ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.

 *- ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు


 *- రంగులు వేసిన ఘనత కొడాలి నానికే దక్కుతుంది* 

 *- టిడ్కో లబ్ధిదారులు రుణభారాన్ని మోసే పరిస్థితి లేదు* 

 *- ప్రభుత్వమే భరించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా* 

 *- నేటికీ నిర్మాణ దశలోనే ఉన్న అనేక టిడ్కో గృహాలు* 

 *- కనీసం ఇళ్ళలోకి వెళ్ళే వరకైనా ఈఎంఐల భారం మోపొద్దు*

 *- జాబితా నుండి 1,800 మంది లబ్ధిదారులను తొలగించారు*

 *- వీళ్ళంతా కట్టిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో చెప్పాలి*

 *- వసతులు కల్పించకుండా లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టొద్దు* 

 *- మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల* గుడివాడ, జూన్ 7 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము అన్నారు. బుధవారం గుడివాడలో వెనిగండ్ల మీడియాతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని రూరల్ మండలం మల్లాయపాలెం గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 8,912 టిడ్కో గృహాల నిర్మాణం ప్రారంభమైందన్నారు. ఈ గృహాలను వైసీపీ ప్రభుత్వం కూల్చివేయకుండా ఏదో విధంగా రంగులు వేసి లబ్ధిదారులకు అందజేసే ఏర్పాట్లు చేయడం కొంత వరకు మంచి పరిణామమని అన్నారు. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళి ఉంటే ప్రజలు ఇంకా సంతోషించేవారమన్నారు. చంద్రబాబుకు వచ్చే ఆదరణను చూసో లేక లోకేష్ పాదయాత్ర ప్రభావమో గాని టీడీపీ మంచి కార్యక్రమాలను కొనసాగించడం శుభ సూచికమని తెలిపారు. గుడివాడలో టిడ్కో గృహాల విషయానికొస్తే గత నాలుగేళ్ళుగా పాడుపెట్టి నెల రోజులుగా బాగుచేసి ఇవ్వడం జరుగుతోందన్నారు. టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం బాగా జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. ఇళ్ళు తీసుకున్న లబ్ధిదారులందరూ ఆనందంగా ఉంటారని భావిస్తున్నానన్నారు. గుడివాడలో టిడ్కో గృహాలకు ఎమ్మెల్యే కొడాలి నానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు హయాంలో స్థల సేకరణ జరిగిందని, లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో టిడ్కో ఇళ్ళ నిర్మాణం ప్రారంభమైందన్నారు. ఈ టిడ్కో గృహాలకు రంగులు వేసిన ఘనత మాత్రమే ఎమ్మెల్యే కొడాలి నానికి దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా గుడివాడ గడ్డపై టిడ్కో గృహాల గురించి మాట్లాడిన వీడియోలను మీడియా సమావేశంలో చూపించారు. టిడ్కో గృహాలకు సంబంధించి ఏ మాత్రం చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని, ఒక్క రూపాయికే ఇళ్ళను అందజేస్తానని జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని టిడ్కో లబ్ధిదారులు చెల్లించాల్సిన రుణాన్ని ప్రభుత్వమే భరించేలా చూడాలన్నారు. లబ్ధిదారులు టిడ్కో రుణభారాన్ని చెల్లించే పరిస్థితుల్లో లేరన్నారు. ఇంకా కొన్ని గృహాలు నిర్మాణంలోనే ఉన్నాయన్నారు. ఎంతో మంది లబ్ధిదారులు అద్దె గృహాల్లో ఉంటూ ప్రతి నెలా అద్దెలు చెల్లిస్తున్నారన్నారు. టిడ్కో గృహాలకు పూర్తిస్థాయిలో కనీస మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అప్పగించిన తర్వాత నుండి ఈఎంఐలు వసూలు చేస్తే వెసులుబాటు కల్పించాలన్నారు. దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే ఈ విగ్రహాన్ని ప్రారంభించడం కోసం కనీస వసతులు లేని, అసంతృప్తిగా ఉన్న టిడ్కో గృహాలను ప్రారంభిస్తే ప్రజలు ఇబ్బందుల పాలవుతారన్నారు. టిడ్కో గృహాల దగ్గర డ్రైనేజ్, తాగునీరు, వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయాలు సమకూరాయా లేదా అనే విషయాలను కూడా చూడాలన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన దాదాపు 1,800 మంది లబ్ధిదారులు పేర్లను తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా రూ.50వేలు చొప్పున ప్రభుత్వానికి చెల్లించారని, ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నామన్నారు. అయితే కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండాbలబ్ధిదారులను ఇబ్బందులు పెట్టొద్దని వెనిగండ్ల విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తా చంటి, షేక్ ఇబ్రహీం, ఏసుపాదం, గడ్డం ప్రకాష్ దాస్, సిరిపురపు తులసీరాణి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments