రాగుల సాగును రెట్టింపు చేయాలి.

 


రాగుల సాగును రెట్టింపు చేయాలి


జులై నుంచి ఫోర్టిఫైడ్ గోధుమ‌పిండి పంపిణీ

ధాన్యం మిల్లులో డ్ర‌య్య‌ర్‌, సిసి కెమేరాలు ఏర్పాటు

గ్యాస్ సిలండ‌ర్ల స‌ర‌ఫ‌రాకు అద‌నంగా వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు

మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, కారుమూరి నాగేశ్వ‌ర్రావు

చిరుధాన్యాల సాగు, ధాన్యం సేక‌ర‌ణ‌పై అధికారుల‌తో స‌మీక్ష‌


విజ‌య‌న‌గ‌రం, జూన్ 27 (ప్రజా అమరావతి) ః

                   రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్స‌హిస్తున్నామ‌ని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖామంత్రి కారుమూరి వెంక‌ట నాగేశ్వ‌ర్రావు అన్నారు.  దీనిలో భాగంగానే రేష‌న్ డిపోల ద్వారా రాగులు, జొన్న‌ల‌ను పంపిణీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి నిర్ణ‌యించారని చెప్పారు.


                   చిరుధాన్యాలు, ధాన్యం సేక‌ర‌ణ‌పై ఉత్త‌రాంధ్ర జిల్లాల జాయింట్ క‌లెక్ట‌ర్లు, పౌర స‌ర‌ఫ‌రాలు, విజిలెన్స్, తూనిక‌లు కొల‌తలు, వ్య‌వ‌సాయ శాఖాధికారుల‌తో, విజ‌య‌న‌గ‌రం క‌లెక్ట‌రేట్‌లో మంగ‌ళ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్ హ‌నుమంతు అరుణ్‌కుమార్‌, పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ‌ ఎండి వీర‌పాండ్య‌న్ మాట్లాడుతూ, చిరుధాన్యాల సాగును ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రాన్ని, ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రించారు.  త‌మ‌త‌మ జిల్లాల్లోని చిరుధాన్యాలు ముఖ్యంగా రాగిపంట‌ సాగు, దాని విస్త‌ర‌ణ‌కు ఉన్న అవ‌కాశాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్లు పిపిటి ద్వారా వివ‌రించారు. పంట విస్త‌ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.

            అన్ని జిల్లాల్లో రాగుల సాగును రెట్టింపు చేయాల‌ని అధికారుల‌ను మంత్రి కారుమూరి ఆదేశించారు. ప్ర‌భుత్వం రాగుల‌కు రూ.3,480 చొప్పున‌ మంచి గిట్టుబాటు ధ‌ర‌ను అందిస్తోంద‌ని, దీనిని రైతులు స‌ద్వినియోగం చేసుకొని, రాగుల‌ను సాగు చేయాల‌ని కోరారు. ఎంత పండిస్తే అంతా కొనుగోలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర అవ‌స‌రాల‌కు త‌గినంత‌గా రాగులు, జొన్న‌లు సాగవ్వ‌డం లేద‌ని, వీటి సాగును గ‌ణ‌నీయంగా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌భ‌లుతున్న షుగ‌ర్‌, బిపి లాంటి జీవ‌న‌శైలి వ్యాధుల నియంత్ర‌ణ‌కు చిరుధాన్యాల వినియోగం చాలా అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.


*వ‌రుణుడు త‌మ‌వెంటే...*

                    ఈ సమావేశంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ఒక‌ప్పుడు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో రాగిపంట సాగు ఎక్కువ‌గా ఉండేద‌ని అన్నారు. సాగునీటి స‌దుపాయాలు పెరిగిన కార‌ణంగా, రాగి స్థానంలో వ‌రి, ఉద్యాన పంట‌ల సాగు పెరిగింద‌ని చెప్పారు. ప్ర‌స్తుత అవ‌స‌రాల రీత్యా రాగి సాగును పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  రైతు శ్ర‌మ‌కు త‌గిన గిట్టుబాటు ధ‌ర‌ను క‌ల్పించి, పూర్తి స‌హ‌కారాన్ని అందించిన‌ప్పుడే రాగుల సాగు పెరుగుతుంద‌ని సూచించారు. ఆ దిశ‌గా అధికారులు యోచ‌న చేసి, రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కోరారు. ఈ విష‌యంలో వ్య‌వ‌సాయాధికారులదే కీల‌క పాత్ర అని అన్నారు. ఏ పంట లాభ‌దాయ‌క‌మో, దానిని ఎంచుకొనే స్వేచ్చ రైతుకు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అతిత‌క్కువ పెట్టుబ‌డితో రాగిని సాగు చేయ‌వ‌చ్చ‌ని, భారీ తుఫానులు వ‌స్తే త‌ప్ప ఈ పంట‌కు న‌ష్టం వాటిల్ల‌ద‌ని అన్నారు. పంట దిగుబ‌డిని పెంచితే, సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంద‌ని సూచించారు.

