*టిడిపిని భూస్థాపితం చెయ్యాలన్న మీ కోరిక ఎన్నటికీ నెరవేరదు…!* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. రాష్ట్రంలో జగన్ పాలన నడుస్తోందా..? రాక్షసుల పాలన నడుస్తోందా..? అని ఆయన ప్రశ్నించారు. ఏడాది కాలంలో దాదాపు 1,500 మంది అమాయకులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. రాజధాని మార్చడమంటే.. రంగులు మార్చినంత ఈజీ కాదన్నారు ఆయన. రాష్ట్రంలో ఏడాదికాలంగా ఇనుప సంకెళ్ల పాలన నడుస్తోందని దుమ్మెత్తి పోశారు. వంద తప్పులు చేసిన వారినైనా ప్రజలు క్షమిస్తారు కానీ.. ఒక్క ఛాన్స్ తీసుకుని రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని మాత్రం ప్రజలు ఎన్నటికీ క్షమించరని అన్నారు బుద్దా. ప్రపంచ దేశాలు కరోనాతో వణికిపోతుంటే.. మన రాష్ట్రం కరోనా కన్నా భయంకరమైన వైకాపా ప్రభుత్వ చేతికి చిక్కి విలవిలలాడిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు ఎవరైనా సాక్ష్యాధారాలతో ప్రభుత్వ తప్పులను బయటపెడితే.. వారిని వెంటనే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ టీడీపీ నాయకులపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వైకాపా నాయకులపై మాత్రం ఒక్క కేసు పెట్టడం లేదు. ఇదెక్కడి న్యాయం..? అని ఆయన నిలదీశారు. కోడెల శివప్రసాదరావు గారిపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు..? అని ఆయన ప్రశ్నించారు. వైకాపా చేస్తున్న అక్రమాలు, అవినీతిపై పోస్టింగులు పెడితేనే మీరు అంతలా బాధపడినప్పుడు.. నిజాయతీగా జీవిస్తున్న వారిపై కేసులు పెడితే వారు మనోవేధనకు గురికారా..? అని నిలదీశారు. నిజాన్ని నిర్భయంగా చెప్పిన వారిపై కేసులు పెడుతున్నప్పుడు.. అబద్ధాలను అలవోకగా ప్రచారం చేస్తున్న వైకాపా శ్రేణులపై ఎందుకు పెట్టరు..? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డినే ఎల్లకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉండరని గుర్తుంచుకోండని ఆయన హితవు పలికారు. పొద్దున లేస్తే తెలుగుదేశం శ్రేణులపై ఏవిధంగా అక్రమ కేసులు పెట్టాలనే దానిపైనే దృష్టి పెడుతున్నారు తప్ప.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కనీసం ప్రయత్నించడం లేదన్నారు ఆయన. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనే మీ కోరిక ఎన్నటికీ నెరవేరదని స్పష్టం చేసారు.


Comments