ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై “సమర్థ్” మొబెల్ యాప్.

 *ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై “సమర్థ్”  మొబెల్ యాప్* 


*•శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలకు యాప్  ఎంతో ఉపయోగం* 

*•పోలీస్ బలగాల లొకేషన్ లు గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు*

*•సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాల లొకేషన్ ల గుర్తింపు సులభం* 

*•అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, సెక్టర్ ఆఫీసర్లు వినియోగించాలి*

*•యాప్ ను అభివృద్దిపర్చి ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న బాపట్ల ఎస్పీకి అభినందనలు*

*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా*


అమరావతి, ఏఫ్రిల్ 26 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో  మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటు వంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("SAMARTH"-Security Arrangement Mapping Analysis Response Tracking Hub)  మొబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ యాప్ ను అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, సెక్టర్ ఆఫీసర్లు వినియోగించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల వేళ స్మార్ట్ అండ్ క్విక్ పోలీసింగ్ కై   ఈ మొబైల్ యాప్ ఎంతగానో దోహదపడుతుందని, సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాల లొకేషన్లను ఎంతో సులభంగా గుర్తించ వచ్చని, తద్వారా మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ బృందాలను తక్షణమే పంపించేందుకు అవకాశం ఉంటుందని మరియు  కంట్రోల్ రూమ్ నుండే పోలీస్ బలగాల లొకేషన్ లు గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చనే అభిప్రాయాన్ని  ఆయన వ్యక్తం చేశారు.  సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇటు వంటి స్మార్ట్ అండ్ క్విక్ పోలీసింగ్ మొబైల్ యాప్ ను అభివృద్ది పర్చి  ప్రయోగాత్మకంగా బాపట్ల జిల్లాలో వినియోగిస్తున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ను ఆయన అభినందించారు. 


బాపట్ల జిల్లా ఎస్సీ  శ్రీ వకుల్ జిందాల్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనాను వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి తమ జిల్లాలో ఉపయోగిస్తున్న ఈ  సమర్థ్   మొబైల్  యాప్ విశిష్టతను, విశేషాలను వివరించారు.  తమ జిల్లా ఐటి కోర్ విభాగం రూపొందించిన  ఈ యాప్ ను  ప్రయోగాత్మకంగా ఈ నెల 22 వ తేదీ నుండి తమ జిల్లాలో వినియోగిస్తూ మంచి ఫలితాలను సాదిస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా పోలీస్ అధికారులు డైరెక్ట్ గా కాల్ చేయవచ్చని, ఒక్క నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వున్న 2000 మంది పోలీసులకు ఒకేసారి ఆదేశాల జారీ చేయవచ్చని తెలిపారు. మొబైల్ కి ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోయినా నోటిఫికేషన్ ద్వారా వారికి సమాచారం అందుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి వచ్చే పిటిషన్లను సంబంధిత పోలీస్ అధికారులకు యాప్ ద్వారా పంపి ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించవచ్చని తెలిపారు. మొత్తం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క వివరాలు, మొబైల్ నెంబర్స్ యాప్ నందు పొందుపరచబడినవి అని, తద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క రియల్ టైమ్ లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయడం జరుగుతుందన్నారు.  అదే విదంగా సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాలను గుర్తించడానికి, యాప్ నుండి నేరుగా కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయడానికి, సమస్యాత్మక ప్రాంతాలకు తక్షణమే పోలీస్ బలగాలు చేరుకోవడానికి, శక్తివంతమైన, బలమైన మరియు నిజ-సమయ అప్లికేషన్ గా ఈ  యాప్ పనిచేస్తున్నదని సి.ఇ.ఓ. శ్రీ ముకేష్ కుమార్ మీనాకు ఆయన వివరించారు. 


అదనపు సీఈఓ లు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, బాపట్ల జిల్లా ఐటీ కోర్ ఎస్సై నాయబ్ రసూల్  తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.Comments