పియం జన్ మన్ కార్యక్రమంపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లతో వీడియో సమావేశం.

 పియం జన్ మన్ కార్యక్రమంపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లతో వీడియో సమావేశం


అమరావతి,2జనవరి (ప్రజా అమరావతి):దేశ వ్యాప్తంగా ఆదివాసీ,మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు ప్రత్యేకంగా వనరబుల్ ట్రైబల్ గ్రూపులు(PVTGs) సంక్షేమం కోసం గత నవంబరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రారంభించిన జన జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ పధకం(PM JANMAN) అమలుపై మంగళవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల తో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కేబినెట్ కార్యదర్శి మాట్లాడుతూ పియం జన్ మన్ యోజన 2023ను జార్ఖండ్ రాష్ట్రంలోని ఖుంటి జిల్లాలో బిర్సా ముండా జన్మదినోత్సవం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గిరిజన సంఘం ప్రజల కోసం ఈపథకాన్ని ప్రారంభించారన్నారు.ఈ పథకం ద్వారా గిరిజన మరీ ముఖ్యంగా పర్టిక్యులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూపులు(పివిటిజి)వర్గాల ప్రజల సంక్షేమం తోపాటు వారికి గృహనిర్మాణం,మరుగుదొడ్ల ప్రయోజనం,పింఛను ప్రయోజనం వంటి వివిధ రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు.ఇతర వెనుకబడిన తరగతుల మాదిరిగానే గిరిజన సంఘంలో కూడా వెనుకబడిన గిరిజనులు ఉన్నారని వీరిని ఎవరూ అంతగా పట్టించుకోరని అందుకే గిరిజనుల సంక్షేమం కోసం ఈకార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. మూడేళ్ళ కాలంలో అనగా 2023-24 నుండి 2025-26 వరకూ ఈకార్యక్రమాన్ని అమలు చేసేందుకు 24వేల 104 కోట్ల రూ.లను కేటాయించగా దీనిలో కేంద్రం వాటాగా 15వేల 336 కోట్లు,రాష్ట్రాల వాటాగా 8వేల 768 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు.దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 పివిటిజిలకు సంబంధించి 28 లక్షల మంది జనాభాకు లబ్ది కలిగించాల్సి ఉందని పేర్కొన్నారు.

వివిధ ఆదివాసీ ప్రాంతాలు,పివిటిజిల్లోని వారికి మిషన్ మోడ్ లో వివిధ కేంద్ర,రాష్ట్ర పధకాల ద్వారా పక్కా ఇళ్ళ నిర్మాణం,రహదార్లు అభివృద్ధి,మొబైల్ మెడికల్ యూనిట్లు ద్వారా ఆరోగ్య పరిరక్షణ,వసతి గృహాలకు రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించడం,ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం,ప్రతి ఇంటికీ పైపు ద్వరా తాగునీటి సరఫరా,కమ్యునిటీ వాటర్ సప్లై,అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం,మల్టీ పర్పస్ కేంద్రాల ఏర్పాటు,సోలార్ వీధి దీపాలు,మొబైల్ టవర్లు ఏర్పాటు, ఒకేషనల్ విద్యా కేంద్రాలు ఏర్పాటు ద్వారా వారికి నైపుణ్య శిక్షణ వంటివి కల్పించాల్సి ఉందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లకు సూచించారు.అలాగే ఆధార్ కార్డు,పియం గరీభ్ కళ్యాణ్ యోజన,పియం ఉజ్వల యోజన,ఆయుష్ మాన్ భారత్ కార్డులు పంపిణీ,పియం కిసాన్ సమ్మాన్ నిధి యోజన,కిసాన్ క్రెడిట్ కార్డు,పియం జన్ ధన్ యోజన,పియం జీవన్ జ్యోతి బీమా యోజన,పియం సురక్షా బీమా యోజన,పెన్షన్ యోజన,పియం విశ్వకర్మ,సుకన్య సమృద్ధి యోజన,పియం మాతృవందన యోజన,పియం సురక్షిత్ మైత్రీయ అభియాన్,పియం నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్,సికిల్ సెల్ మిషన్,నేషనల్ టిబి ఎరాడికేషన్ ప్రోగ్రామ్ కార్డుల పంపిణీ, ఆయా పధకాల కింద లబ్ది కలిగించడం చేయాల్సి ఉంటుందని తెలిపారు.ఇందుకుగాను 11 వివిధ లైన్ డిపార్టుమెంట్లు అనగా పిఆర్ అండ్ ఆర్డీ,హౌసింగ్,వైద్య ఆరోగ్యం,విద్యా,ఇంధన, గ్రామీణ నీటి సరఫరా,మహిళా శిశు సంక్షేమం,గిరిజన సంక్షేమం,ఐటిఅండ్ సి,నైపుణ్య శిక్షణ విభాగాలు ఇంటర్వెన్షన్ తో ఆయా సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందని అన్నారు.

ఈకార్యక్రమంపై ఇప్పటికే ఇటీవల జరిగిన సిఎస్ ల సమావేశంలో కూలంకుషంగా చర్చించడం జరిగిందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ గుర్తు చేశారు.ఈనెల15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడి వర్చువల్ గా టూవే ఇంటరాక్షన్ కింద పివిటిజి గ్రూపుల లబ్దిదారులతో మాట్లాడ నుండగా ఎపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్త బల్లుగుడ,పాత బల్లుగుడ ఆవాసాలకు చెందిన ఆదివాసీలతో మాట్లాడతారని చెప్పారు.ఈకార్యక్రమం అమలుకు జాతీయ స్థాయిలో కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి అధ్యక్షతన సెంట్రల్ హైపవర్ కమిటీ,రాష్ట్ర స్థాయిలో సిఎస్ అధ్యక్షతన అపెక్సు కమిటీ,జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీ,బ్లాకు స్థాయిలో బిడిఓ/ఎండిఓ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని కేబినెట్ కార్యదర్శి రాజీబ్ గౌబ తెలిపారు.

అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఈఅంశంపై అధికారులతో సమీక్షిస్తూ రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 3526 పివిటిజి ఆవాసాల్లోని లక్షా 13వేల 866 కుటుంబాల్లో 4లక్షల 37వేల 447 మంది పివిటిజి జనాభా ఉన్నారని పేర్కొన్నారు.వారిలో ముఖ్యంగా కొండ సవర,కొండరెడ్డి,కుటియా ఖాండ్,డోంగ్రీయా ఖాండ్,చెంచు,బోడో గడబ,గుటాబ్ గడబ,పోరెంగి పోజ్రా,ఖాండ్ పోజ్రా,బోండో పోజ్రా,కోలం వంటి తెగల జనభా ఉందని తెలిపారు.వారందరికీ గిరిజన సంక్షేమశాఖ,గృహ నిర్మాణ,విద్యా,వైద్య,స్త్రీశిశు సంక్షేమం,పిఆర్ అండ్ ఆర్డీ,వ్యవసాయ,రక్షిత మంచినీటి సరఫరా,ఇంధన,నైపుణ్య శిక్షణ విభాగాల ద్వారా వివిధ పధకాలు లబ్ది మిషన్ మోడ్ లో పూర్తి స్థాయిలో సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

ఈవీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.విజయానంద్,బి.రాజశేఖర్, యం.టి.కృష్ణబాబు,గోపాల కృష్ణ ద్వివేది,ముఖ్య కార్యదర్శులు ప్రవీణ్ ప్రకాశ్,జి.జయలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే,స్కిల్ డెవలప్మెంట్,పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్,గృహనిర్మాణ సంస్థ ఎండి లక్ష్మీ షా,డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ జె.వెంకట మురళి,పిఆర్ అండ్ ఆర్డీ,ఆరడబ్ల్యుఎస్ ఇఎన్సిలు బాలూ నాయక్,కృష్ణా రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments