అభివృద్ధి పనులు తనిఖీ చేసిన కలెక్టర్.



*అభివృద్ధి పనులు తనిఖీ చేసిన కలెక్టర్


*


గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం), మే 26 (ప్రజా అమరావతి): జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గుమ్మలక్ష్మీపురం మండలంలో శుక్ర వారం విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. రేగిడి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి, నాడు నేడు పనులు, గృహ నిర్మాణం పనులు తనిఖీ చేసిన కలెక్టర్, మేదరగండ గ్రామంలో నాడు నేడు పనులు తనిఖీ చేశారు. రేగిడిలో నాడు నేడు పనులకు రూ.15.93 లక్షలు, మేదరగండలో రూ11.97 లక్షలు మంజూరు అయింది. నాడు నేడు పనులు వేగవంతం చేసి బడులు ప్రారంభం అయ్యే నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ పడరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మంజూరు చేసిందని అంతే ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలలు ఆహ్లాదంగా తయారుకావడం, విద్యార్థులు మంచి వాతావరణంలో చదువుకోవడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించారు. అన్ని మందులు, ముఖ్యంగా అత్యవసర మందులు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. వైద్యం కోసం వచ్చే వారికి మంచి వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. వైద్యం కోసం ఎక్కువగా గిరిజనులు వస్తారని, వారితో మమేకమై వైద్యం అందించాలని అన్నారు. ఫ్యామిలీ డాక్టరు వైద్య సేవలు గ్రామాల్లో పక్కాగా నిర్వహించాలని, కదల లేని స్థితిలో ఉన్న వారిని ఇంటివద్దనే కలిసి వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో ఆహారం, రికార్డులు, చిన్నారులకు బోధనా తీరును పరిశీలించారు. చిన్నారులతో  రైమ్స్ చెప్పించారు. జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులకు మంచి ఆహారం అందించాలని, తద్వారా పౌష్ఠికాహారం అంది వారి బంగారు భవితకు బాటలు పడతాయని అన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ సక్రమంగా ఉండాలని అన్నారు. గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. గృహ నిర్మాణంపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. నిర్మాణ సామగ్రి అందించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు వేగవంతం చేసి జిల్లాను ఆదర్శంగా నిలపాలని ఆయన చెప్పారు.


ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments