మండలాల్లో జరిగే స్పందన కార్యక్రమంలో అర్జీలు అందజేయాలి.మచిలీపట్నం మే 29 (ప్రజా అమరావతి);


మండలాల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రానికి రాకుండా మండలాల్లో జరిగే స్పందన కార్యక్రమంలో అర్జీలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు.


సోమవారం ఉదయం  కలెక్టరేట్ లోని స్పందన మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ.కిషోర్ లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.


అర్జీదారుల సమస్యలు, అభ్యర్థనలను  జిల్లా కలెక్టర్ ఎంతో ఓపిగ్గా ఆలకించి,  సంబంధిత అధికారులను పిలిపించి  వివరాలు కోరి  సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చాలామంది ప్రజలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం  అర్జీలు పట్టుకొని నేరుగా జిల్లా కేంద్రానికి వస్తున్నారన్నారు. వారు స్థానికంగా ఆయా మండలాల్లో జరిగే స్పందన కార్యక్రమాల్లో అర్జీలు ఇవ్వకుండా నేరుగా జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుందన్నారు.  ఆ విధంగా వచ్చిన ఆర్జీలను పరిష్కారం కోసం సంబంధిత మండలాల్లోని అధికారులకు  పంపడం జరుగుతోందన్నారు.  అలా కాకుండా ఎక్కడి ప్రజలు అక్కడే వారి సమస్యల పరిష్కారం కోసం మండలాల్లోనే అర్జీలను అందజేయాలన్నారు. దీంతో మండలాల ప్రజలకు వ్యయప్రయాసలు తగ్గుతాయన్నారు.

మండల స్థాయిలో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాకుంటే అటువంటివారు జిల్లా కేంద్రానికి రావాలని కలెక్టర్ తెలిపారు. మండలాల్లో డివిజన్లో ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.


అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


ఈ సందర్భంగా స్వీకరించిన కొన్ని అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి:


👉గూడూరు మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన ఆత్మూరి శివనాగరాజ పంట బోధిని మరల సాగుకు అనుకూలంగా తవ్వించాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు.


👉కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన పప్పుల పాండురంగరావు మునిపూడి, నీలిపూడి మండపల్లి గ్రామ సరిహద్దుల్లో మండపల్లి మీడియం డ్రైన్ కు సంబంధించి హద్దులను మండల సర్వేయర్ ద్వారా సర్వే చేయించి హద్దులు నిర్ణయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు.


👉బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామం ఉమామహేశ్వరపురం నివాసి కరణం రామచంద్ర రావు గ్రామపంచాయతీ చెరువు లో కొందరు పచ్చని చెట్లను జెసిబితో తొలగించి స్వప్రయోజనాలకు వినియోగిస్తున్నారని, ఆ చెరువును అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఫిర్యాదు చేశారు.


కృత్తి వెన్ను మండలం మాట్లం గ్రామ కాపురస్తులు బర్రి సామెరు,  బర్రి నేల బాలుడు, బర్రి గోవిందరాజు తమ తండ్రి నరసింహ స్వామి వీలునామా ప్రకారం 3.02 సెంట్ల స్థలం ఉందని,  గ్రామ విఆర్వో తమ తండ్రి పేరు, తమ పేర్లు తొలగించి రికార్డులు తారుమారు చేశారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.జిల్లాలో వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమవుతున్న ప్రతికూల వార్తల పై ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల జిల్లా అధికారులు వెంటనే స్పందించి వివరణలు ఇవ్వాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 289 ప్రతికూల వార్తలు రాగా అందులో ఇప్పటివరకు 145 వార్తలకు  వివరణలు ఇవ్వడం జరిగిందని ఇంకా 144 పతికూల వార్తలకు వివరణలు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రతికూల వార్త వచ్చినప్పుడు అది  క్షేత్రస్థాయిలో వాస్తవమా కాదా అని పరిశీలించి వాస్తవమైతే లోపాలను సరిదిద్దాలని అందుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో వాస్తవ విషయాలను తెలియజేస్తూ కూడా వివరణ ఇవ్వాలన్నారు.


ఈ సందర్భంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వచ్చే జూన్ మాసం 2 వ తేదీన గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్ మేళా గోడపత్రాన్ని జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్, డీఆర్ఓ, ఆర్డిఓ, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసు ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని ఎస్ఎస్సి, ఇంటర్ ఐటిఐ, డిప్లమా, ఏదేని డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


వచ్చే జూన్ 1 వ  తేదీ నుండి 30వ తేదీ వరకు మాసమంతా మలేరియా వ్యతిరేక మాసంగా పాటించాలని పెద్ద ఎత్తున ప్రజల్లో మలేరియా నివారణ కార్యక్రమాల గురించి విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు.  అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం సహవుగా జరిగేలా చూడాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జ్యోతిబసు, డిఆర్డిఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్, డిపిఓ  నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, డిఎస్ఓ  పార్వతి, డిఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి, ముడ విసి రాజ్యలక్ష్మి, సర్వే భూ రికార్డుల ఏడి గోపాల్ రాజా, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర రావు, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి సరస్వతి, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, డీఈవో తహేరా సుల్తానా, ఐసిడిఎస్ పిడి స్వర్ణ, పౌరసరఫరాల సంస్థ డిఎం శ్రీధర్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారుComments