చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాకుంభాభిషేక కార్యక్రమాలు ప్రారంభం

  తిరుపతి, 13  మార్చి  (ప్రజా అమరావతి);


చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాకుంభాభిషేక కార్యక్రమాలు ప్రారంభం


- మార్చి 17న మహాకుంభాభిషేకం


      చెన్నై నగరంలోని జిఎన్ చెట్టి వీధిలో టిటిడి నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాకుంభాభిషేకం కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మార్చి 17వ తేదీన మహాకుంభాభిషేకం, ప్రాణప్రతిష్ట జరుగనుంది. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.


         ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం విష్వక్సేనారాధన, మృత్సంగ్రహణం, అంకురార్పణతో మహాకుంభాభిషేకం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. తొలిరోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాస్తు హోమం, పర్యాగ్నికరణం, అగ్నిమథనం, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట,  మూర్తి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు చతుష్టానార్చన మూర్తి హోమం, ప్రాయశ్చిత్తం, పూర్ణాహుతి, విమానాధివసం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు.


        ఈ కార్యక్రమంలో చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వెంకటేశ్వర్లు, ఇఇ శ్రీ  మనోహరం, విజిఓ శ్రీ మనోహర్, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments