*- రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే*
*- 2024లో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు*
*- ఐక్యంగా ఉంటూ సుస్థిరతను సాధించుకుందాం*
*- ప్రజలు మళ్ళీ స్వర్ణయుగాన్ని చూడబోతున్నారు*
*- చంద్రబాబు నాయకత్వంలో కలిసి నడుద్దాం*
*- ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది*
*- తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము*
గుడివాడ, జూన్ 28 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, 2024 ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎర్నేని సీతాదేవి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో కలిసి వెనిగండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వెనిగండ్ల మాట్లాడుతూ తుమ్మలపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గుప్తుల కాలాన్ని భారతదేశానికి స్వర్ణయుగంగా పిలిచేవారన్నారు. ఆ కాలంలో ప్రజలు శాంతి, సంతోషాలతో జీవించారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి ఎంత కాలం పదవిలో ఉంటారో తెలియని పరిస్థితులు ఉండేవన్నారు. వారానికి ఒక ముఖ్యమంత్రి అన్నట్టుగా ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారన్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ గొడవలు, మత కలహాలు వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో, తెలుగు ప్రజల మద్దతుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. తెలుగు ప్రజలు శాంతి, సంతోషాలతో జీవించేలా మంచి పాలనను మహానుభావుడు ఎన్టీఆర్ అందించారని కొనియాడారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ప్రజలు ఎంతో సంతోషంగా, కలిసిమెలిసి జీవించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో అందరూ కలిసి మెలిసి నడుచుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా అద్భుతమైన ప్రగతిని సాధించుకుందామని తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ఐక్యంగా ఉంటూ శాంతి, సంతోషం, సుస్థిరతను సాధించుకుందామని వెనిగండ్ల చెప్పారు.
addComments
Post a Comment