ప్రణాళిక ప్రకారము విధ్యాబోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు


ప్రణాళిక ప్రకారము విధ్యాబోధనతో  ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు


10వ తరగతిలో 570 మార్కులు పైబడి సాధించిన 63 మంది విధ్యార్ధులు

పిల్లల ఆలోచన, నిర్ణయాలకు విలువనివ్వాలి

                                 - జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున

విశాఖపట్నం, మే 12 (ప్రజా అమరావతి): ప్రణాళిక ప్రకారము పాఠశాలల్లో విద్యాభోదన చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక విఎమ్ఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో 570 పైగా మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్ధినీ, విద్యార్థులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయలకు మరియు తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చెసిన సభలో  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 63 మంది విద్యార్థులు 570 పైగా మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో జిల్లాను 3వ స్ధానంలో ఉంచినందుకు అభినందనీయం అన్నారు. ఉపాధ్యాయులు ప్రణాళికతో బోధన చేసి ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. గత ఏడాది విశాఖ జిల్లా 5వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది మూడో స్థానానికి చేరడం అభినందనీయమన్నారు. పదవ తరగతి తర్వాత ఉన్నత విద్యాభ్యాసం, లక్ష్య సాధనపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలంటే ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ప్రణాళికతో చదవాలన్నారు. మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అలాగే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కూడా కలెక్టర్ అభినందించారు. విద్యార్ధులు మంచి ఫలితాల సాధనలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం అన్నారు.  నిరుపేద విద్యార్ధులు కూడా ఉన్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యావ్యవస్ధలో తీసుకువచ్చే మార్పులు గొప్ప ఫలితాలు తీసుకువస్తున్నాయన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతోందన్నారు. పాస్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించి పత్యేక శ్రద్ద వహించి, ప్రణాళికలు సిద్ధం చెసి, వచ్చే విద్యాసంవత్సరం నాటికి 100 శాతం పాస్ పర్సెంటేజ్ నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. సరైన మౌళిక వసతులు, అనుకూలమైన వాతావరణం కల్పించడం వల్ల విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని, అవసరమైన పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చుటకు 50వేల రూపాయలు కేటాయిస్తామని తెలిపారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని డిఈఓ ను ఆదేశించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్దులు అందరూ ఉత్తమ ప్రతిభ కనబరిచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 

100 రోజుల ప్రణాళికను అమలు చేశాం :     డీఈవో  చంద్రకళ

  జిల్లా విద్యాశాఖ అధికారిణి చంద్రకళ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయడం ద్వారానే ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చాయన్నారు. కార్పొరెట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు సాధించిన అత్యధిక మార్కులు శుభపరిణామం అన్నారు.


ముఖ్యమంత్రికి కృతజ్జతలు...: ఇ. రేవతి, ఆనందపురం కేజీబీవీ పాఠశాల

ఆనందపురం కెజిబివి పాఠశాలలో చదువుతున్న ఇ.రేవతి మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో తనకు 600 గాను 585 మార్కులు వచ్చినట్లు తెలిపారు.  ప్రభుత్వ ప్రవేశ పెట్టిన నాడు-నేడు, అమ్మఒడి పథకాల ద్వారా స్కూళ్లలో కల్పించిన వసతులు, విద్యాభోదనతోనే మంచి మార్కులు వచ్చాయంటూ ముఖ్యమంత్రికి  కృతజ్ఞతలు తెలిపారు. 


ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే..:  పి. మణికంఠ, మల్కాపురం జీవీఎంసీ హైస్కూల్.

మల్కాపురం జివియంసి హైస్కూల్ లో చదువుతున్న పి.మణికంఠ మాట్లాడుతూ  పదవ తరగతి ఫలితాల్లో 600 గాను 592 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల విద్యాభోదన, తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్లే తనకు ఇటువంటి మార్కులు వచ్చాయన్నారు.  

తదుపరి జిల్లా కలక్టరు ఉత్తమ ఫలితాలు సాధించిన విధ్యార్ధులతో సహపంక్తి భోజనం చేశారు. 

ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ కార్డినేటర్ శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రమణమూర్తి, బిసి వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీదేవి, డైట్ ప్రిన్సిపాల్ మాణిక్యం నాయుడు, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ వి.మణిరామ్, జిల్లా లేబర్ 

అధికారి సునీత, డిఎస్ఓ సూర్యప్రకాష్ రావు, ప్రధానోపాద్యాయులు మండల విద్యాశాఖాధికారులు, విద్యార్ధులు, తల్లిదండ్రలు పాల్గొన్నారు. 


Comments