సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు.

                                                                                        విజయవాడ (ప్రజా అమరావతి);

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు

మే 13 వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో పొరుగు రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఓటు వేసేందుకు వచ్చే ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు,ఐ.పి.ఎస్. తెలిపారు. 

మే 8 నుండి 12 తేదీ వరకు హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులు కూడా సాధారణ ఛార్జీలతోనే  నడపబడతాయని ఈ సందర్భంగా ఎం. డి. తెలియజేశారు. 

హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339  సర్వీసులతో పాటు  11 వ తేదీన 302 మరియు  12 వ తేదీన 205 ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.  మొత్తం 8 వ తేదీ నుండి 12 వరకు రోజువారీ నడిచే 1683 సర్వీసులతో పాటు 1048 ప్రత్యేక బస్సు సర్వీసులు మొత్తం కలిపి 2731 బస్సులు వివిధ ప్రాంతాలకు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఏర్పాటు చేసింది.  

హైదరాబాద్ లోని బి.హెచ్.ఈ.ఎల్., జీడిమెట్ల, ఈ.సి.ఐ.ఎల్., మహాత్మాగాంధీ బస్ స్టేషన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, MBXR పాయింట్ల నుండి ప్రత్యేక బస్సులు నడపబడుచున్నవి.  11వ తేదీన బి.హెచ్.ఈ.ఎల్. నుండి 158 స్పెషల్స్,  జీడిమెట్ల నుండి 9 స్పెషల్స్,  ఈ.సి.ఐ.ఎల్. నుండి 13, MBXR  నుండి 61, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుండి 59, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి 2 స్పెషల్ బస్సులతో కలిపి మొత్తం 302 బస్సులు అదే విధంగా 12 వ తేదీన బి.హెచ్.ఈ.ఎల్. నుండి 112  స్పెషల్స్,  జీడిమెట్ల నుండి 8 స్పెషల్స్,  ఈ.సి.ఐ.ఎల్. నుండి 11, MBXR నుండి 40, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుండి 27, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి 2 స్పెషల్ బస్సులతో కలిపి మొత్తం 205 బస్సులు ఏర్పాటు చేయబడ్డాయి.    

ఇప్పటికే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుండి వచ్చే వారు ముందస్తు  రిజర్వేషన్ చేయించుకోవడం వలన అన్ని బస్సులలో  సీట్లు పూర్తిగా నిండి పోయాయి.

బెంగుళూరు నుండి రాష్ట్రంలోని వివిధ నగరాలకు 11 వ తేదీన మొత్తం 323 బస్సులు, 12 వ తేదీన 269 బస్సులు నడుపుతోంది. రెగ్యులర్ గా నడిచే బస్సులతో  పాటు అదనంగా ఈ బస్సులను ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఏర్పాటు చేసింది. బెంగుళూరు నుండి కడపకు 11 వ తేదీన  మొత్తం (రెగ్యులర్ + స్పెషల్)   56 బస్సులు, 12 వ తేదీన మొత్తం 43, తిరుపతికి 11 వ తేదీన మొత్తం 40, 12 వ తేదీన మొత్తం 36, కర్నూలుకు 11 వ తేదీన మొత్తం 31, 12 వ తేదీన మొత్తం 25, అనంతపురం 11 వ తేదీన మొత్తం 55, 12 వ తేదీన 47 బస్సులు ఏర్పాటు చేసింది. అదే విధంగా విశాఖపట్నం, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కాకినాడ, విజయవాడ తదితర ప్రాంతాలకు కూడా బస్సులు ఏర్పాటు చేయబడ్డాయి.      

 ఓట్ల పండుగ కోసం పోటెత్తిన వారితో ఈ రోజు (11.04.2024) విజయవాడ బస్ స్టేషన్ రద్దీతో నిండిపోయింది.   ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన వారి కోసం ప్రత్యేక బస్సులు వివిధ ప్రాంతాల నుండి నడిపేందుకు ఆర్టీసీ సమాయాత్తమయ్యింది. 

విజయవాడ నుండి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు నడపబడుతున్నవి. హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చే ప్రయాణికులు అత్యధికంగా ఉండడం వలన రద్దీని బట్టి మరికొన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలు చేస్తోంది. 

అదేవిధంగా ఓటు వేసి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం కూడా ఆయా తేదీలలో ప్రత్యేక బస్సులు రద్దీని బట్టి ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల ప్రజా రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Comments