*అమరావతి* *26.౦6.2020* *రైతుభరోసా కేంద్రాల ద్వారా అందించే సేవలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ రూపొందించిన ''వైయస్ఆర్ యాప్'' ను క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌.* *ఈ యాప్ ద్వారా రైతుభరోసా కేంద్రాలు రైతులకు అందించే సేవలు, ఆర్‌బికె సిబ్బంది పనితీరు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫీడ్ బ్యాక్, ఆర్‌బికేల్లోని పరికరాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో రైతుల అవసరాలు, మెరుగైన సేవలకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను రియల్ టైంలో ఉన్నతస్థాయి వరకు తెలుసుకునే అవకాశం వుంటుందని సీఎంకు వివరించిన అధికారులు.* *పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి కె కన్నబాబు, వ్యవసాయమిషన్ వైస్ చైర్మన్ ఎం వి ఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ తదితరులు* *వైయస్ఆర్ యాప్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు* దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతుభరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ''వైయస్ఆర్ యాప్'' పేరుతో ఒక మొబైల్ యాప్ ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుభరోసా కేంద్రాల సిబ్బంది ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వపరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, రైతుభరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం, సదరు పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం, కొత్తగా ప్రజల కోసం రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కూడా రియల్ టైంలో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులు వేసే పంటలను ఈక్రాప్ కింద నమోదు చేయడం, పొలంబడి కార్యక్రమాలు, సిసి ఎక్స్‌పెరిమెంట్స్, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించడం, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణ, పంటలబీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్దం చేయడం, రైతులకు ఇన్‌పుట్స్ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఈ యాప్ లో ఆర్‌బికే సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీనిని ఉన్నతస్థాయిలోని అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్‌బికేల్లో డిజిటల్ రిజిస్టర్ ను నిర్వహించడం, ఆర్‌బికే ఆస్తులను పరిరక్షించడం, ఎక్కడైనా పరికరాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సకాలంలో రిపోర్ట్ చేయడం, డాష్‌బోర్డ్ లో ఆర్‌బికే కార్యక్రమాలను పర్యవేక్షించడం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల కార్యకలాపాలను పర్యవేక్షించడం, వివిధ పథకాలకు సంబంధించి సర్వే చేయడం, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ లను తీసుకోవడం కూడా ఈ యాప్ ద్వారా సాధ్యపడుతుంది. ఆర్‌బికె పెర్ఫార్మ్‌న్స్ డాష్‌బోర్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్‌బికేల పనితీరును పరిశీలించడం, సరిపోల్చడం, మెరుగైన పనితీరు కోసం ఎప్పటికప్పుడు సిబ్బందికి దిశానిర్ధేశం చేసేందుకు వీలుగా దీనిని రూపొందించారు. రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి అవసరాలను తీర్చడం, వారికి మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాచారం పొందేలా ఈ యాప్‌ రూపకల్పన చేశారు.


Comments