఈ విషయం గమనించి వారికి సంబంధించిన పంట వివరాలు సరిగా నమోదయ్యాయా లేదా గమనించుకోవాలన్నారు.


పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఇన్పుట్ సబ్సిడీ తప్పక వస్తుందన్నారు. సబ్సిడీ విత్తనాలు, యూరియాపై  రైతులు ఎటువంటి అపోహలు గాని అనుమానాలు గాని పెట్టుకోరాదన్నారు.


రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఈ విషయమై సమీక్షిస్తున్నారని తుఫాను వలన దెబ్బతిన్న ప్రతి రైతును ఆదుకుంటామన్నారు.


కొత్తగా మంజూరైన పథకాల వివరాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచామన్నారు.

నోటీసులు అందుకున్న పింఛన్దారులు ఆందోళన చెందవద్దని ఎవరికి పించను తీసివేయబడదన్నారు.  వారికి సంబంధించిన అర్హతలు తెలిపే ఆధార పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లకు అందజేయాలన్నారు.


వాటిని సంబంధిత ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చే మూడు రోజులు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తారన్నారు.


ఈ కార్యక్రమంలో బొందిలి కార్పోరేషన్ చైర్మన్ శ్రీ కిషోర్ సింగ్, డి ఆర్ డి ఏ పిడి శ్రీ సాంబశివరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు, డిటిసి శ్రీ బి చందర్, డిఎస్ఓ శ్రీ వెంకటేశ్వర్లు, డీఈవో శ్రీ సుబ్బారావు, జిల్లాఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి శ్రీ వెంకటయ్య, చేనేత జౌళి శాఖ ఏడి శ్రీ ఆనంద్ కుమార్ పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. 

Comments