అచ్చెన్నకు చికిత్స చేసిన వైద్యులకు కరోనా?: ఆలపాటి గుంటూరు: జీజీహెచ్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజా వ్యాఖ్యానించారు. ఆదివారం జీజీహెచ్‌కు ఆలపాటి రాజా వచ్చారు. జీజీహెచ్‌లో కరోనా కలకలంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జీజీహెచ్‌లో ఓ వైపు కోవిడ్ కేసులు, మరోవైపు నాన్ కోవిడ్ చికిత్సలు చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించిన వైద్యులే ఇతర రోగులకూ వైద్య సేవలు అందిస్తున్నారని, దీని వల్ల ఇతర రోగులకూ కరోనా సోకే ప్రమాదం ఉందని అన్నారు. ఓ తల్లీ కూతురుకు కూడా ఇదే విధంగా కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. ఫలితంగా ఇతర రోగాలతో బాధపడుతున్న ప్రజలు ఇక్కడికి రావాలంటేనే భయపడుతున్నారని రాజా పేర్కొన్నారు. అచ్చెన్నాయుడుని రెండు వారాలుగా ఇక్కడే ఉంచి చికిత్స అందిస్తున్నారని, అచ్చెన్నకు వైద్యం చేసిన వైద్యులకు కూడా కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయని రాజా పేర్కొన్నారు. అచ్చెన్నకు వైద్యం చేసిన సిబ్బంది రిపోర్టులను తక్షణమే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అచ్చెన్న ఆరోగ్యంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజా డిమాండ్ చేశారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా అచ్చెన్నను కలవడానికి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోలేని పరిస్థితి ఉందన్నారు. అచ్చన్న పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.


Comments