అమరావతి రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష: క్యాంపు కార్యాలయంలో పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ అధికారులు. టూరిజంకు ఆంధ్రప్రదేశ్‌ పర్యాయ పదం కావాలి వెంటనే కొత్త టూరిజమ్‌ పాలసీని రూపొందించండి: ఆ దిశలో టూరిజమ్‌ ట్రేడ్‌ రెగ్యులేషన్‌ ప్రక్రియ కొనసాగాలి : పర్యాటకానికి సంబంధించిన అన్నింటి రిజిస్ట్రేషన్‌ జరగాలి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి ఎంపిక చేసిన సుమారు 12 పర్యాటక స్థలాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలంటే సదుపాయాలు కూడా అదే స్థాయిలో ఉండాలి మన పర్యాటక ప్రాంతాల వివరాలను పెద్ద ఆతిథ్య కంపెనీలకు ఇవ్వండి వారి ప్రతిపాదనలను తీసుకోండి అన్ని శిల్పారామాలను పునఃసమీక్షించాలి వాటిని అందంగా తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోండి: సీఎం అమరావతి: పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్‌ పర్యాయ పదం కావాలని, అందువల్ల వెంటనే కొత్త టూరిజమ్‌ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఆ దిశలో టూరిజమ్‌ ట్రేడ్‌ రెగ్యులేషన్‌ ప్రక్రియ కొనసాగాలన్న ఆయన, పర్యాటకానికి సంబంధించిన అన్నింటి రిజిస్ట్రేషన్‌ జరగాలని స్పష్టం చేశారు. ఎంపిక చేసిన స్థలాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్దేశించారు. విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలంటే సదుపాయాలు కూడా అదే స్థాయిలో ఉండాలన్నారు. మన పర్యాటక ప్రాంతాల వివరాలను పెద్ద ఆతిథ్య కంపెనీలకు ఇవ్వాలని, ఆ తర్వాత వారి ప్రతిపాదనలను తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని శిల్పారామాలను పునఃసమీక్షించాలని, వాటిని అందంగా తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్షించారు. క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. కొత్త టూరిజమ్‌ పాలసీ: ఈ ఏడాది మార్చి 31తో రాష్ట్రంలో టూరిజమ్‌ పాలసీ ముగిసినందున వెంటనే కొత్త పాలసీని రూపొందించాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు. పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్‌ పర్యాయ పదం కావాలన్న ఆయన, ఆ దిశలో పాలసీని రూపొందించాలని పేర్కొన్నారు. రెగ్యులేషన్‌ ఆఫ్‌ టూరిజమ్‌ ట్రేడ్‌: పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ లేదని, అందువల్ల వెంటనే అన్నింటి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టాలని సీఎం ఆదేశించారు. పర్యాటక రంగంలో ఉన్న టూర్‌ ఆపరేటర్లు, హోటళ్లు, వాటిలో అందుబాటులో ఉన్న గదులు, టూరిజయ్‌ అడ్వెంచర్‌కు సంబంధించిన ప్రదేశాలు, ఆయా చోట్ల ఉన్న సదుపాయాలు వంటి అన్నింటి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 7 స్టార్‌ సదుపాయాలు ఉండాలి: విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలంటే సదుపాయాలు కూడా అదే స్థాయిలో ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఆ విధంగా పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలను పెద్ద పెద్ద ఆతిథ్య కంపెనీలకు ఇవ్వాలని, వారి ప్రతిపాదనలను కూడా తీసుకోవాలని, ఆ తర్వాతే దేన్నైనా ఖరారు చేయాలని నిర్దేశించారు. పెట్టుబడులకు ఆయా సంస్థలు ముందుకు వచ్చేలా విధి విధానాలు ఉండాలని సూచించారు. అన్ని చోట్ల సెవెన్‌ స్టార్‌ సదుపాయాలతో కూడిన రిసార్టులు, హోటళ్లు అభివృద్ధి చేయాలని, కనీసం 12 ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల పూర్తి సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారు. శిల్పారామాలు: రాష్ట్రంలో పలు చోట్ల ఉన్న శిల్పారామాలను పునఃసమీక్షించాలని, వాటిని అందంగా తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. వాటిలో పదే పదే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి రాకూడదన్న ఆయన, ఆ దిశలో వాటిని అభివృద్ధి చేయాలని, అవసరమైన మార్పులు చేయాలని సూచించారు.


Comments