ఆలయాల అప్ గ్రేడేషన్ ప్రతిపాదనలు త్వరలో కేబినెట్ కు.

 *ఆలయాల అప్ గ్రేడేషన్ ప్రతిపాదనలు త్వరలో కేబినెట్ కు*


*•దేవాదాయ భూముల జాబితాలో చేర్చిన ప్రైవేటు భూములకు ఎన్.ఓ.సి.లు జారీ*

*•అన్ని దేవాలయాల్లో బయోమెట్రిక్ స్థానే ఏపిఎఫ్ఆర్ఎస్ విధానం అమలు*

*•పారదర్శకంగా టెండర్ల ఖరారుకు టెండర్ కమిటీ త్వరలో ఏర్పాటు*

*ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*


అమరావతి, అక్టోబరు 10 (ప్రజా అమరావతి): ప్రస్తుత ఆదాయాలకు అనుగుణంగా  రాష్ట్రంలోని దేవాలయాల అప్ గ్రేడేషన్ కు సంబందించిన  ప్రతిపాదనలు కేబినెట్ ఆమోదం పొందే దిశగా సమగ్రంగా రూపొందించడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్  సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ  ఆలయాల వర్గీకరణ నేపథ్యంలో దాదాపు 14 మంది అసిస్టెంట్ కమిషనర్లకు  డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతి కల్పించే అవకాశం కలిగిందన్నారు. నాలుగు అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు కూడా ఖాళీ అవుతున్నాయని, ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు వచ్చే సోమవారం ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కోర్టులో ఉన్న కేసులను ఉద్యోగులు ఉప సంహరించుకున్నట్లైతే, అర్హత, సీనియారిటీ ప్రకారం  పదోన్నతి ద్వారా ఆయా పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం డిప్యూటీ కమిషనర్ స్థాయి దేవాలయంగా అప్ గ్రేడ్ అవుతున్న నేపథ్యంలో ఆ దేవాలయంలో ఉన్న సిబ్బంది కొరత సమస్య కూడా త్వరలోనే సమసిపోతుందని, భక్తుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలను కూడా కల్పించడం జరుగుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 


ప్రతి జిల్లాలోనూ దేవాలయం వారీగా ఉన్న భూములను గుర్తిస్తూ వాటి వివరాలను 43 రిజిష్టరుతో పాటు ఆన్ లైన్ లో కూడా నమోదు చేయడం జరుగుచున్నదన్నారు.  దేవాదాయ భూముల గుర్తింపు కార్యక్రమం మంచి పురోగతిలో నున్నదని ఇప్పటి వరకూ 4,65,428 ఎకరాల భూములను గుర్తించడం జరిగిందని తెలిపారు. దేవాదాయ భూములను సబ్ డివిజన్ చేస్తున్న సందర్బంగా కొన్ని ప్రైవేటు భూములు కూడా పొరపాటుగా దేవాదాయ భూముల జాబితాలోకి చేర్చడం జరిగిందన్నారు. అటు వంటి సమాచారాన్ని రెవిన్యూ శాఖ నుండి తీసుకుని ప్రైవేటు భూములకు సంబందించి ఎన్.ఓ.సి.లను గూడా జారీచేయడం జరుగుచున్నదని తెలిపారు. 


ప్రస్తుతం దేవాలయాలు, హెడ్ ఆఫీసుల్లో అమలు పర్చే బయోమెట్రిక్ అటిండెన్సు విదానంలో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో బయోమెట్రిక్ స్థానే ఏపిఎఫ్ఆర్ఎస్ విదానం అమలుకై  దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమినషర్ కు అదేశాలు జారీచేయడం జరిగిందని ఆయన తెలిపారు.  ప్రస్తుతం బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో పలు బ్యాంకుల్లో ఉన్న దేవాలయాల డిపాజిట్లు, సి.జి.ఎఫ్. నిధులను  మద్యంతరంగా ఉప సంహరించుకుని, ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం తిరిగి డిపాజిట్ చేయాల్సినదిగా ఆదేశించామన్నారు. టెండర్లలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు పర్చుతున్నప్పటికీ టెండర్ల ఖరారు విషయంలో మరింత పారదర్శకతను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో  టెండర్ల కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందన్నారు.  పలువురు ప్రజాప్రతినిధులు తమకు అందజేసిన అర్జీల పై శాఖా పరంగా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.  హైకోర్టులో పెండింగ్ లో నున్న పలు కేసుల స్థితిగతులపై కూడా సమగ్రంగా సమీక్షించడం జరిగిందన్నారు. Comments