హథీరాం జీ మఠం మహంతుపై చర్యలకు ధార్మిక పరిషత్ నిర్ణయం.

 *హథీరాం జీ మఠం మహంతుపై చర్యలకు ధార్మిక పరిషత్ నిర్ణయం*


*•ఈనెల 6 న అన్నవరం  సత్యనారాయణ  స్వామి దేవాలయం నుండి ధర్మ ప్రచారం ప్రారంభం*

*•శ్రీవాణి ట్రస్టు నిధులతో చేపట్టిన 1917 దేవాలయాల నిర్మాణాలను త్వరలో పూర్తి చేస్తాం*

*•రొటేషన్ పై ఉద్యోగుల విధుల కేటాయింపు సత్ఫలితాలను ఇస్తున్నాయి,ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారు*

*ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*


అమరావతి, ఆగస్టు 1 (ప్రజా అమరావతి): తిరుపతి హథీరాం జీ మఠానికి గతంలో మహంతుగా నున్న  అర్జున్ దాస్ అనే వ్యక్తి పలు అక్రమాలకు పాల్పడినట్లు  త్రి సభ్య కమిటీ పలు ఆధారాలతో ధృవీకరించిన నేపధ్యంలో ఆ మహంతుపై తదుపరి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ధార్మిక పరిషత్ నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.  మంగళవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్  సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ప్రతి వారం మాదిరిగానే నేడు దేవాదాయ, ధర్మాదాయ శాఖ  కార్యకలాపాలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. తిరుపతి హథీరాం జీ మఠానికి  గతంలో మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడినట్లు, మఠం ఆస్తుల్ని లీజులకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు, కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. అయితే ఈ ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి హథీరాంజీ మఠంపై ఎలాంటి హక్కులు లేవని అర్జున్ దాస్ గతం లో కోర్టుకెళ్లారన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర ధార్మిక పరిషత్ ద్వారానే ఆ మహంతుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం  ఉపక్రమించిందన్నారు.  రాష్ట్ర ధార్మిక పరిషత్ ద్వారా హథీరాం జీ మఠం మహంత్ గా ఉన్న అర్జున్ దాస్ ను సస్పెండ్  చేసి ఆ మఠానికి ఒక ఫిట్ పర్సన్ని నియమించడం జరిగిందన్నారు. అయితే అర్జున్ దాస్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని నియమించడం జరిగిందన్నారు. ఈ అంశాన్ని త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి 16 ఆరోపణలను దృవీకరిస్తూ   ఆధారాలతో నివేదికను అందజేయడం జరిగిందన్నారు.  ఈ సమగ్ర నివేదికను రాష్ట్ర ధార్మిక పరిషత్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తదుపరి   అర్జున్ దాస్ పై చర్యలు తీసుకునేందుకు నిర్ణయించండం జరిగిందని ఆయన తెలిపారు. 


*సనాతన హిందూ ధర్మ ప్రచారం  ఈ నెల 6 న అన్నవరం నుండి ప్రారంభం……*

                                                                                                                                                                                        సనాతన హిందూ  ధర్మం యొక్క ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ధర్మ ప్రచార పరిషత్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.  ఈ ధర్మ ప్రచార పరిషత్ ఈ నెల 6 న అన్నవరం సత్యనారాయణ   స్వామి దేవాలయం నుండి  సనాతన హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా అన్నవరం చుట్టుప్రక్కల నున్న దేవాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రవచనాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు  ఆయన తెలిపారు. స్థానిక కళాకారులను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసి వారికి పారితోషకాలు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. 


*శ్రీవాణి ట్రస్టు నిధులతో చేపట్టిన 1,917 దేవాలయాల నిర్మాణాలను త్వరలో పూర్తి చేస్తాం……*

                                                                                                                                                                                          శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ చేపట్టిన 1,917 దేవాలయాలను ఈ ఏడాది నవంబరు మాసానికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. టి.టి.డి. సహకారంతో చేపట్టిన ఈ దేవాలయాల నిర్మాణాల్లో ఇప్పటికే 200 దేవాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయని, 912 వివిద దశల్లో ఉన్నాయని మిగిలిన 798 దేవాలయాల శంకుస్థాపనలను త్వరలో చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇవి కాక మరో 870 దేవాలయాల మంజూరీకై ప్రతిపాదలను టి.టి.డి.కి పంపడం జరిగిందని, త్వరలోనే ఆ దేవాలయాలను అన్నింటినీ మంజూరు చేస్తామని టి.టి.డి. ఎగ్జిక్యూటివ్ అధికారి తెలిపారన్నారు.  ప్రత్యేకించి ఏజన్సీతో పాటు పలు వెనుక బడిన ప్రాంతాల్లో ఈ దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు స్థానిక సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలకు అడ్వాన్సుగా రూ.2.00 లక్షల చొప్పున నిధులను విడుదల చేయడమైందన్నారు. అదే విధంగా ప్రతి 30 దేవాలయాలకు ఒక సహాయక ఇంజనీరును నియమించి నిర్మాణ పనులను వేగవంతం చేయడం జరిగిందన్నారు. నిర్మాణ పనులను ప్రతి 15 రోజులకు ఒక సారి సమీక్షిస్తూ ఆ ప్రగతిని దేవాదాయ, ధర్మాదాయ శాఖ పోర్టల్ డాష్ బోర్డులో ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు .


*రొటేషన్ పై ఉద్యోగుల విధుల కేటాయింపు సత్ఫలితాలను  ఇస్తున్నాయి, ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారు……*


భక్తులతో మర్యాదగా ప్రవర్తిసూ వారికి మంచి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో దేవాలయాల్లో పనిచేసే డిప్యూటీ ఇ.ఓ., అసిస్టెంట్ ఇ.ఓ., సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు ఒకే సెక్షన్ లో పనిచేయ కుండా మూడు మాసాలకు ఒక సారి రొటేషన్ పద్దతిపై మార్చే విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.  ఈ విదానం వల్ల ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి కూడా పోయిందని, వారంతా ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు.  ఈ రొటేషన్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేయడం జరుగుచున్నదని, ఆ వివరాలు అన్ని డాష్ బోర్డులో ఉంచడం జరుగుచున్నదన్నారు. Comments