                   ధాన్యం మిల్లుల్లో సిసి కెమేరాలు, డ్ర‌య్య‌ర్ల ఏర్పాటు కోసం రుణ సౌక‌ర్యాన్ని క‌ల్పించాల‌ని సూచించారు. చెల్లించిన బ్యాంకు గ్యారంటీల‌ను బ‌ట్టి కాకుండా, మిల్లింగ్ చేసే సామ‌ర్ధ్యాన్ని బ‌ట్టే,  రైస్ మిల్లుల‌కు ధాన్యం కేటాయించాల‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. గ‌త ఏడాది జిల్లాలో ధాన్యం దిగుబ‌డి గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని, అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా ఎటువంటి ఇబ్బందీ రాకుండా, ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను చ‌క్క‌గా పూర్తి చేశార‌ని, అధికారుల‌ను మంత్రి అభినందించారు. ఈ ఏడాది కూడా ఎటువంటి స‌మ‌స్యా ఉత్పన్నం కాకుండా, ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని కోరారు. వ‌రుణుడు త‌మ పార్టీలో చేరిపోయాడ‌ని, అందువ‌ల్లే ఈ నాలుగేళ్లూ స‌కాలంలో వ‌ర్షాలు ప‌డి, పంట‌లు బాగా పండుతున్నాయ‌ని బొత్స చ‌మ‌త్క‌రించారు.


*జులై నుంచి గోధుమ‌పిండి పంపిణీ*

                జులై నుంచి రాష్ట్రంలోని అన్ని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కిలో రూ.16 చొప్పున ఫోర్టిఫైడ్ చెక్కి గోధుమ‌పిండిని రేష‌న్ డిపోల ద్వారా పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర్రావు తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లో కూడా గోధుమ పిండిని పంపిణీ చేయ‌డానికి, ముఖ్య‌మంత్రి యోచిస్తున్న‌ట్లు చెప్పారు. పౌర స‌ర‌ఫ‌రాల వ్య‌వ‌స్థ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి వినూత్న‌మైన మార్పుల‌ను తీసుకువ‌చ్చార‌ని చెప్పారు.  ధాన్యం కొనుగోలు వ్య‌వ‌స్థ‌ను పూర్తి పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హిస్తున్నామ‌ని, గ‌త సీజ‌న్‌లో 98 శాతం మందికి డ‌బ్బులు జ‌మ చేశామ‌ని చెప్పారు. గోనె సంచులు, ర‌వాణా ఛార్జీల‌ను కూడా చెల్లించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌తీ ధాన్యం మిల్లులో త‌ప్ప‌నిస‌రిగా డ్ర‌య్య‌రు, సిసి కెమేరాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. దీనివ‌ల్ల రాష్ట్ర‌స్థాయి నుంచే మిల్లుల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌వ‌చ్చ‌ని అన్నారు. వ‌చ్చే సీజ‌నులో మూడు లేదా నాలుగు రోజుల్లోనే ధాన్యం డ‌బ్బులు చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఆన్‌లైన్ ప్ర‌క్రియ‌ ద్వారానే ధాన్యం కొనుగోలు చేయ‌మ‌ని  రైతులు అడుగుతున్నార‌ని, ఇది త‌మ ప్ర‌భుత్వంపై ఉన్న న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. గిరిజ‌నులు పండించే చిరుధాన్యాల‌ను సంత‌ల్లో కూడా సేక‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం కందిప‌ప్పు ల‌భ్య‌త అంత‌గా లేద‌ని, ఆగ‌స్టు నుంచి దీనిని స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. ఎక్క‌డైనా రేష‌న్ స‌రుకుల‌కు అధిక ధ‌ర‌లు వ‌సూలు చేసినా, ఎండియు వాహ‌న‌దారులు అక్ర‌మాల‌కు పాల్ప‌డినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. గ్యాస్ సిలండ‌ర్ ను ఇంటికి స‌ర‌ఫ‌రా చేసేందుకు, తూకంలో మోసాల‌కు పాల్ప‌డినా, అద‌నంగా డ‌బ్బులు వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  ఆదేశించారు. అదే స‌ర్కిల్‌లో స‌ర‌ఫ‌రా చేసే గ్యాస్ సిలండ‌ర్‌కు అద‌న‌పు ఛార్జీల‌ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. గోధుమ పిండి పంపిణీని మంత్రులిద్ద‌రూ ఈ సంద‌ర్భంగా లాంఛ‌నంగా ప్రారంభించారు.

             

                 ఈ స‌మావేశంలో రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్ హ‌నుమంతు అరుణ్‌కుమార్‌, పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ‌ ఎండి వీర‌పాండ్య‌న్‌, విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి, జాయింట్ క‌లెక్ట‌ర్ కె.మ‌యూర్ అశోక్‌, శ్రీ‌కాకుళం జెసి న‌వీన్‌కుమార్‌, అన‌కాల‌ప‌ల్లి జెసి జాన్వీ, ఆరు జిల్లాల పౌర స‌ర‌ఫ‌రాల అధికారులు, ఫౌర స‌ర‌ఫ‌రాల సంస్థ జిల్లా మేనేజ‌ర్లు, విజిలెన్స్‌, తూనిక‌లు కొల‌తలు, వ్య‌వ‌సాయ‌, అనుబంధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.                


Comments