వచ్చే విద్యా సంవత్సరంలో సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయాలి.విజయవాడ (ప్రజా అమరావతి);


*వచ్చే విద్యా సంవత్సరంలో సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయాలి


*

- *ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్ ఆదేశం*


వచ్చే విద్యా సంవత్సరంలో సకాలంలో సిలబస్‌ను పూర్తి చేసి మరింత ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కావలి పర్యటనకు వెళ్లినప్పుడు 5వ తరగతి విద్యార్థిని వర్క్‌బుక్‌ను పరిశీలించి వివరణ కోరగా సిలబస్ లో సగం బోధించలేదని తెలిసిందన్నారు. 


ఈ సందర్భంగా ప్రతి విద్యా సంవత్సరంలో ఆగస్ట్ 15 నుండి జనవరి 15 వరకు ఉండే కాలం విద్యార్థులకు చాలా కీలకమని చెప్పారు. మార్గదర్శకాలను అనుసరించి ప్రతి వారంలో నిర్ధేశించిన సిలబస్ ను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ఉపాధ్యాయులకు సూచించారు. సకాలంలో సిలబస్‌ పూర్తికాకపోతే పరీక్ష సమయంలో విద్యార్థులకు భారంగా మారుతుందన్నారు. ఉపాధ్యాయులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి సకాలంలో సిలబస్ ను పూర్తిచేసేలా దృష్టి పెట్టాలని తెలిపారు.   తద్వారా వారిని మరింత ప్రోత్సహించే దిశగా అడుగులు వేయవచ్చన్నారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయడం ద్వారా విద్యార్థుల పునశ్చరణకు అవకాశం ఉంటుందని, పాఠ్యాంశాలపై పట్టు సాధించి మంచి ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడుతుందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు.


Comments