ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమవ్వాలి.*ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమవ్వాలి* 


ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి డా. కె.ఎస్.జవహార్ రెడ్డి .

‘పాఠశాలలోని విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన ఫలితాలు సాధించడం’ అంశంపై ఒక రోజు కార్యశాల


అమరావతి (ప్రజా అమరావతి);

విద్యార్థుల నమోదు పెంచడం, అంతేవేగంగా విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా. కె.ఎస్.జవహార్ రెడ్డి  అన్నారు. గురువారం విజయవాడలోని ఓ హోటల్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ‘పాఠశాలలోని విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన ఫలితాలు సాధించడం’ అంశంపై జరిగిన ఒక రోజు కార్యశాలకు చీఫ్ సెక్రటరీ డా. కె.ఎస్.జవహార్ రెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘ఆయన కూడా ఉపాధ్యాయ కుటుంబం నుండి వచ్చానని, ఉపాధ్యాయుల సాధకబాధకాలన్నీ తెలుసనీ’ జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఉపాధ్యాయులు గ్రామాల్లో తల్లిదండ్రులతో మమేకమై సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.

ఉపాధ్యాయుల్లో చిత్తశుద్ధి, పట్టుదల, నిరంతర కృషి ఉంటే తప్పకుండా మెరుగైన సమాజాన్ని నిర్మించగలుగుతామన్నారు. ‘విదేశీ విద్యా దీవెన’ పథకం ద్వారా ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో విద్యను అభ్యసించడం విద్యార్థులకు సువర్ణావకాశం అన్నారు. విద్యా విధానంలో అవకాశాలు అందిస్తే విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారన్నారు.

వృత్తిపరమైన సమస్యలను ప్రస్తావించే ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే విద్యను బలోపేతం చేయడంలో కీలకభూమిక పోషిస్తాయన్నారు. ఉపాధ్యాయ సంఘాలు విషయాధిరతంగా (అంటే గణితం, సైన్స్, భాషలకు) ఏర్పడి విద్యార్థుల్లో సదరు పాఠ్యంశాల పట్ల విద్యార్థులకు మరింత సులువుగా అవగతమయ్యే సూచనలు, సలహాలు పాలుపంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. 

బడి బయట పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత మనందరిపైనా ఉందని గుర్తు చేశారు.  బడికి రాని ప్రతి పిల్లాడి వెనక ఒక కారణం ఉంటుందని, వారి తల్లిదండ్రులతో మాట్లాడితే దానికి పరిష్కారం లభిస్తుందని, తద్వారా విద్యార్థులను పాఠశాలలకు తీసుకురావొచ్చని, ఆ దిశగా ఉపాధ్యాయులు తమ దృక్ఫథాలను సవరించుకోవాలని కోరారు. పిల్లలకు మాంటిస్సోరి విధానంలో బోధిస్తే ఆహ్లాదకరంగా నేర్చుకుంటారన్నారు.  ఈ విధానంలో పిల్లలు స్వేచ్ఛగా శారీరక, మానసిక సంసిద్ధతతో నేర్చుకోవడం జరుగుతుందన్నారు.  మూస విధానంలో బోధనను మార్పు చేసుకోవాలని, టెక్నాలజీని అనుసంధానించుకుని అర్థవంతమైన బోధనను అందించాలన్నారు. పాఠశాలలు ఇంటి వాతావరణాన్ని తలపించేలా మౌలిక సదుపాయాలతో మెరుగుపడ్డాయన్నారు. 

అనంతరం పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్  మాట్లాడుతూ...  రెమిడియల్ టీచింగును ప్రవేశ పెట్టడంలో సీఎస్ డా. కె.ఎస్.జవహార్ రెడ్డి  పాత్ర అమోఘమని, ఆయన ప్రసంగంలోనిన సందేశాన్ని రాష్ట్రంలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చేరుస్తామన్నారు. దేశంలోనే గొప్ప క్రీడాకారులు మన రాష్ట్రం నుంచి ఉండటం గర్వకారణమన్నారు.

విద్యావిధానంలో అనేక సంస్కరణలకు నాందిగా ఆంధ్ర్రప్రదేశ్ నిలిచిందని పాఠశాల విద్యాశాఖ కమీషనర్  ఎస్.సురేష్ కుమార్  అన్నారు. డిజిటల్ రంగంలోనూ, సుపరిపాలనలోనూ, పారదర్శకతలోనూ అగ్రగామిగా కొనసాగుతున్నామని గుర్తు చేశారు. మూడో తరగతి నుండి సబ్జెక్టు టీచర్లను నియమించడం, బైలింగువల్ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టడం చరిత్రలో మైలురాయిని అన్నారు. ప్రభుత్వం విద్య కోసం అనేక సదుపాయాలు, సహాయ సహకారాలు అన్ని విధాల అందజేయడం విద్యార్థులకు గొప్ప వరమని అన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్ లు పంపిణీ, ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెళ్లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయడం వంటివి జరుగుతున్నాయని అన్నారు.

తర్వాత మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ డా. నిధి మీన  మాట్లాడుతూ.. మంచి పోషకాహారం పిల్లలకు మెనూ ప్రకారం అందజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.  చాలా పాఠశాలల్లో వీటిపై ఆసక్తిని పెంపొందించి వాటి ఆవశ్యకతను విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్నభోజన పథక యాప్ ను ఉపయోగించి ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. బిల్లలు సకాలంలో అందజేయాలంటే ఉపాధ్యాయులు క్రమానుసారంగా నమోదు ప్రక్రియను కొనసాగించాలన్నారు.

ఈ కార్యక్రమానికి సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ . బి.శ్రీనివాసరావు  అతిథులను ఆహ్వానించారు.  ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి , స్యీమాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య , ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి , తదితర రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఆర్జేడీలు, డీఈవోలు, ఏపీసీలు, జాతీయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు, వివిధ విద్యా సంబంధిత సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, సబ్జెక్టు టీచర్లు తదితరులు పాల్గొన్నారు. Comments