డోన్ లో శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.*డోన్ లో శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*సంక్రాంతికి బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల భవనాన్ని ప్రారంభిస్తాం*


*కన్నపకుంట నుంచి కమలాపురం వరకూ రూ.3 కోట్లతో రహదారి ప్రారంభోత్సవం*


*రూ.35 లక్షలతో సచివాలయం, రూ.25 లక్షలతో ఆర్బీకే సెంటర్ ప్రారంభం*


*బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారంటీకి నో వారంటీ*


డోన్, నంద్యాల జిల్లా, 19 (ప్రజా అమరావతి); గత నాలుగున్నరేళ్లలో డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా చిరస్థాయిలో నిలిచిపోయే అభివృద్ధి జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సంక్రాంతి కల్లా డోన్ లోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల భవనాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం డోన్ మండలంలోని కన్నపకుంట నుంచి కమాలపురం వరకూ రూ.3 కోట్లతో నిర్మించిన రహదారిని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. కన్నపకుంటకు వచ్చిన మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి కన్నపకుంట గ్రామంలోని రహదారిని ప్రారంభించిన అనంతరం పాదయాత్రగా ప్రజలతో కలిసి కమలాపురం గ్రామం వరకూ వెళ్లారు. అక్కడ రూ.25 లక్షలతో అట్టహాసంగా తీర్చిదిద్దిన రైతుభరోసా కేంద్ర భవనానికి ఆర్థిక మంత్రి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రూ.35 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ కమాలపురం గ్రామంలో స్మశాన వాటికను ఏర్పాటు చేశామన్నారు. 2014 కంటే ఎక్కువ అభిమానం చూపి 2019లో తనను ప్రజలు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించడం వల్లే డోన్ అభివృద్ధి సాకారమైందన్నారు. డోన్ లో కాపు భవన్, వడ్డెర భవనం, బేతంచెర్లలో వాల్మీకి భవనం నిర్మిస్తున్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు.


*బాబు ష్యూరిటీ -భవిష్యత్ గ్యారంటీకి నో వారంటీ : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


కరోనా విపత్తులో పేదవారికి చిన్న కష్టం రాకుండా కాపాడుకున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. టీడీపీ చెబుతున్న బాబు ష్యూరిటీ -భవిష్యత్ గ్యారంటీకి నో వారంటీ అన్నారు. గత 40 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఇచ్చిన ష్యూరిటీకి ఒక్కటైనా గ్యారంటీగా చేశారా? అని మంత్రి ప్రశ్నించారు. సబ్సిడీ గ్యాస్, పొదుపు మహిళలకు వడ్డీ మాఫీ వంటి  పథకాల పేరు చెప్పి మహిళలను మోసం చేసిన చరిత్ర టీడీపీది అన్నారు. 3 సెంట్ల స్థలంలో ప్లాటు, రూ.లక్షన్నర నిర్మానానికి లబ్ధిదారులకు ఇస్తామన్న 2014 హామీని గాలికొదిలేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పథకాలు వర్తించాలంటే  టీడీపీలో లంచం మాత్రం గ్యారంటీ అన్నారు. దొంగ పాస్ పుస్తకాలు, కపట జాబ్ గ్యారంటీలే తప్ప చెప్పిందేదీ చేయని పార్టీ టీడీపీ అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.


*డోన్ నియోజకవర్గంలో పోటీ చేసేదెవరో టీడీపీకే స్పష్టత లేదు*


అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు రుణమాఫీ అర్హులైన అందరికీ ఇచ్చిన చరిత్ర వైఎస్ఆర్సీపీది అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఖజానా ఖాళీ చేశాం..ప్రభుత్వం నడవదు..పథకాలు సాగవు అన్న ప్రతిపక్షాల అపోహలను చెరిపివేస్తూ.. నాలుగన్నరేళ్లు ఒక్క పథకం కూడా ఆగకుండా కోవిడ్ లోనూ అందజేసి చరిత్ర సృష్టించామన్నారు. చెయ్యలేం, ఇవ్వలేమన్న ప్రతిపక్షాలకు సైతం పారదర్శకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పథకాలు అందించామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారన్నారు. ఊర్లో సర్పంచ్ గా గెలవలేని వాళ్లు డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్నారన్నారు. డోన్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీకి దిగే వారి పోటీ ఎక్కువైంది..ఎవరన్నది వారికే స్పష్టత లేదని తెలిపారు. 


*టీడీపీ పాలనలో లెట్రిన్ కూడా కట్టలేని వాళ్లు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదం*


డోన్ మండల వ్యాప్తంగా చేసిన అభివృద్ధిని డ్వాక్రా మహిళలకు త్వరలోనే చూపించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. లండన్ నిర్మాణాల తరహాలో డోన్ లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రేకులగుంట లాంటి చివరి గ్రామాల వరకూ రోడ్డులేని ఊరేదైనా ఉందా? అంటూ మంత్రి ప్రజలను సభ సాక్షిగా ప్రశ్నించారు. టీడీపీ పాలనలో లెట్రిన్ కూడా కట్టలేని వాళ్లు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రూ. కోట్లు ఖర్చు పెట్టి ముచ్చట్ల, కంబగిరి క్షేత్రాలను పున: నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజా సేవలో భాగంగా పదవీ, బాధ్యతలను బట్టి  కర్తవ్య నిర్వహణ కోసం మంత్రులు ఎక్కడనుండైనా పని చేస్తారని చెప్పారు. 


*'గెలిస్తే' అనే మెలికతో ..గెలిచినా ఆచరణ సాధ్యంకాని హామీలు టీడీపీకే చెల్లు*


డోన్ గ్రామీణ, పట్టణంలోని 36 వేల మంది పేదలకి సెంటున్నర ప్లాటిస్తామని టీడీపీ డోన్ ఇంఛార్జి ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. 900 ఎకరాల కోసం సగటున రూ.900 కోట్లు టీడీపీ ఇస్తుందా? డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఇస్తారా? ప్రజలకు సమాధానం ఇప్పటివరకూ చెప్పలేదన్నారు. గెలిస్తే అని మెలికపెట్టి..గెలిచినా ఆచరణ సాధ్యంకాని హామీలు టీడీపీకే చెల్లుతాయన్నారు. డోన్ నియోజకవర్గంలో ఎంతో మంది వస్తుంటారు..వాగ్ధానాలు ఇస్తూ పోతుంటారు..నిజంగా మనకోసం నిలబడి అభివృద్ధి చేసిన వారినే ఆలోచించి ఎన్నుకోవాలని ప్రజలకు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు.


 ఈ కార్యక్రమంలో  డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు,జెడ్పీటీసీ రాజ్ కుమార్, కన్నపకుంట సర్పంచ్ కల్యాణి, కమలాపురం గ్రామ సర్పంచ్ అర్జున్ రెడ్డి, ఎంఆర్వో విద్యాసాగర్,ప్రజలు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Comments